ఉక్కు ప్రైవేటీకరణపై వైసీపీ కపట నాటకం

ABN , First Publish Date - 2021-07-30T05:20:34+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ కపట నాటకమాడుతోందని, కేంద్రానికి పూర్తిగా సహకరిస్తూ, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తోందని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.

ఉక్కు ప్రైవేటీకరణపై వైసీపీ కపట నాటకం
మాట్లాడుతున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు


గాజువాక, జూలై 29: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో వైసీపీ కపట నాటకమాడుతోందని, కేంద్రానికి పూర్తిగా సహకరిస్తూ, రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తోందని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. గాజువాక పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరిస్తామని తేల్చిందన్నారు. అయినప్పటికీ ఇంకా ప్రజలను నమ్మించే దిశగా పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు, స్థానికంగా ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాతే ముందుకెళ్లినట్టు  ఉక్కుశాఖ మంత్రి పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు.  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  


నిర్వాసితులకు సమాధానం చెప్పాలి 

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూములిచ్చి సుమారు 17,500 మంది నిర్వాసితులయ్యారని, వీరిలో సగం మందికి మాత్రమే ఉపాధి లభించగా, మిగిలిన వారి భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. ప్లాంట్‌కు భూ సేకరణ సందర్భంగా నిర్వాసితులకు అన్ని విధాలా మేలు చేస్తామని నాటి ప్రభుత్వం ఒప్పించిందని, ఇప్పుడు ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఏవిధంగా ఆదుకుంటాయో తేల్చి చెప్పాలన్నారు. 


నేటి నుంచి నిర్వాసిత కాలనీలో పాదయాత్రలు

నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా శుక్రవారం నుంచి నిర్వాసిత కాలనీల్లో పాదయాత్ర చేపడుతున్నట్టు పల్లా ప్రకటించారు. ఆగస్టు 30 వరకు ఈ యాత్ర కొనసాగుతుందని, అప్పటికీ ప్రభుత్వాలు దిగి రాకుంటే, భారీ ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌లు గంధం శ్రీనివాస్‌, పల్లా శ్రీనివాసరావు, బొండా జగన్‌, మొల్లి ముత్యాలు, పార్టీ నేతలు ప్రసాదుల శ్రీనివాస్‌,  సర్వసిద్ది అనంతలక్ష్మి,  టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు,  రామ్మోహన్‌కుమార్‌, ఎండీ.రఫీ, గంతకోరు అప్పారావు, గోమాడ వాసు, కర్రి కన్నారావు, నమ్మి సింహాద్రి, సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:20:34+05:30 IST