రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చిన ఘనత వైసీపీదే: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-08T21:57:47+05:30 IST

రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చిన ఘనత వైసీపీదే: చంద్రబాబు

రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చిన ఘనత వైసీపీదే: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. రైతుల్లో కులాల ప్రస్తావన 73 ఏళ్ల దేశ స్వాతంత్ర్య చరిత్రలో లేదని, అలాంటిది రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చిన ఘనత వైసీపీదే అని చంద్రబాబు విమర్శించారు. రైతుల సున్నావడ్డీకి రూ3,600 కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పిన జగన్ రెడ్డి, కేవలం రూ.100 కోట్లే ఖర్చు పెట్టారని చంద్రబాబు అన్నారు. సున్నావడ్డీ పథకం నేనే తెచ్చానని అసెంబ్లీలో చెప్పిన జగన్ రెడ్డి, అది కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చిన పథకంగా టీడీపీ రుజువు చేయడంతో పారిపోయాడని, అలాంటిది సున్నా వడ్డీ పాత బకా యిలు రూ.1,050 కోట్లు తామే చెల్లించామని చెప్పడం హాస్యాస్పదమని చంద్రబాబు మండిపడ్డారు. రుణమాఫీ రూ. 7 వేల కోట్లు ఎగ్గొట్టడమే వైసీపీ రైతు దినోత్సవమా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.


15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి అందులో పదోవంతు కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. 34 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీల ఉసురు పోసుకోవడమే వైసీపీ రైతు దినోత్సవమా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యవసాయ యాంత్రీకరణకు టీడీపీ ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఖర్చు చేస్తే, అందులో పదోవంతు కూడా వైసీపీ చేయలేదన్నారు. మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే రాష్ట్రాన్ని ముందుంచితే, ఇప్పుడు 17వ స్థానానికి తెచ్చారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇచ్చిన జిప్సం తదితర మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎగ్గొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 3 వేల కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ ఒక బోగస్ అని, బోగస్ లెక్కలతో, తప్పుడు సమాచారంతో ప్రభుత్వ ప్రకటనలకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం సిగ్గుచేటన్నారు. ఎవరెవరి రైతుల ఖాతాల్లో సున్నావడ్డీ జమ చేశారో రైతు భరోసా కేంద్రాల్లో జాబితా పెట్టే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-07-08T21:57:47+05:30 IST