Abn logo
Feb 22 2020 @ 15:15PM

మాపై నమ్మకం లేకపోతే ఎలా..? అధికార పార్టీ నేతల్లో అంతర్మథనం

అప్పన్న ట్రస్టు బోర్డు నియామకంపై అధికార పార్టీ నేతల అంతర్మథనం

తమపై నమ్మకం లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్న నేతలు?

తాము సిఫారసు చేసిన వ్యక్తులను నియమించకపోవడంపై అసంతృప్తి

సభ్యుల జాబితాలో ప్రముఖ నేత కుమారుడి పేరు

తాను కాదంటూ ఆయన వివరణ

విశాఖ నగర పరిధిలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు సూచించిన వారికి దక్కని స్థానం

నియమితులైన వారు కూడా పార్టీపరంగా పెద్దగా చురుగ్గా వ్యవహరించిన దాఖలాల్లేవని పార్టీ వర్గాల్లో చర్చ


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై అధికార పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉలుకూ పలుకూ లేకుండా ఆకస్మికంగా ట్రస్టు బోర్డును ప్రకటించారని కొందరు ఆరోపిస్తుంటే...మరికొందరు తమకు అవకాశం కల్పించాలని కోరినా ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు అయితే తమ నియోజక వర్గాల్లో తమకు తెలియకుండా ఎవరెవరికో అవకాశం కల్పించారని తల బాదుకుంటున్నారు. 


సింహాచలం దేవస్థానానికి పదిహేనేళ్ల తరువాత ఏర్పాటుచేసిన బోర్డు వివాదాస్పదమైంది. అయితే అధికార పార్టీ నాయకులు ఎక్కడా తమ అసంతృప్తిని బయటకు వ్యక్తపరచడం లేదు. ప్రభుత్వం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అయిన అశోక్‌గజపతిరాజును బోర్డు చైర్మన్‌గా నియమిస్తూ, మరో 14 మందిని సభ్యులుగా వేసింది. అందులో సగం మంది మహిళలే కావడం విశేషం. అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని చెప్పడానికి ఎస్‌సీలు, ఎస్‌టీలు, బీసీలకు పెద్దపీట వేశారు. అనువంశిక ధర్మకర్తల్లోనే ఆనందగజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజుకు అవకాశం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులను ఎక్స్‌అఫీషియో సభ్యునిగా నియమించారు. 


మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ విజయానికి అనకాపల్లి నుంచి ఓ నేత గట్టిగా కృషిచేశారు. ఆయన కుమారుడు 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో తండ్రీకుమారులు ఇద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. మంచి నామినేటెడ్‌ పోస్టు లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆయన కుమారుడి పేరును ఈ ట్రస్టు బోర్డులో ప్రకటించింది. అయితే ఆ వ్యక్తిని తాను కానని ఆయన చెబుతున్నారు. అదే పేరుతో జిల్లాలో ఇంకెవరూ లేరని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే ఎవరూ దీనిపై బయటకు మాట్లాడడం లేదు.


దేవస్థానాన్ని ఆనుకునే వున్న నియోజకవర్గంలో అధికార పార్టీకి యువ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో అనేక విద్యాసంస్థలు వున్న ప్రాంతం నుంచి ఓ విద్యార్థి నాయకురాలికి ఈ బోర్డులో అవకాశం కల్పించారు. తాను ప్రతిపాదించిన పేరును పరిశీలనలోకి తీసుకోకుండా, నియోజకవర్గంలో అంతగా పేరు లేని వారికి ఇచ్చారని ఆ నాయకుడు వాపోతున్నారు. అయితే ఆమె జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారని, దానిని గుర్తుంచుకునే పదవి ఇచ్చారని పార్టీలో మరో వర్గం సమర్ధిస్తోంది.


నగరంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఓ ప్రముఖ నాయకుడు మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. మంచి నామినేటెడ్‌ పోస్టు ఏదైనా వస్తుందని అనుకుంటున్నారు. తన కుటుంబంలో ఒకరికి ట్రస్టు బోర్డులో సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు. ఆయన విన్నపాన్ని కూడా పట్టించుకోలేదు. అయితే ఆ ప్రతిపాదన ఆమోదిస్తే..ఆ తరువాత మరో పదవి ఆయనకు ఇవ్వడం కుదరదని, అందుకే ఆ కుటుంబంలో ఇంకెవరికీ అవకాశం కల్పించలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 


నగరంలో మంత్రి చెప్పిన వారిలో కొందరికి అవకాశం దక్కిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సూచించిన పేర్లు కొన్ని లేవని చెబుతున్నారు.


నగరంలో గతంలో ఓసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత రెండు సార్లు వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు తాను సూచించిన వారిని ట్రస్టు బోర్డులో వేయలేదని చెబుతున్నారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందినవారు బోర్డులో ఉన్నారు. ఒకరి పేరు చెప్పి మరొకరి పేరు సిఫారసు చేయలేదని చెడ్డపేరు వస్తుందని, ఆయన తాను సూచించిన వారికి ఎవరికీ రాలేదని ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. 


అయితే ఈ ట్రస్టు బోర్డులో ప్రకటించిన వారిలో చాలా మంది పెద్దగా జనబాహుళ్యంలో ఉన్నవారు కాదని, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారూ కాదని పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం వారిని గుర్తించి పదవులు కట్టబెట్టిందంటే...ఇంకెక్కడి నుంచో వారికి మద్దతు లభించి వుంటుందని గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి జిల్లా నాయకుల ప్రమేయం లేకుండా అధిష్ఠానం తనకు నచ్చిన వారితోనే ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసిందని అంతా అంగీకరిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement