అర్చకులపై చెర్నకోలతో వైసీపీ నేతల దాడి

ABN , First Publish Date - 2020-12-01T08:57:16+05:30 IST

ఆలయంలో పూజలు చేసుకునే అర్చకులను వైసీపీ నాయకులు చావబాదారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో

అర్చకులపై చెర్నకోలతో వైసీపీ నేతల దాడి

ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో ఘటన


బండి ఆత్మకూరు, అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆలయంలో పూజలు చేసుకునే అర్చకులను వైసీపీ నాయకులు చావబాదారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు అర్చకులు గాయపడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి ఓవైపు భక్తుల దర్శనం కొనసాగుతోంది. రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు టికెట్లు ఇవ్వొద్దని అటెండర్‌ ఈశ్వరయ్యకు అర్చకులు చెప్పారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈశ్వరయ్యను అర్చకుడు చక్రపాణి పక్కకు తోసేశారు. దీంతో తనపై అర్చకులు దాడి చేశారంటూ చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఈవో మోహన్‌లకు ఈశ్వరయ్య ఫిర్యాదు చేశాడు. అంతే ప్రతాపరెడ్డి, అతని సోదరుడు రామకృష్ణారెడ్డి, అటెండర్‌ ఈశ్వరయ్య, నాగరాజు, రామకృష్ణ అక్కడికి చేరుకుని సుధాకర శర్మ, మృగఫణిపై దాడి చేశారు.


చెర్నాకోల, కర్రలతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ.. చేతులతో కొడుతూ విచక్షణా రహితంగా ఆలయంలోనే దాడి చేశారు. సుధాకరశర్మ ముఖంపైన, మృగఫణి శర్మ వీపుపైనా గాయాలయ్యాయి. అర్చకుల ఫిర్యాదు మేరకు చైర్మన్‌ ప్రతాపరెడ్డి, ఆలయ సిబ్బంది ఈశ్వరయ్య, నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. కాగా, ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరా తీశారు. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అర్చకులను చితకబాదిన ప్రతా్‌పరెడ్డిని చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని అర్చక సమాఖ్య ప్రతినిధులు ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-01T08:57:16+05:30 IST