బామ్మర్దా మజాకా!

ABN , First Publish Date - 2020-04-05T17:14:59+05:30 IST

కరోనాతో ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే..

బామ్మర్దా  మజాకా!

లాక్‌డౌన్‌ సందట్లో ఇసుక అక్రమ రవాణా

బిల్లుల్లేకుండా రీచ్‌లో ఇసుక లోడింగ్‌

గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసుల దాడులు

పైనుంచి ఒత్తిడితో వదిలేసిన వైనం


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): కరోనాతో ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. అధికార పార్టీ నాయకులు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలను బేఖాతరు చేసి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కార్వేటినగరం మండలంలోని ముక్కరవానిపల్లె రీచ్‌ నుంచి అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు శనివారం ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకున్నా.. పైనుంచి  ఒత్తిడి రావడంతో మళ్లీ వదిలేశారు. 


గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాలో ఉన్నారు. కార్వేటినగరంలో ఉంటున్న ఆయన బామ్మర్దికి స్థానికంగా సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి సంబంధించి రూ.కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. ఆ పనులకు అవసరమైన ఇసుక కోసం కార్వేటినగరం మండలంలోని ముక్కరవానిపల్లె రీచ్‌ నుంచి గతంలోనే ఇసుకను తరలించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్థులు అడ్డుకున్నారు. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో దాన్ని అనుకూలంగా మార్చుకున్న ఆ నాయకుడు శనివారం ఉదయం ముక్కరవానిపల్లె రీచ్‌ వద్దకు 28 ట్రాక్టర్లు, 2 జేసీబీ యంత్రాలను తీసుకెళ్లాడు.


సాధారణ రోజుల్లోనే నిబంధనల ప్రకారం మీసేవ కేంద్రాల్లో రూ.1200 చెల్లించి ట్రాక్టరు ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ను అదనుగా తీసుకున్న ఆయన.. ఆయన పనుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను దొంగలించే పనిలో పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సహా పది మంది పోలీసులు, పంచాయతీ కార్యదర్శి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలు అక్కడే ఉండి ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అన్ని ట్రాక్టర్లు, జేసీబీలను రీచ్‌ నుంచి బయటకు తరలించారు. రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాలో ఉన్న నాయకుడికి ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తి బామ్మర్ది కావడంతో వెంటనే పోలీసులపై బలమైన ఒత్తిడి వచ్చింది. దీంతో పోలీసులు చేసేదేమీలేక ఊరు దాటాక అంపల్లి క్రాస్‌ వద్ద ట్రాక్టర్లు, జేసీబీలను వదిలేశారు.

Updated Date - 2020-04-05T17:14:59+05:30 IST