Abn logo
Apr 5 2020 @ 03:47AM

సర్కారు సొమ్ముతో ‘షో’

  • కరోనా సాయానికీ రాజకీయ రంగు
  • రాజకీయ ప్రహసనంగా రూ.వెయ్యి పంపిణీ
  • ప్రేక్షకుల్లా వలంటీర్లు.. పంచిన వైసీపీ నేతలు
  • ‘స్థానిక’ ఎన్నికల అభ్యర్థుల హల్‌చల్‌
  • సొంత డబ్బులిచ్చినట్లు ఫొటోలకు పోజులు
  • తమకే ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం
  • రేషన్‌ సరుకులకేమో జనాన్ని రోడ్లెక్కించి...
  • వెయ్యి పంపిణీ మాత్రం నేరుగా ఇంటింటికి!

మొన్నటికి మొన్న... ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే అవకాశమున్నా... రేషన్‌ సరుకుల కోసం ప్రజలను రోడ్లెక్కించారు. గంటలకొద్దీ క్యూల్లో నిలబెట్టించారు.  అనేక చోట్ల భౌతిక దూరం పాటించలేని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేశారు!


ఇప్పుడు... నేరుగా ఖాతాల్లో జమ చేసే అవకాశమున్నప్పటికీ, ఇంటింటికీ వెళ్లి వెయ్యి రూపాయలు అందించారు. సర్కారు వారి సొమ్ముతో వైసీపీ నేతలు ‘షో’ చేశారు. అనేక చోట్ల స్థానిక  ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థులే స్వయంగా వెయ్యి రూపాయలు పంచిపెట్టారు. ఈ ఘనకార్యం తమదే అన్నట్లుగా ఫొటోలు దిగారు.


కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినప్పుడు వైసీపీ నేతలంతా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై విరుచుకుపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే కరోనా సహాయాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. పలుచోట్ల శానిటైజర్లు, నిత్యావసరాలు, ఇతర సహాయాన్ని వైసీపీ గుర్తు ముద్రించి ఇస్తున్న తతంగం చాలారోజులుగా నడుస్తోంది. స్థానిక ఎన్నికల బరిలో నిలిచిన వారు... కరోనా సహాయం పేరిట ఇంటింటికీ తిరుగుతూ గుట్టుచప్పుడు కాకుండా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు... ఏకంగా ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయలను కూడా తమ ‘సొంత ఖాతా’లోకి వేసుకుంటున్నారు.


‘ఆన్‌లైన్‌’ అవకాశమున్నా...

శనివారం బియ్యం కార్డుదారులకు రూ.వెయ్యి పంపిణీ ప్రక్రియ చేపట్టారు. కరోనా కాలంలో వీలైనంత వరకు ప్రజలను రోడ్లపైకి రావాల్సిన అవసరం లేకుండా చూడాలి. నగదును ఆన్‌లైన్‌ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో వేసే అవకాశముంది. అయినా వలంటీర్లను రంగంలోకి దించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు ‘లాంఛనంగా’ ఈ కార్యక్రమా న్ని ప్రారంభించారు. బట్వాడాకు ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూడా నగదు పంపిణీ ప్రారంభానికి వెళ్లారు.


రాజకీయ సందడి... 

కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా ఇంటింటికీ  వెళ్లి వెయ్యి అందించారు. ఆయన వెంట కార్యకర్తలు, అధికారులు గుంపులు గుంపులుగా నడిచారు. కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి గ్రామసభ తరహాలో భేటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ సహాయం అందించారు. ప్రొద్దుటూరు 13వ వార్డులో వైసీపీ నేతలే రూ.వెయ్యి పంపిణీ చేసి... స్థానిక ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రచారం చేశారు. అనంతపురం జిల్లాలో వెయ్యి రూపాయల పంపిణీలో అధికార పార్టీ నేతలు ‘చక్కటి సమన్వయం’ ప్రదర్శించారు. స్థానిక ఎన్నికల బరిలో నిలిచిన వారంతా ఎక్కడికక్కడ వలంటీర్లతో సహా ఇంటింటికీ తిరిగారు. వలంటీర్‌ నామమాత్రంగా పక్కన నిలబడగా... అభ్యర్థులే రూ.వెయ్యిని కార్డుదారు చేతిలో పెట్టి, ఎన్నికలో తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం తెల్లవారగానే... వలంటీర్లకంటే ముందుగా వైసీపీ ‘స్థానిక’ అభ్యర్థులు వీధుల్లోకి వచ్చారు. ‘వెయ్యి ఇస్తున్నది మేమే’ అనేలా కలరింగ్‌ ఇచ్చారు. టీడీపీతోపాటు ఇతర పార్టీల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో స్వేచ్ఛగా సర్కారు సొమ్ముతో సొంత సోకు చేసుకున్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో మాత్రం టీడీపీ ఫిర్యాదు మేరకు అధికారులు వైసీపీ నేతలను నిలువరించారు. గుంటూరు జిల్లా నగరం మండలం ఎంపీపీ వైసీపీ అభ్యర్థి చింతల శ్రీకృష్ణయ్యతోపాటు రేపల్లె మునిసిపాలిటీలోని కౌన్సిలర్‌ అభ్యర్థులు కూడా చక్కగా వెయ్యి రూపాయలు పంచి పెట్టారు. విశాఖలోనూ ఈ తంతు సాగింది. 29వ వార్డులో లబ్ధిదారులకు వీఎంఆర్డీయే చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ పంచిపెట్టారు.


రేషన్‌ అలా... నగదు ఇలా!

రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలన్నింటినీ నేరుగా ఇంటి గుమ్మం ముందుకు చేర్చేందుకే వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ఇది అపూర్వం, అద్భుతం అని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ... కీలకమైన కరోనా సమయంలో మాత్రం వలంటీర్ల సేవలను ఉపయోగించుకోలేదు. ప్రజలనే రోడ్లపైకి రప్పించారు. ‘వలంటీర్లు ఇంటింటికీ వెళితే కరోనా వ్యాపించే ప్రమాదముంది’ అని ఒక మంత్రి  కూడా పేర్కొన్నారు. కానీ... వెయ్యి సహాయం పంపిణీ విషయానికొచ్చే సరికి అవన్నీ మరిచిపోయారు. ఇంటింటికీ తిరిగి డబ్బులిచ్చే  బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. చివరికి... ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ‘హైజాక్‌’ చేసేసి, రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అందులోనూ... గుంపులు గుంపులుగా వెళ్లి, కొన్ని చోట్ల మాస్కులు కూడా వేసుకోకుండా జనంలో కలియదిరిగారు.

Advertisement
Advertisement
Advertisement