ఎట్టెట్టా... పార్కులూ తాకట్టా!

ABN , First Publish Date - 2021-10-12T07:48:05+05:30 IST

‘కాదేదీ తాకట్టుకు అనర్హం’ అన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా మారింది. అప్పుల కోసం ప్రజలకు వినోదాన్ని పంచే పర్యాటక పార్కులు, రిసార్టులను బ్యాంకులకు తనఖా పెట్టేందుకు సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి మాటున పర్యాటక శాఖ ఆస్తులను వరుసగా..

ఎట్టెట్టా... పార్కులూ తాకట్టా!

  • 147కోట్ల కోసం వందల కోట్ల విలువైన 
  • ఆస్తులు కుదువ పెట్టేందుకు సిద్ధం 
  • 6 నెలలుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు 
  • తనఖా జాబితాలో 15 మేజర్‌ ఆస్తులు 
  • విజయవాడలోని బరమ్‌ పార్క్‌, నెల్లూరు, 
  • కడప, దిండి, కర్నూలులో హరిత రిసార్ట్‌లు 
  • ఆస్తుల అంచనా వేసిన అధికారులు 
  • తొలివిడతలో 35కోట్ల రుణానికి ఓకే
  • రెండో విడతకు మరికొన్ని ఆస్తుల జాబితా
  • పర్యాటక శాఖనూ వదలని సర్కారు  


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘కాదేదీ తాకట్టుకు అనర్హం’ అన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా మారింది. అప్పుల కోసం ప్రజలకు వినోదాన్ని పంచే పర్యాటక పార్కులు, రిసార్టులను బ్యాంకులకు తనఖా పెట్టేందుకు సిద్ధమైంది.  పర్యాటకాభివృద్ధి మాటున పర్యాటక శాఖ ఆస్తులను వరుసగా తాకట్టు పెట్టేస్తోంది. కేవలం రూ.147 కోట్ల కోసం ఆ శాఖకు చెందిన 15 మేజర్‌ ఆస్తులను కుదువ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. శాఖకు చెందిన హరిత రిసార్ట్‌లు, ఇతర రెస్టారెంట్ల అభివృద్ధి కోసమే ఈ రుణాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోగా... ఆస్తులు తాకట్టు పెట్టుకుని, పర్యాటకాభివృద్ధి చేసుకోండి అంటూ ఉచిత సలహా ఇవ్వడంతో శాఖ ఉన్నతాధికారులు ఆరు నెలల నుంచి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ససేమిరా అనడంతో అధికారులు ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయించారు. రుణం కోసం వివిధ జిల్లాల్లోని 15 పర్యాటక ఆస్తులను తాకట్టు పెడతామంటూ వాటి జాబితాను సిద్ధం చేశారు. విజయవాడ భవానీ ఐల్యాండ్‌కు సమీపంలో ఉన్న బరమ్‌ పార్క్‌తో పాటు నెల్లూరు, కడప, దిండి, కర్నూలులోని హరిత రిసార్ట్‌లతో పాటు మరో 10 ఆస్తుల వివరాలను బ్యాంకులకు అందించారు. ఇందులో బరమ్‌ పార్క్‌, నెల్లూరు, కడప, దిండి, కర్నూలు హరిత రిసార్ట్‌లపై తొలి విడత రుణం ఇచ్చేందుకు ప్రైవేటు బ్యాంక్‌ ఆంగీకరించింది. ఇప్పటికే ఆ ఆస్తుల విలువపై బ్యాంకు వాల్యూయర్స్‌ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే పర్యాటక శాఖ తాకట్టు పెడుతున్న ఆస్తులకు, తీసుకున్న లోన్‌కు సంబంధం లేదని చెబుతున్నారు. లోన్‌ విలువ కంటే ఆస్తుల విలువ చాలా ఎక్కువ ఉంది. మరో నెల రోజుల్లో బ్యాంకులు ఎంచుకున్న ఆస్తులను మార్టిగేజ్‌ చేసేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. తొలి విడతలో 75 కోట్ల రుణం పొందనుంది. ముందుగా రూ.35 కోట్లు తీసుకుంటున్నారు. రెండో విడతలో మరో రూ.72కోట్ల రుణాలకు పర్యాటక శాఖ వెళ్లనుంది. హరిత పార్కులు, రెస్టారెంట్ల రీమోడలింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంకులకు రీపేమెంట్‌ చేస్తామని అధికారులు ప్రతిపాదించారు.


అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయిన వైసీపీ సర్కారు... ఇప్పటికే విశాఖలో విలువైన ప్రభుత్వ ఆస్తులను చీకటి మాటున బ్యాంకులకు తనఖా పెట్టింది. దానిపై రచ్చ కొనసాగుతుండగానే కేవలం రూ.147 కోట్ల కోసం పర్యాటక శాఖ ఆస్తులను  కుదువ పెట్టేందుకు సిద్ధమైంది. 

Updated Date - 2021-10-12T07:48:05+05:30 IST