గెలుపు కోసం వైసీపీ బరి తెగింపు

ABN , First Publish Date - 2021-04-09T07:12:47+05:30 IST

కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు అప్రజాస్వామికంగా మారింది. గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌, దొంగ ఓట్లు, బెదిరింపులకు దిగి బరితెగించారు.

గెలుపు కోసం వైసీపీ బరి తెగింపు
వీరరామాపురంలో రిగ్గింగ్‌పై ఓటర్ల నిరసన

కనిగిరి, ఏప్రిల్‌ 8: కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు అప్రజాస్వామికంగా మారింది. గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌, దొంగ ఓట్లు, బెదిరింపులకు దిగి బరితెగించారు. పలు చోట్ల ప్రజలను, పోలింగ్‌ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజాస్వామ్యం ఉందా..? లేదా..? అన్న తీరుగా ఇక్కడి పరిస్థితి ఉందనీ, ఓటు హక్కును ప్రశాంతంగా వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఓటర్లు ఆవేదన చెందారు. ప్రధాన ప్రతిపక్షం ఈ ఎన్నికలను పెద్దగ పట్టించుకోకపోయినప్పటికీ, వైసీపీ దాష్టికాలకు దిగడం గమనార్హం.

హనుమంతునిపాడు మండలంలో వీరరామపురం, వాలిచర్ల గ్రామం లో పోలింగ్‌ బూత్‌లకు వద్దకు ఎమ్మెల్యే సామాజిక వర్గం నేతలు దౌర్జన్యాలకు తెగబడి రిగ్గింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. వీరరామాపురంలో పోలింగ్‌ సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్న హోమ్‌గార్డు అధికార పార్టీ నేతలకు మద్దతు పలుకుతూ రిగ్గింగ్‌కు సహకరించినట్లు తెలుస్తోంది.  అక్కడ టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పోలింగ్‌ బూత్‌ వద్దకు ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ తమ అనుచరగణంతో చేరుకోవడంతో స్థానికులు, ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగి పోలింగ్‌ బూత్‌ వద్ద బైఠాయించారు. 

పీసీపల్లి మండలంలోని తలకొండపాడు పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లను వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. ఓట్లు చూపించి వైసీపీకి వేయాలని బెదిరింపులకు దిగారు. ఈ సందర్భంలో ఏజెంట్లు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న పోలీసులు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఇరు వర్గాలను హెచ్చరించి బయటకు పంపించారు. అదేవిధంగా లింగన్నపాలెంలో దొంగఓట్లు వేయిస్తున్న వైసీపీ నేతలను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద వైసీపీ నాయకులు హల్‌చల్‌ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు దృతరాష్ట్ర వైఖరితో విధులు నిర్వహించారు. 

పామూరులో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ నారాయణను అధికార పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. పోలింగ్‌ సమయంలో లేకుండా చేసేందుకు కుట్ర పన్ని అక్రమ అరెస్టులు చేయించారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఎన్నికల గుర్తు వరస మారడంపై ఎంపీడీవోను నారాయణ ప్రశ్నించారు. ఇదే అదునుగా వైసీపీ నాయకులు హుకుంతో ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌ ఎంఎల్‌ నారాయణను నెట్టుకుంటూ బయటకు ఈడ్చుకొచ్చాడు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఏజంట్లుగా మారారని ఎంఎల్‌ నారాయణ, సీపీఐ  కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వారిని అరెస్ట్‌ చేశారు. ఎన్నికల అధికారులు చేసిన తప్పిదాల గురించి ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమంగా అరెస్ట్‌ చేయిస్తారా అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌డి హనీఫ్‌ ప్రశ్నించారు. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆరోపించారు. మండలంలోని అయ్యన్నకోట, బోడవాడ, మోపాడు, రావిగుంటపల్లి గ్రామాల్లో జడ్పీటీసీ ఎన్నిక ఏగ్రీవంగా సాగిందని ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లను తోసివేసి అధికార పార్టీకి చెందిన వారు రిగ్గింగ్‌ చేశారని ఆరోపించారు. ఎలక్షన్‌ కూడా రద్దు చేసి రీ పోలింగ్‌ పెట్టాలన్నారు. పామూరులో జరిగిన ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమీషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.  సమావేశంలో కె మాల్యాద్రి, షేక్‌ ఖాదర్‌బాషా, సిపిఎం జడ్పీటీసీ అభ్యర్ధి నాగేశ్వరరావు, సీపీఎం ఎంపీటీసీ అభ్యర్ధులు షేక్‌ అల్లాభగష్‌, బత్తుల పరిమళాదేవి, ఇస్మాయిల్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-09T07:12:47+05:30 IST