మైనారిటీలపై మమకారం

ABN , First Publish Date - 2021-10-19T07:56:33+05:30 IST

గత ఏడాది వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్భాటంగా మైనారిటీలకు రూ.2,055 కోట్లు ప్రకటించి, ఖర్చు చేసింది రూ.892 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి మైనారిటీలపై ముఖ్యమంత్రి జగన్‌కు ఎంత మమకారముందో అర్థమవుతోందని పలువురు ముస్లిం పెద్దలు విమర్శిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్‌

మైనారిటీలపై మమకారం

  • ఆర్భాటంగా బడ్జెట్‌ కేటాయింపులు
  • ఖర్చు చేసింది నామమాత్రమే
  • స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తి
  • ఉన్నత, విదేశీ విద్యకు అందని భరోసా
  • దుల్హన్‌ పథకానికి చరమగీతం
  • రంజాన్‌ తోఫా మాయం
  • 43 లక్షల మైనారిటీలపై సవతి ప్రేమ
  • నేడు మిలాద్‌ ఉన్‌ నబీ
  • మాటల మాయ, అంకెల గారడీ

మైనారిటీలపై ఎనలేని మమకారం తమకే ఉందన్నారు. అధికారంలోకి వస్తే ఏదోదే చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ముందు పాదయాత్రలో ఊరూరా తిరిగి హామీలిచ్చి 43 లక్షల మంది మైనారిటీలకు ఎన్నో ఆశలు కల్పించారు. అయితే, అధికారంలోకి రాగానే తమను మరిచిపోయారని రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలు వాపోతున్నారు. బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారని, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే నష్టపోయింది ముస్లిం వర్గాలేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ఏడాది వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్భాటంగా మైనారిటీలకు రూ.2,055 కోట్లు ప్రకటించి, ఖర్చు చేసింది రూ.892 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి మైనారిటీలపై ముఖ్యమంత్రి జగన్‌కు ఎంత మమకారముందో అర్థమవుతోందని పలువురు ముస్లిం పెద్దలు విమర్శిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్‌ కేటాయించామంటూ జబ్బలు చరుచుకున్నారు. తీరా బడ్జెట్‌ ఆసాంతం పరిశీలించిన వారు ఈ జిమ్మిక్కులు చూసి నివ్వెరపోతున్నారు. అందరికీ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, వాహనమిత్ర, చేదోడు, విద్యాదీవెన తదితర నవరత్నాల పథకాలన్నింటినీ మైనారిటీ బడ్జెట్‌లో లెక్కించి తిమ్మిని బమ్మిని చేశారు.


చంద్రబాబు తెచ్చిన పథకాలను అటకెక్కించి నవరత్నాలే దిక్కని చెప్తున్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తి పలికి.. ముస్లిం, క్రైస్తవ  మైనారిటీ యువత స్వావలంబనకు ముగింపు పలికారు. ఉన్నత విద్య, విదేశీ విద్య మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్ష చేశారు.  ఎన్నో ఏళ్లుగా ముస్లిం యువతకు పెళ్లికానుకగా ఇచ్చే దుల్హన్‌ పథకానికి చరమగీతం పాడారు. గత ప్రభుత్వం పండుగల వేళ మైనారిటీ పేదలకు ఇచ్చిన రంజాన్‌ తోఫా పథకాన్నీ మాయం చేశారు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారంటూ... తాను వస్తే మైనారిటీలకు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఓటు బ్యాంకుగా జగన్‌ వాడుకున్నారని, కొత్త ప్రభుత్వం వచ్చి ఏం ఉద ్ధరించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కేటాయింపులు నవరత్నాలకు మళ్లింపు..

వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి వెన్నంటి నిలిచిన మైనారిటీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, మైనారిటీలకు ఇచ్చే నవరత్నాలన్నింటినీ బడ్జెట్‌లో లెక్కించి రూ.2,055 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించారు. ఆయా నిర్దేశించిన కార్యక్రమాలకు కాకుండా ఆ నిధులన్నీ నవరత్నాలకు మళ్లించారు. దీంతో మైనారిటీ సంక్షేమం, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కింద అమలవుతున్న కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు జగనన్న అమ్మఒడి కోసం రూ.433 కోట్లు,  వైఎ్‌సఆర్‌ ఆసరా కోసం రూ.295 కోట్లు, వైఎ్‌సఆర్‌ చేయూత కోసం రూ.173 కోట్లు, వైఎ్‌సఆర్‌ వాహనమిత్ర కోసం రూ.38 కోట్లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం జగనన్న విద్యాదీవెనకు రూ.213 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.140 కోట్లు కేటాయించారు. వీటిలో సుమారు రూ.1,292 కోట్ల నిధులను నవరత్నాలకు మళ్లించారు. అంటే అంతకు ముందు సంవత్సరం(2019-20) బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే తక్కువగానే ఉందని అర్థమవుతోంది. అంకెల గారడీ చేశారంటూ మైనారిటీలు గగ్గోలు పెడుతున్నారు. 


స్వయం ఉపాధికి రిక్త హస్తం ...

ముస్లిం, క్రైస్తవ మైనారిటీల్లో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారు. ముస్లింలలో ఎక్కువ మంది పట్టణాలు, మండల కేంద్రాల్లో వెల్డింగ్‌షాపులు, మెకానికల్‌ షాపులు, పాత ఇనుప సామానులు, చిన్న చిన్న స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయం ఇలాంటి వర్గాలకు అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశముంటుందని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చింది. ఏసీ, రిఫ్రిజిరేటర్‌, ఆటోమొబైల్‌, వెబ్‌ డిజైనింగ్‌, బుక్‌ పబ్లిషింగ్‌, అకౌంట్స్‌, మెడికల్‌ ల్యాబ్‌, సోలార్‌ టెక్నీషియన్‌, డ్రైవర్‌ కం మెకానిక్‌ తదితర పలు రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించింది. బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షలు రుణమిప్పించి, అందులో సబ్సిడీగా ప్రభుత్వం రూ.లక్ష ఇచ్చింది. అంతకు ముందు వయోపరిమితి 21-45 ఏళ్లు ఉండగా, దానిని 21-55 ఏళ్లకు పెంచారు. దీంతో  ఏటా 10 వేల మంది ముస్లిం, క్రైస్తవ యువత చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లిం, క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది.


దీంతో పాటు దుకాన్‌, మకాన్‌ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తామని దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ ఇంటర్వ్యూలు అర్ధాంతరంగా నిలిపేశారు. నవరత్నాలు ఇస్తున్నందున మళ్లీ స్వయం ఉపాధి యూనిట్లు ఎందుకని ప్రభుత్వ పెద్దలు సెలవివ్వడంతో అధికారులు ఆ ప్రక్రియను అక్కడితో ఆపేశారు. దీంతో అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే మైనారిటీ కార్పొరేషన్‌, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ యువతకు స్వయం ఉపాధి యూనిట్లు అందించలేకపోయాయి. 


దుల్హన్‌ పథకానికి స్వస్తి...

ముస్లిం వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన దుల్హన్‌ పథకం ఎంతో ప్రయోజనం కలిగించేది. ప్రభుత్వం వధువులకు రూ.50 వేల ఆర్థిక సాయం చేయడం ద్వారా పేద ముస్లిం కుటుంబాలు ఎంతో ఊరట చెందాయి. అప్పట్లో ఆ పథకానికి ఎంతో ప్రాచుర్యం లభించింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక అన్ని పెళ్లికానుక పథకాలకూ స్వస్తి పలికింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వర్గాలకు ఇస్తున్న పారితోషికం కూడా నిలిపివేసింది.  


రంజాన్‌ తోఫా సఫా..

గత ప్రభుత్వం ముస్లింలకు రంజాన్‌ తోఫా అందించింది. పేద, ధనిక తేడాల్లేకుండా అందరూ పండుగ చేసుకోవాలంటూ కార్డుదారులకు సరుకులను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు 10 లక్షల కుటుంబాలు రంజాన్‌తోఫాను అందుకున్నాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోఫాను సఫా చేశారని ముస్లిం వర్గాలు వాపోతున్నాయి. కొత్త ప్రభుత్వంలో వాటికి  ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే పాస్టర్లకు పారితోషికం ప్రకటించింది. క్రైస్తవులకు ఇచ్చి ముస్లింలకేమీ చేయకుంటే వ్యతిరేకత వస్తుందనే భయంతో మౌజన్లు, ఇమామ్‌లకు అప్పటికే ఇస్తున్న పారితోషికం కొంత మేరకు పెంచారు. 


ఇస్లాం బ్యాంక్‌ ఏదీ?..

2014 ఎన్నికల ముందు టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చి మరచిపోయారంటూ పాదయాత్ర సందర్భంగా జగన్‌ ప్రతి ఊళ్లో విమర్శలు గుప్పించారు. ముస్లింలను టీడీపీకి దూరం చేసేందుకు సెంటిమెంట్‌ను వాడుకున్నారు. సాధారణంగా ముస్లింలు వ్యాపారం చేసేందుకు వడ్డీకి రుణం తీసుకోడానికి ఇష్టపడరు. ఇస్లామిక్‌ బ్యాంక్‌ అంటే వడ్డీ లేకుం డా రుణాలివ్వడం. ఆ బ్యాంకును ఏర్పాటు చేస్తామని బాబు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదంటూ జగన్‌ ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇస్లామిక్‌ బ్యాంకును ఏర్పాటు చేస్తామన్నని ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. ఉన్న స్వయం ఉపాధి పథకాలకూ స్వస్తి పలికారు.


ఆగిన మసీదు, చర్చి నిర్మాణాలు

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, మసీదుల నిర్మాణాలకు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో 316 దర్గాలు, 1,365 మసీదులు, 43 ఖబరస్థాన్లు, 1548 అషూర్‌ఖానాలు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలు(మొత్తం సుమారు 3,500)లకుమరమ్మతులు, ఇతర భవనాల నిర్మాణాలకు నిధులు ఖర్చు చేశారు. ఒక్కో జిల్లాకు రూ.2.50 కోట్లు మసీదుల మరమ్మతుల కోసం మంజూరు చేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాదీఖానాలకు రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. మిగతా నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. 


ఉన్నతవిద్యకూ అందని భరోసా..

గత ప్రభుత్వంలో మైనారిటీ విద్యార్థుల ఉన్నతవిద్యకు ఒక భరోసా ఉండేది. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, డీఎస్సీ శిక్షణ పొందేందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించేది. దేశంలో ఉన్నతమైన కోచింగ్‌ సెంటర్ల శిక్షణ, వసతి కోసం ఫీజులను చెల్లించేది. ఆ సాయంతో శిక్షణ తీసుకున్న ముస్లిం, క్రైస్తవ యువకులు ఎందరో ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో చదవాలనుకున్న మైనారిటీ యువతకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించింది. వైసీపీ ప్రభుత్వం విదేశీ, ఉన్నతవిద్య కార్యక్రమాలను రద్దు చేయడంతో మైనారిటీలపై ఆర్థి క భారం పడింది. నవరత్నాల పథకాలతో ఉన్నతవిద్యకు భరోసా అందడం లేదని ముస్లిం, క్రైస్తవ యువ త ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను రద్దు చేయడంతో ముస్లిం, క్రైస్తవ విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలలకు దూరమయ్యారు. 

Updated Date - 2021-10-19T07:56:33+05:30 IST