Abn logo
Sep 20 2021 @ 01:07AM

టెన్షన్.. టెన్షన్.. వైసీపీలో మొదలైన ‘సర్వే’..

వైసీపీ ‘అంతర్గత సర్వే’

ప్రభుత్వ పాలనతో పాటు జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా

అభిప్రాయం తెలపాలంటూ ద్వితీయ శ్రేణి నేతల సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు

కార్యకర్తల నుంచి కూడా సమాచారం సేకరణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సర్వే సందడి మొదలైంది. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కూడా కాకముందే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్టు గ్రహించిన పార్టీ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలపై దృష్టిసారించింది. అందులో భాగంగా ప్రభుత్వ పనితీరుతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక మంత్రుల పనితీరుపై పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు పార్టీ నేతలు, కార్పొరేషన్లకు ఇటీవల చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి.


2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయితే ఆశించిన స్థాయిలో పాలన లేకపోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం కావడంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. గతంలో వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపిన వారి వైఖరిలో కూడా ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో కూడా అధిష్ఠానం తీరుపై  వ్యతిరేకత నెలకొని ఉంది. తమను వదిలేసి నేరుగా ప్రజలు వద్దకు వెళితే పార్టీకి ఓట్లు పడిపోతాయా?... అంటూ అంతర్గత సమావేశాల్లో తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడం కష్టమనే భావన పార్టీ అధిష్ఠానంలో మొదలైనట్టు తెలిసింది.


ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక మంత్రుల పనితీరు, లోటుపాట్ల గురించి ముందుగా ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్య నేతలు కొందరు పేర్కొంటున్నారు. గత రెండు రోజులుగా కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలకు అందుకు సంబంధించిన మెసేజ్‌లు రావడం వారి వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చుతోంది. అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా పంపించాలంటూ కోరుతున్నారు. ముందుగా ఇటీవల కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైనవారు, పార్టీ పదవుల్లో వున్న వారి నుంచి అభిప్రాయాలను సేకరించి తర్వాత కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ మళ్లీ ప్రజల్లో సర్వే చేసే అవకాశం వుందనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో అంతర్గత సర్వే ప్రారంభించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.