బరితెగించి బ్లాక్‌మెయిలింగ్‌!

ABN , First Publish Date - 2020-09-20T05:58:01+05:30 IST

ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటు న్యాయమూర్తులకు, ఎన్‌జీఓలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అమరావతిలో స్థలాలు పొందిన న్యాయమూర్తులు 25 లక్షల రూపాయల....

బరితెగించి బ్లాక్‌మెయిలింగ్‌!

ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటు న్యాయమూర్తులకు, ఎన్‌జీఓలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అమరావతిలో స్థలాలు పొందిన న్యాయమూర్తులు 25 లక్షల రూపాయల వంతున ప్రభుత్వానికి చెల్లించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం న్యాయమూర్తులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిందని మంత్రులు సైతం ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? పలు ఇతర రాష్ర్టాలలో కూడా న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ వస్తున్నారు. అంతెందుకు– సుప్రీంకోర్టులో పనిచేసిన, చేస్తున్న న్యాయమూర్తులకు కూడా నోయిడా వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించారు. విశాఖపట్టణంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాజాగా హామీ ఇవ్వలేదా? ఇవన్నీ చెప్పుకొనే అవకాశం న్యాయమూర్తులకు ఉండదు. దీంతో జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారం వల్ల ప్రజలలో న్యాయ వ్యవస్థపై అపోహలు తలెత్తే ప్రమాదం ఉంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను చంపేసి ఇష్టారాజ్యంగా పాలన సాగించాలనీ, చట్టాలను, నిబంధనలను, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజల హక్కులను హరించాలనుకునే వారే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు.


జీఎస్‌టీ బకాయిల చెల్లింపు వంటి విషయాలలో రాష్ర్టానికి న్యాయం చేయాలని తెలంగాణ ఎంపీలు అదే పార్లమెంట్‌ ఆవరణలో నినదించగా, అమరావతి భూములపై సీబీఐ విచారణ కావాలని మాత్రమే వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వపరంగా చేస్తున్న తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంతో పాటు ప్రత్యర్థులను కేసులలో ఇరికించడమే ఏకైక లక్ష్యంగా జగన్‌ సర్కారు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా? లేదా? అన్నది హైకోర్టు నేరుగా, వేగంగా విచారణ జరిపి తేల్చడం మంచిది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటే నష్టపోయినవాళ్లు ఫిర్యాదు చేస్తారు. అధికార పార్టీ వాళ్లు అయినకాడికి తమ భూములు కొట్టేశారని ఒక్క రైతు కూడా చెప్పలేదు. అయినా జగన్‌ అండ్‌ కోకు మాత్రమే అక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కనపడుతోంది. అమరావతిని చంపేయడానికి ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారన్నది వాస్తవం.


‘ఉల్టాచోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటే ఏమిటో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. అధికార వైసీపీ నాలుగైదు రోజులుగా న్యాయ వ్యవస్థపై ముప్పేట దాడి చేస్తున్నది. ఇందుకు పార్లమెంటును కూడా వాడుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టడం సర్వసాధారణం అయింది. ఈ పరిస్థితి తలెత్తడానికి నిబంధనలను, విధానాలను, చట్టాలను, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు తీసుకోవడం అన్న వాస్తవాన్ని గుర్తించకుండా న్యాయ వ్యవస్థ టార్గెట్‌గా కొంతకాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌ వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌ అండ్‌ కో దూకుడు పెంచడానికి కారణం ఏమిటో, వారు చేస్తున్న ఆరోపణలలో హేతుబద్ధత ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న అధికార పార్టీ తాజాగా మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరిపై కేసు నమోదు చేయించింది. తమకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని తెలుసుకున్న శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వివరాలను మీడియాలో ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిరోధించాలని కూడా ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వ్యక్తిత్వ హననం జరుగుతుందని భావించినప్పుడు పిటిషనర్లు ఇలాంటి అభ్యర్థనలు చేయడం మమూలే! వాదనల అనంతరం శ్రీనివాస్‌ కోరిన విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులు మీడియా స్వేచ్ఛకు విఘాతమనీ, పత్రికల గొంతు నొక్కేయడమేననీ అధికార పార్టీ నాయకులు విమర్శించారు.


కేసు విచారణకు రాకముందే ఎఫ్‌ఐఆర్‌ కాపీని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన విషయాన్ని శ్రీనివాస్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడంతో న్యాయమూర్తి వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారా? హైకోర్టు తన పరిధిని అతిక్రమించి ఉత్తర్వులు ఇచ్చిందా? అన్న విషయం పరిశీలిద్దాం. ఫలానా చోట రాజధాని వస్తుందని అప్పటి ప్రభుత్వం 2014 సెప్టెంబరు మొదటి వారంలో ప్రకటించిన తర్వాత మాత్రమే శ్రీనివాస్‌ గానీ, ఆయన బంధువులు గానీ అక్కడ భూములు కొనుక్కున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత లావాదేవీలు జరిగితే అది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అవుతుందని ఈ దేశంలో ఏ చట్టం చెబుతోందో జగన్‌ అండ్‌ కో స్పష్టం చేయాలి. 2014లో జగన్‌ అధికారంలోకి వస్తారన్న నమ్మకంతో ఆయనను ఇష్టపడేవారు ప్రకాశం జిల్లాలోని దొనకొండ వద్ద భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా అదే అంచనాతో దొనకొండ వద్ద భూములు కొనుగోలు చేసినవారు ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నూజివీడు పరిసరాల్లో రాజధాని రావొచ్చునన్న పత్రికా వార్తల ఆధారంగా పలువురు అక్కడ భూములు కొనుక్కున్నారు. ఇదొక సహజ పరిణామం.


ధరలు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో భూములు కొనుక్కోవడం ఎక్కడైనా జరిగేదే! అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందినవారు అమరావతిలో భూములు ఎందుకు కొన్నారు? వారి ప్రాంతంలో కొనుక్కోవచ్చుగా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మరి ఆయన విజయనగరంలో కొనుక్కోకుండా విశాఖ, హైదరాబాద్‌లలో ఎందుకు కొన్నారో చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పులివెందులలో కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్దఎత్తున ఆస్తులను ఎందుకు సమకూర్చుకున్నారు? తాడేపల్లిలో బినామీ పేరు మీద భవనాన్ని ఎందుకు కట్టుకున్నారు? రాజధానిలో భూమి ఉండాలని ఎవరైనా భావిస్తారు కదా? ప్రభుత్వ నిర్ణయం వెలువడటానికి కొద్దిగా ముందు భూములు కొని ఉంటే అది అనైతికం అవుతుంది గానీ చట్ట విరుద్ధం అని చెప్పలేం. దమ్మాలపాటి శ్రీనివాస్‌కు భూమిని అమ్మిన వ్యక్తి కూడా ప్రభుత్వ నిర్ణయం తర్వాత భూమి కొనుక్కుని అమ్ముకున్నారు. మొదటగా శ్రీనివాస్‌, మరొకరిపై మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారన్నది జవాబు దొరకవలసిన ప్రశ్న. నిజానికి రాజధాని ఎక్కడ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికి నిర్ణయించుకోలేదు. మధ్యలో నది ఒడ్డున ఉండాలనుకున్నారు. భూసమీకరణ కింద తమ భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరించిన తర్వాత మాత్రమే ప్రస్తుత ప్రదేశంలో రాజధాని నిర్మించాలని నిర్ణయించారు. శ్రీనివాస్‌, ఆయన బంధువులు 40 ఎకరాలు కొనుగోలు చేశారనీ, అందులో 10 ఎకరాలు కోర్‌ క్యాపిటల్‌లో ఉన్నాయనీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.


అప్పనంగా లాభపడే ఆలోచనే చేసి ఉంటే మొత్తం 40 ఎకరాలను కోర్‌ క్యాపిటల్‌లోనే కొనుగోలు చేసేవారు కదా? రాజధానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచికచర్లలో కొనుగోలు చేసిన భూమిని కూడా ఈ ఖాతాలో వేయడాన్ని బట్టి ప్రభుత్వ ఆంతర్యం అర్థమవుతోంది. జగ్గయ్యపేట వద్ద బీజేపీ ఎంపీ సుజనాచౌదరి 2012లో భూములు కొంటే దాన్ని కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని విమర్శించారు. తప్పు చేయకపోయినా దురుద్దేశంతో తనపై కేసు పెట్టారని శ్రీనివాస్‌ కోర్టును ఆశ్రయించడం తప్పు ఎలా అవుతుంది? ఇక మీడియా స్వేచ్ఛకు సంబంధించి వైసీపీ నాయకులు న్యాయ వ్యవస్థను నిందించడం ‘అచ్చంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’గానే ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపి వేయించినవాళ్లు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటం రోతగా ఉంది. గిట్టని మీడియా సంస్థలకు ప్రకటనలు నిషేధించిన వాళ్లా మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడేది? అయినా హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం కొత్త కాదు. అసాధారణమూ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్‌భవన్‌లోనే అప్పటి గవర్నర్‌ ఎన్‌.డి.తివారీ రాసలీలలకు పాల్పడిన విషయాన్ని స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఏబీఎన్‌ చానెల్‌ బయటపెట్టినప్పుడు, సదరు కథనాన్ని ప్రసారం చేయకుండా నిలిపివేయాలని అప్పటి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. నాటి గవర్నర్‌ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అందజేసిన లేఖ ఆధారంగా మేం ఏమి ప్రసారం చేయబోతున్నామో కూడా అడగకుండానే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. నీరా రాడియా, రతన్‌ టాటా మధ్య జరిగిన సంభాషణల వివరాలను కూడా ప్రచురించకూడదని, ప్రసారం చేయరాదని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో! న్యాయ వ్యవస్థను నిందిస్తున్నవారు ఇప్పుడు ఏం చెబుతారు? మేము కేసులు పెట్టకూడదా? దర్యాప్తు చేయకూడదా? అని జగన్‌ అండ్‌ కో ప్రశ్నిస్తోంది.


తప్పు చేసినవారిపై కేసులు పెట్టాల్సిందే! విచారణ చేయాల్సిందే! అమరావతి విషయంలో మనసులో మరేదో పెట్టుకుని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిపోయిందని చెబుతూ.. గిట్టనివారిని కేసుల్లో ఇరికించడం సమర్థనీయమా? అయినా సోకాల్డ్‌ భూకుంభకోణంపై విచారణ చేయాల్సిందిగా సీబీఐని కోరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా విచారణ చేయడం, కేసులు పెట్టడం ఏమిటి? ఒక తెలుగువాడు సుప్రీంకోర్టులో అత్యున్నత స్థానానికి చేరుకోకుండా అడ్డుకోవడానికి పన్నుతున్న పన్నాగాలను చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా? ఆ న్యాయమూర్తి టార్గెట్‌గా జగన్‌ అండ్‌ కో చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులను బట్టి వారి ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోంది కదా? ఈ నేపథ్యంలోనే మొత్తం న్యాయ వ్యవస్థను టార్గెట్‌గా చేసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. 2010 నుంచి 2019 మధ్య కాలంలో హైకోర్టు ఇలా లేదే అని ఎంపీ విజయసాయిరెడ్డి బోలెడంత ఆశ్చర్యాన్ని ఒలకబోశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైకోర్టు కొన్ని నిర్ణయాలను తప్పుబట్టింది. సింగపూర్‌ కన్సార్షియం విషయంలో కూడా స్టే విధించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు వివరాలను మీడియాకు ఇవ్వకూడదని ఆదేశించడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కేసు గురించి మాట్లాడకూడదని హైకోర్టు సూచించింది. అయినా అప్పటి ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలను శిరసావహించిందే గానీ తప్పుబట్టలేదు. తెలంగాణలో కూడా హైకోర్టు పలు విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సేకరించదలుచుకున్న భూములకు తగినంత పరిహారం ఇచ్చేవరకు భూసేకరణకు అనుమతించబోమని హైకోర్టు స్పష్టంచేయగా, కేసీఆర్‌ ప్రభుత్వం ఆ మేరకు హామీ ఇచ్చి న్యాయస్థానం అనుమతి పొందింది. ఎర్రమంజిల్‌ వద్ద అసెంబ్లీ కోసం నూతన భవనాన్ని నిర్మించాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, ‘హెరిటేజ్‌ భవనాన్ని ఎలా కూల్చివేస్తారు?’ అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ప్రతిపాదనను విరమించుకున్నారే గానీ జగన్‌ అండ్‌ కో తరహాలో న్యాయ వ్యవస్థను తప్పుబట్టలేదే!



ఎన్నడూ ఎరుగని దాడి!

న్యాయ వ్యవస్థపై చేస్తున్న ముప్పేట దాడికి పరాకాష్టగా ‘‘నాటి చంద్రబాబు ప్రభుత్వం పది మంది న్యాయమూర్తులకు అమరావతిలో ఇళ్లస్థలాలు కేటాయించింది. అందుకే తీర్పులన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి’’ అని వైసీపీ అధికారిక సోషల్‌ మీడియా వేదికలో పోస్టింగ్‌ పెట్టారు. ఇలా చేయడం న్యాయమూర్తుల శీలహననమే అవుతుంది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్టుగా జగన్‌ అండ్‌ కో ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటు న్యాయమూర్తులకు, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిందని మరోవైపు దుష్ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇదివరకే సొంత ఇళ్లు ఉన్నవారికి స్థలాలు కేటాయించకూడదని, వాళ్లు తీసుకోకూడదని మాత్రమే సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటు న్యాయమూర్తులకు, ఎన్‌జీఓలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అమరావతిలో స్థలాలు పొందిన న్యాయమూర్తులు 25 లక్షల రూపాయల వంతున ప్రభుత్వానికి చెల్లించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం న్యాయమూర్తులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిందని మంత్రులు సైతం ప్రచారం చేయడం దుర్మార్గం కాదా? పలు ఇతర రాష్ర్టాలలో కూడా న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ వస్తున్నారు. అంతెందుకు– సుప్రీంకోర్టులో పనిచేసిన, చేస్తున్న న్యాయమూర్తులకు కూడా నోయిడా వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించారు.


విశాఖపట్టణంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాజాగా హామీ ఇవ్వలేదా? ఇవన్నీ చెప్పుకొనే అవకాశం న్యాయమూర్తులకు ఉండదు. దీంతో జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారం వల్ల ప్రజలలో న్యాయ వ్యవస్థపై అపోహలు తలెత్తే ప్రమాదం ఉంది. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను చంపేసి ఇష్టారాజ్యంగా పాలన సాగించాలనీ, చట్టాలు, నిబంధనలను, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజల హక్కులను హరించాలనుకునే వారే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రభుత్వాలు దుందుడుకుగా వ్యవహరించినప్పుడు ముకుతాడు వేయడానికే న్యాయ వ్యవస్థ ఉంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనను గంపగుత్తగా సమీక్షించి విచారణ చేయాలనుకోవడాన్ని ఏ న్యాయస్థానమైనా ఎలా అనుమతిస్తుంది? ఏ ప్రభుత్వానికి కూడా ఇలాంటి అపరిమిత అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ‘‘మా దారిలోకి ఎవరైనా రావాల్సిందే– లేని పక్షంలో ఇలాగే బురద పూస్తాం’’ అన్నట్టుగా జగన్‌ అండ్‌ కో తీరు ఉంది. కులగజ్జిని ఒళ్లంతా అంటించుకుని, కుల ద్వేషాన్ని నరనరాన నింపుకోవడం వల్ల కుళ్లిపోయిన కొంతమంది మేధావులు కూడా ప్రభుత్వానికి వంతపాడటం వింతగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ రాజా ఇళంగో అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్‌ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేయగా, జస్టిస్‌ రాజా ఇళంగో స్టే విధించారు. హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు.


అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్‌ రాజా ఇళంగోనే! జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది క్రితం సదరు జస్టిస్‌ రాజా ఇళంగోను రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా నియమించారు. అప్పట్లో జగన్‌కు లభించిన ఉపశమనాలను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించలేదు. గతంలో మేలు చేసినందుకే జస్టిస్‌ రాజా ఇళంగోకు పదవి కట్టబెట్టారని ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శించలేదు. సంస్కారం అంటే అది! న్యాయ వ్యవస్థను మేనేజ్‌ చేస్తున్నారంటూ జగన్‌ అండ్‌ కో విచ్చలవిడిగా బరి తెగించి మరీ ఆరోపిస్తున్నప్పటికీ; జస్టిస్‌ రాజా ఇళంగోను అప్పట్లో మేనేజ్‌ చేశారనీ, ప్రతిఫలంగానే ఇప్పుడు పదవి ఇచ్చారనీ ఒక్కరైనా తప్పుబట్టకపోవడాన్ని ప్రజలు గమనించాలి. దుష్ప్రచారాన్ని నమ్ముకోవడమే కాక, అనుసరించడం ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు న్యాయ వ్యవస్థను లొంగదీసుకోవడానికి కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని బలమైన శక్తులు ఏకమై కుట్ర చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు వాపోతున్నారు. ఒక పథకం ప్రకారం ఒక వ్యవస్థ విశ్వనీయతను దెబ్బతీయడం, అందుకోసం విశ్వసనీయత ఉన్న వర్గాలను వాడుకోవడంలో ఆరితేరిన జగన్‌ అండ్‌ కోకు వ్యతిరేకంగా కుట్ర చేసే పరిస్థితిలో ఏ వ్యవస్థ కూడా లేదు. ఎందుకంటే ఈ గుంపు దాడి పుణ్యమా అని అన్ని వ్యవస్థలు ఆత్మరక్షణలో పడిపోయాయి. న్యాయ వ్యవస్థ కూడా మొదటిసారిగా ఈ దుస్థితిని ఎదుర్కొంటోంది. ఇళ్లస్థలాలకే లొంగిపోయి తీర్పులను తారుమారు చేసేంతటి బలహీనత మన న్యాయ వ్యవస్థకు లేదనే చెప్పవచ్చు. అవినీతి కేసులలో విచారణను అడ్డుకునే హక్కు, అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఎంపీ విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. అలాంటప్పుడు డజను కేసులలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌, విజయసాయిరెడ్డి ఇదే న్యాయ వ్యవస్థ నుంచి ఉపశమనం ఎలా పొందగలిగారు? స్టేల కోసం ఎందుకు ప్రయత్నించారు? న్యాయమూర్తులతోపాటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది కదా? అదే అధికారులు ఇప్పుడు జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు తలలు ఊపుతున్నారు కదా?


న్యాయ వ్యవస్థే తేల్చాలి!

రెండు రోజులుగా పార్లమెంట్‌ ఆవరణలో వైసీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడాన్ని మనం చూశాం. అమరావతి భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని వారు నినాదాలు చేస్తున్నారు. ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామం. గతంలో జగన్‌ అండ్‌ కోపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టిన సీబీఐని పంజరంలోని చిలుక అని నిందించారు. అప్పుడు చేదుగా ఉన్న సీబీఐ ఇప్పుడు తీపిగా ఎందుకు మారిందో తెలియదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ చెప్పుచేతల్లో సీబీఐ ఉందని విమర్శించారు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్పుచేతల్లో సీబీఐ ఉన్నట్టేనా? ఒకనాడు పంజరంలో చిలుకగా అభివర్ణించిన సీబీఐనే ఇప్పుడు కావాలనుకోవడం ఏమిటి? అంటే భూకుంభకోణంలో తాము ఎవరిని ఇరికించమంటే వారిని ఇరికించడానికి సీబీఐ సిద్ధంగా ఉందన్న నమ్మకం కుదిరిందా? ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు సహకరిస్తారని ఆశిస్తున్నారా? అలాంటప్పుడు సొంత బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ అవసరం లేదని జగన్‌రెడ్డి హైకోర్టుకు ఎందుకు చెప్పినట్టు? జీఎస్‌టీ బకాయిల చెల్లింపు వంటి విషయాలలో రాష్ర్టానికి న్యాయం చేయాలని తెలంగాణ ఎంపీలు అదే పార్లమెంట్‌ ఆవరణలో నినదించగా, అమరావతి భూములపై సీబీఐ విచారణ కావాలని మాత్రమే వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తంచేయడం గమనార్హం. రాష్ర్టానికి సంబంధించి ఏ విషయంలో కూడా కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వపరంగా చేస్తున్న తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంతో పాటు ప్రత్యర్థులను కేసులలో ఇరికించడమే ఏకైక లక్ష్యంగా జగన్‌ సర్కారు ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందా? లేదా? అన్నది హైకోర్టు నేరుగా, వేగంగా విచారణ జరిపి తేల్చడం మంచిది.


ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించి వార్తలు వెలువడినప్పుడల్లా భూములకు సంబంధించి స్పెక్యులేషన్‌ జరుగుతూనే ఉంటుంది. నూజివీడు ప్రాంతంలో రాజధాని వస్తుందని మీడియాలో వార్తలు వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర తరఫు బంధువులు అక్కడ భూములు కొని నష్టపోయారు. దీన్నిబట్టి సొంత కుటుంబసభ్యులకు కూడా రాజధాని ఎక్కడ అన్నది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించలేదని స్పష్టమవుతోంది. దొనకొండలో భూములు కొన్నవారిలో జగన్‌ బంధువులు కూడా ఉండవచ్చు. వారు కూడా నష్టపోయారు. ఇందుకు ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. జగన్‌రెడ్డి పుణ్యమా అని అమరావతిలో భూములు కొన్నవారు కూడా భారీగానే నష్టపోయారు. తెలంగాణకు చెందినవారు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని మరచిపోకూడదు. అమరావతిలో వాస్తవంగా ఏమి జరిగిందనేది న్యాయ వ్యవస్థ చెబితేనే బాగుంటుంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటే నష్టపోయినవాళ్లు ఫిర్యాదు చేస్తారు. అమరావతిలో భూములు అమ్ముకున్నవాళ్లు ఫిర్యాదు చేయలేదు. అధికార పార్టీ వాళ్లు అయినకాడికి తమ భూములు కొట్టేశారని ఒక్క రైతు కూడా చెప్పలేదు. అలాగే భూములు బలవంతంగా లాక్కున్నారన్న ఫిర్యాదులు కూడా లేవు. అయినా జగన్‌ అండ్‌ కోకు మాత్రమే అక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కనపడుతోంది. అమరావతిని చంపేయడానికి ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారన్నది వాస్తవం. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం నాయకులు బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ వ్యూహాలను, ఎత్తుగడలను పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రతివ్యూహాలు రూపొందించుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమవుతోంది. 1983లో నడిపిన రాజకీయాలనే ఇప్పటికీ ఆ పార్టీ అనుసరిస్తోంది. రేపోమాపో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక శాఖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చు.


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అధికార పార్టీ, జరగలేదని తెలుగుదేశం పార్టీ వాదిస్తున్నందున నిజమేంటో వెల్లడించవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ స్వీకరించగలిగితే రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది. అయితే ప్రభుత్వ వ్యవస్థ ఆగడాల నుంచి బాధితులకు అండగా ఉంటూ వస్తున్న న్యాయ వ్యవస్థనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆత్మరక్షణలో పడేస్తున్నందున, ప్రజలే చొరవ తీసుకుని న్యాయ వ్యవస్థకు అండగా నిలవాలి. న్యాయ వ్యవస్థ నైతికస్థైర్యం దెబ్బతింటే ప్రజలకే నష్టం. పారాహుషార్‌! ఒకవైపు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ, మరోవైపు న్యాయ వ్యవస్థనే బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకోవడం జగన్‌రెడ్డికే చెల్లుతుంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసి ఉండకపోతే తన పరిస్థితి ఏమై ఉండేదో జగన్‌ గుర్తు చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది!


ఆర్కే






యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - 2020-09-20T05:58:01+05:30 IST