Abn logo
Sep 17 2021 @ 01:07AM

ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో..!

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే

వైసీపీలో ఆధిపత్య పోరు

భరత్‌కు కలిసొస్తున్న రాజా వర్గం వైఖరి

బీసీ, ఎస్సీల ఎత్తుగడ వ్యూహాలు

ఇటు ఎపీ వైఖరిపై ఎమ్మెల్యే వర్గం గుర్రు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): వైసీపీలో ఆధిపత్య పోరు ముదిరింది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రాజానగరం  ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటోంది. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి చెందడంతో రెండు నియోజకవర్గాలపై పెత్తనంకోసం ఎంపీ, ఎమ్మెల్యే కూడా వ్యూహాలు పన్నారు. చివరకు వీటిమీద ఎంపీదే పై కాస్త పైచెయ్యి అన్నట్టు పలు సందర్భాల్లో నడుస్తోంది. రాజా మిత్రునిగా ఉన్న మాజీ సిటీ కోఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యంను కొనసాగించకుండా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను తెరమీదకు తీసుకుని రావడంలోనూ, రూరల్‌ నియోజకవర్గంలో కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆకుల వీర్రాజును తప్పించి మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌ కుమారుడు చందన నాగేశ్వర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించడంతోపాటు ఆయనకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇప్పించడం ద్వారా భరత్‌ తన పట్టు సాధించుకోగా, ఎమ్మెల్యే రాజా మాత్రం సమయం కోసం వేచిచూస్తున్నట్టు కనిపిస్తోంది.


ఈ నేపథ్యంలో మొత్తం మూడు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. ఎంపీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తోపాటు రాజానగరం నియోజకవర్గంలో కూడా తన వర్గాన్ని తయారు చేసుకోవడం గమనార్హం. ఎంపీ భరత్‌ బీసీ, ఎస్సీల వర్గాలను దగ్గరచేసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా, రాజా కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాజా గెలవడానికి ఆయన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు అన్ని వర్గాల ప్రజలతో ఉన్న సంబంధాలే కారణం. అంతేగాక రాజా కూడా లౌక్యంగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. కానీ రాజా అనుచరులు కొందరు వైసీపీకి అండగా నిలిచిన దళితులపై దాడులు చేస్తున్నారనేది రాజాకు సమస్యగా మారింది.


సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ప్రసాద్‌ అనే దళిత యువకుడికి పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేయడంతో అది పార్టీపరంగా పెద్ద సమస్య అయింది. తాజాగా ఎస్టీ వర్గానికి చెందిన అధ్యాపకుడు పులుగు దీపక్‌పై కొందరు వైసీపీ నాయకులు దాడి చేయడం కూడా పార్టీపరంగా తలపోటుగా మారింది. ఈ దాడులు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రాజాకు ఇబ్బందికరంగా మారాయి. పైగా రాజా వర్గీయుల దాడిలో గాయపడినట్టు చెబుతున్న అధ్యాపకుడు దీపక్‌ను ఎంపీ స్వయంగా పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇవ్వడం ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పరిస్థితులకు అద్దంపడుతున్నాయని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే రాజానగరంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా సమావేశమై భరత్‌ వైఖరిని తప్పుపట్టడం గమనార్హం.


రెండున్నర ఏళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు ఈ ఇద్దరి మధ్య విబేధాలు ఏ స్థాయికి చేరతాయనే దానిపై చర్చ జరుగుతోంది. అటు ఎంపీ కూడా తన చుట్టూ తిరిగే వారికే పదవులు ఇప్పిస్తున్నారనే ఆరోపణ ఉంది. కడియపులంకలో ఎంపీ వర్గీయులు మట్టి అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నాల్లోనూ, సీతానగరంలో ఎమ్మెల్యే వర్గీయుల ఇసుకతీతను అడ్డుకోవడంలోనూ వీరి విభేదాలే రచ్చకీడ్చాయి.