ప్రభుత్వ మొండి వైఖరికి తీవ్ర నిరసన

ABN , First Publish Date - 2022-01-19T04:52:42+05:30 IST

అప్రజాస్వామికంగా ఫిట్‌మెంట్‌ 23శాతం ప్రకటించడమే కాకుండా అర్ధరాత్రి జీవోలు కూడా జారీచేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌కి తీవ్ర నష్టం కలిగించడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మంగళవారం నిరసన తెలిపారు.

ప్రభుత్వ మొండి వైఖరికి తీవ్ర నిరసన
ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

పీఆర్‌సీ జీవో ప్రతుల దహనం


వెంకటాచలం, జనవరి 18 : అప్రజాస్వామికంగా ఫిట్‌మెంట్‌ 23శాతం ప్రకటించడమే కాకుండా అర్ధరాత్రి జీవోలు కూడా జారీచేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌కి తీవ్ర నష్టం కలిగించడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మంగళవారం నిరసన తెలిపారు. వెంకటాచలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి పీఆర్‌సీ జీవో ప్రతులను మంటల్లో దహనం చేశారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఫ్యాప్టో పిలుపు మేరకు కార్యాచరణ ప్రకారం తమ ఉద్యమం కొనసాగుతుందని ఫ్యాప్టో నాయకుడు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ చేవూరు సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీ శ్రీనివాసులురెడ్డి, బీ పెంచలయ్య, విజయ్‌, ఎస్‌ మాలకొండయ్య, జే నరసింహయ్య, చెన్నారెడ్డి తదితరులున్నారు. 


వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన 

తోటపల్లిగూడూరు : మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జేఏసీ నాయకులు మంగళవారం పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్మెంట్‌ ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌ను కొనసాగించాలని, 30శాతం ఫిట్మెంట్‌ ఇవ్వాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రతులను మంటల్లో దహనం చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్తయ్య, భాస్కర్‌రెడ్డి, అవ్వారు శ్రీధర్‌బాబు, దయాకర్‌, ఇంగిలేల బాలకృష్ణ, తోట శ్రీనివాసులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  


ఈ దగా పీఆర్సీ మాకొద్దు : ఫ్యాప్టో   

పొదలకూరు : ఈ పీఆర్సీ అమలు వలన ప్రతి ఉద్యోగస్థుడికి కొన్ని వేల రూపాయలు నష్టం జరుగుతుందని ఫ్యాప్టో నాయకులు కె.సనత్‌కుమార్‌, బి.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక గేట్‌ సెంటర్‌ కూడలిలో నల్ల రిబ్బన్లు ధరించి, అర్ధరాత్రి ఇచ్చిన జీవో పత్రాలను తగలబెట్టారు. అనంతరం పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు లేదన్నారు.  తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అవసరమైతే సమ్మెకు  వెనుకాడబోమని హెచ్చరించారు.  కార్యక్రమంలో మండలంలోని ఫ్యాప్టో సంఘాలు, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, బీటీఏ, హెచ్‌ఎంఏ, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాడి నరసింహులు, పెన్షనర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T04:52:42+05:30 IST