పొలాలకు ఎసరు..!

ABN , First Publish Date - 2022-01-24T05:14:41+05:30 IST

రైతులను ఆదుకోవాల్సిన సహకార బ్యాంక్‌లు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి.. వారి భూములను వేలం వేసేందుకు సిద్ధమయ్యాయి.

పొలాలకు ఎసరు..!

వ్యవసాయ రుణాలు 

చెల్లించలేదని 600 ఎకరాలు 

వేలానికి సిద్ధం

సహకార బ్యాంక్‌ నోటీసులు..

ఒత్తిళ్లు.. బెదిరింపులు

పేపరులో ప్రకటనలు, కరపత్రాలు, 

చాటింపులు కూడా

ఆందోళన, అవమానాలతో 

రైతులు ఉక్కిరిబిక్కిరి

ఆత్మహత్యలే 

శరణ్యమంటున్న అన్నదాతలు

బుక్కరాయసముద్రం, జనవరి 23: రైతులను ఆదుకోవాల్సిన సహకార బ్యాంక్‌లు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి.. వారి భూములను వేలం వేసేందుకు సిద్ధమయ్యాయి. దీంతో రైతులు ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..  బుక్కరాయసముద్రం మండల వ్యవసాయ సహకార సొసైటీ బ్యాంక్‌ అధికారులు వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించని రైతులకు చెందిన దాదాపు 600 ఎకరాల భూమిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ రైతులకు నోటీసులూ జారీ చేశారు. అంతేకాకుండా  రుణాలు చెల్లించని రైతులు పేర్లను పేపరు ప్రకటనలతో పాటు గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ.., చాటింపు వేయించి మరీ ఆ రైతులను అవమానం పరుస్తున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని రైతులు బ్యాంక్‌ సిబ్బందిని వేడుకొంటున్నా... వారు మాత్రం ససేమీరా అంటున్నారు. ఇలా ఉన్న భూమి .. పరువు చేజారి పోతుండటంతో వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. 


31న బహిరంగ వేలం ...

ఈ నెల 31న తొలి విడతగా కొంతమంది రైతుల పొలాలను బహిరంగ వేలం వేస్తున్నారు. అతి తక్కువ సమయంలో వేలం నోటీసు పంపి..  లక్షల రూపాయలు చెల్లించాలంటే తాము కట్టేదని రైతులు వాపోతున్నారు. తాము తీసుకున్న రుణాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని ఒత్తిళ్లు.. బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. లాక్‌డౌన, కరోనా విపత్కర సమయంలో అంత డబ్బులు ఎలా తెచ్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వడ్డీకి.. వడ్డీ..

సహకార సోసైటీలో దాదాపు 160 మంది పైగా రైతులు వ్యవసాయ పనిముట్లు,   వ్యవసాయ కోసం, పాడి పరిశ్రమ కోసం రూ.2.50 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. 2004లో కరువు దృష్ట్యా అప్పటి కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలను రీషెడ్యూల్‌ చేసింది. దీంతో అసలు, వడ్డీతో సహా తిరిగి ఒకే రుణం కింద మార్చారు.  వరుస కరువుతో రైతులు రుణాలు చెల్లించలేదు. రుణం కంటే మూడు రెట్లు వడ్డీ ఎక్కువ అయ్యింది. కొంతమంది రైతులు కొన్నిసార్లు వడ్డీ మాత్రం చెల్లించారు.  అయినా వడ్డీకి వడ్డీ వేయడంతో రు ణం భారీగా పెరిగింది. కనీసం ఈ రుణాలకు వన టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం కూడా వర్తించదని బ్యాంక్‌ సిబ్బంది తేల్చిచెబుతున్నారు.


ఇది రైతు ప్రభుత్వమా?: రైతు రవిచంద్రారెడ్డి, వైసీపీ అభిమాని, సంజీపురం

 నేను వైసీపీలోనే ఉన్నా. రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన.. నేడు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునేలా వేధింపులు.. ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇదేనా రైతు ప్రభుత్వమంటే.. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రైతు భూములను వేలం వేయలేదు. మా మామకు ప్రస్తుతం కరోనా వచ్చింది. చికిత్స కోసం రూ.3 లక్షల ఖర్చు అయ్యింది. ఇలాంటి సమయంలో బ్యాంక్‌ వేలం నోటీసు పంపించింది. నేను రూ. లక్ష రుణం చేస్తే..  ఇప్పుడు రూ.8 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరీ ఇంత అన్యాయమా.. నా దగ్గర డబ్బులు లేవు.  నా భూములు వేలం వేస్తే ఇక ఆత్మహత్యే శరణ్యం. 


Updated Date - 2022-01-24T05:14:41+05:30 IST