వైసీపీలో వీధినపడ్డ విభేదాలు..

ABN , First Publish Date - 2021-09-02T05:11:42+05:30 IST

గ్రూపుల పోరుతో..

వైసీపీలో వీధినపడ్డ విభేదాలు..

హోంమంత్రి కార్యక్రమంలో మరొకసారి బట్టబయలు

కారుమంచి గ్రామంలో ఓ వర్గం గైర్హాజరు

రెండో వర్గం ఒత్తిడితో జిల్లా ప్రముఖులదీ అదేబాట


టంగుటూరు: గ్రూపుల పోరుతో అధికార పార్టీ వైసీపీ సతమతమవుతోంది. గ్రామాల్లో రెండుమూడు వర్గాలుగా ఆ పార్టీ నేతలు విడిపోయి కత్తులు దూసుకునేంతగా వివాదాలు నడుస్తున్నాయి. టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామంలో బుధవారం జరిగిన రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత కార్యక్రమం సందర్భంగా మండల వైసీపీలో నెలకొన్ని విభేదాలు మరొకసారి బజారుకెక్కాయి. నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ కారణంగానే రక్తదాన శిబిరం ప్రారంభం, అనంతరం జరిగిన సభా కార్యక్రమాలకు విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్జి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది.


గ్రామ వైసీపీలో చాలాకాలంగా రెండు గ్రూపుల మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఒక వర్గానికి రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రెండో వర్గానికి కాంట్రాక్టర్‌ విజయభాస్కరరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. మొన్నటి సర్పంచ్‌ ఎన్నికల్లో రెండు గ్రూపులు వేరువేరుగా పోటీచేయగా లక్ష్మణరెడ్డి బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. అప్పటి నుంచి గ్రూపుల పోరు ముదురుపాకానపడ్డాయి. ఇటీవల వరకు లక్ష్మణరెడ్డి వర్గంలో కొనసాగిన మాజీ సర్పంచ్‌ ఆనం సత్యనారాయణరెడ్డి కొంత కాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. అలాగే విజయభాస్కరరెడ్డికి ముఖ్యఅనుచరుడు, వైసీపీ సీనియర్‌ నాయకుడు సూరం రమణారెడ్డి 5నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అనుచరులు దూరమైనా లక్ష్మణరెడ్డి, భాస్కరరెడ్డి గ్రూపులు వేరువేరుగానే కొనసాగుతున్నాయి. గ్రామంలో లక్ష్మణరెడ్డి కొన్నేళ్ల క్రితం మాఊరి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా అభివృద్ది పనులు చేపడుతుండగా, భాస్కరరెడ్డి వర్గం ఆ కమిటీకి దూరంగా ఉంది. భాస్కరరెడ్డి వర్గం వేరుగా ఊరిలో అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. ఒకే పార్టీలోని రెండు గ్రూపులు వేరువేరుగానే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి


భాస్కరరెడ్డి వర్గం ఒత్తిడితో బాలినేని, మాగుంట, వెంకయ్య గైర్హాజరు

హోంమంత్రి సుచరిత కార్యక్రమానికి దూరంగా ఉన్న విజయభాస్కరరెడ్డి వర్గం ఒత్తిడి కారణంగానే మరొక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన బాలినేని, మాగుంటలు గైర్హాజరుకావడం చర్చినీయాంశం అయింది. భాస్కరరెడ్డితో సన్నిహితంగా ఉంటున్న వెంకయ్య మంత్రిని, ఎంపీని కారుమంచి రావద్దని కోరినట్లు లక్ష్మణరెడ్డి వర్గం ఆరోపిస్తుంది.


రాష్ట్ర మంత్రి తన నియోజకవర్గంలోకి వస్తుంటే అన్నీ తానై కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన వెంకయ్య పట్టించుకోకపోవడంతో మండలంలోని వైసీపీలో ఈ కార్యక్రమంపై ప్రచారం లేదు. మండల పార్టీ సైతం అంతగా సభ విజయవంతానికి కార్యకర్తలను సమీకరించింది లేదు. అందుకే గ్రామాల నుంచి అధికార పార్టీ నాయకుల హడావుడి అక్కడ కనిపించలేదు. గ్రామంలోనూ భాస్కరరెడ్డి వర్గం కార్యక్రమానికి హాజరుకాలేదు.

Updated Date - 2021-09-02T05:11:42+05:30 IST