Abn logo
Sep 19 2021 @ 01:06AM

రచ్చ రచ్చ రాజా

  రాజమహేంద్రవరంలో రోడ్డెక్కిన వైసీపీ విభేదాలు
  ఎంపీ భరత్‌కు ఎమ్మెల్యే రాజా వర్గం వార్నింగ్‌
  రాజానగరంలో అడుగుపెట్టనీయమంటూ హెచ్చరిక
  నిజమైన కార్యకర్తల పేరిట నేడు సిటీలో సమావేశం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)వైసీపీ నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరిపాకాన పడింది.   ఎమ్మెల్యే రాజా వర్గం తాజాగా ఎంపీ భరత్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల వైసీపీ కార్యకర్తలు వేర్వేరుగా సమావేశమైన భరత్‌ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. వైఖరి మార్చుకోకపోతే నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. వైసీపీని ఎంపీ భ్రష్టు పటిస్తున్నారని, కార్యకర్తలు కాదంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టంచేశారు. జక్కంపూడి కుటుంబాన్ని పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో విమర్శిస్తే ఊరుకోమన్నారు. రాజానగరం నియోజకవర్గం లో ఇలా ఎంపీకి వ్యతిరేకంగా జక్కంపూడి రాజా వర్గం తిరుగుబాటు చేయగా, సిటీలో కూడా ఎంపీకి చెక్‌ పెట్టడానికి రాజా వ్యూహం పన్నినట్టు సమాచారం. ప్రస్తుతం సిటీలోనూ, రూరల్‌ నియోజకవర్గంలోనూ ఎంపీ వర్గానిదే పైచేయిగా ఉంది. రూరల్‌ నియోజకవర్గంలో చందన నాగేశ్వర్‌ను కోఆర్డినేటర్‌ను చేయడంలో భరత్‌ పాత్ర ఉంది. వీరిద్దరూ కలిసే పర్యటిస్తున్నారు. అప్పట్లో సిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఎంపీగా మధ్య విభేదాల వల్ల సుబ్రహ్మణ్యం రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ కోఆర్డినేటర్‌ అయ్యారు. మొదట్లో ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కొంతకాలంగా ఆయనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. శ్రీఘాకోళ్లపు కూడా మౌనంగా ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో ఎంపీ భరత్‌ సిటీలో కూడా పట్టు సాధించగలిగారు. ఈ క్రమంలో సీతానగరం మండలంలో ఎస్టీ అధ్యాపకుడు దీపక్‌ మీద వైసీపీ నేతలు దాడి చేయడం, దానిని ఎంపీ ఖండించడంతోపాటు, స్వయంగా వెళ్లి పరామర్శించి, దాడిచేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ కూడా చేశారు. దీంతో  ఇప్పటివరకూ ఉన్న విభేదాలు తార స్థాయికి చేరి, చివరకు రాజా వర్గం బహిరంగంగానే ఎంపీకి హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చాయి. కానీ దీనిని సున్నితంగా తప్పించడానికి ఎంపీ ప్రయత్నం చేసి, దాడి చేసిన వ్యక్తి బైౖర్రాజు ప్రసాదరాజు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తని, దానిని ఖండించడం తప్పేంటని తిరిగి ప్రశ్నించారు. అంతేకాక తన అభిమానులను కూడా  చేస్తానని, నీ కార్యకర్తలను కట్టడి చేయమని రాజాకు అల్టిమేటం ఇచ్చారు. వాస్తవానికి ప్రసాదరాజుతోపాటు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రసాదరాజు జక్కంపూడి కుటుంబానికి సన్నిహితుడు. దీనితో రాజా అప్రమత్తమై రాజానగరంలోని కార్యకర్తలతో భరత్‌కు వార్నింగ్‌ ఇప్పించడంతోపాటు సిటీలో కూడా భరత్‌ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

నేతలతో మోషేన్‌రాజు భేటీ

విభేదాలు ముదరడంతో పార్టమెంటరీ పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ మోషేన్‌ రాజు రంగంలోకి దిగారు. ఏపీసీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహణ్యం ఇంట్లో శనివారం ఎమ్మెల్యే రాజాతో భేటీ అయ్యారు. అం తకుముందు సిటీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు వచ్చి, సుబ్రహ్మ ణ్యం మళ్లీ చురుకుగా వ్యవహరించాలని కోరినట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఇక్కడ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.  ఇక విభేదాలు ఆపి పనిచేయాలని మోషేన్‌రాజు.. ఎంపీకి, ఎమ్మెల్యేకు కూడా సూచించినా ఇద్దరి నుంచీ స్పందన లేనట్టు సమాచారం. ఇదిలా ఉండగా సిటీలోని భరత్‌కు వ్యతిరేకంగా ఉన్న కార్యకర్తలు నేతలు ఆదివారం రాజమహేంద్రవరం ఆనం రోటరీహాల్‌లో సమావేశం కానున్నారు. నిజమైన వైఎస్‌ఆర్‌ కార్యకర్తలు పేరిట ఈ సమావేశం జరగనుంది. ఇక నుంచి కార్యకర్త - జనబాట పేరిట రాజమహేంద్రవరంలో ఎంపీకి ప్రత్యామ్నాయంగా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక్కడ నేతల మధ్య నెలకొన్న విభేదాల గురించి ఎంపీతోనూ, ఎమ్మెల్యేతోనూ మాట్లాడిన మోషేన్‌రాజు ఇక ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి, ఉభయగోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసు కుని వెళతానని చెప్పినట్టు సమాచారం.