వైసీపీ లీడర్లకు మావోయిస్టుల టెన్షన్!

ABN , First Publish Date - 2021-04-07T17:42:27+05:30 IST

ఏపీలో అధికార వైసీపీకి మావోయిస్టుల..

వైసీపీ లీడర్లకు మావోయిస్టుల టెన్షన్!

ఏపీలో అధికార వైసీపీకి మావోయిస్టుల టెన్షన్‌ పట్టుకుందా? పరిషత్‌ ఎన్నికల వేళ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ గ్రామాల్లో తిరగాలంటేనే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హడలెత్తిపోతున్నారా? ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సృష్టించిన మారణహోమం ప్రభావం.. ఏఓబీలో పరిషత్‌ ఎన్నికలపై పడిందా? ఆ ఎఫెక్ట్‌ అక్కడ ఏ స్థాయిలో ఉంది? అనే ఆసక్తికర అంశాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీ ప్రాంతంలో మారణకాండ సృష్టించిన మావోయిస్టులు.. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రాలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాష్ట్ర పోలీసులకు సమాచారమిచ్చాయట. అయితే ఏపీలో సరిగ్గా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ఛత్తీస్‌గడ్‌ నుంచి ఏపీలో మావోయిస్టులు వచ్చారన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా అధికార వైసీపీ నాయకులకు మావోయిస్టుల టెన్షన్‌ వెంటాడుతోంది.



బయట తిరగకపోవడమే క్షేమం!

నిజానికి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఫలితాలు రాబట్టాలని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. తమ పార్టీ మంత్రులు, నాయకులను ఆదేశించారు. ఈ దిశగా వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మారణహోమం సృష్టించడం సంచలనం రేపింది. ఈ ప్రభావం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలపై పడింది. పోలీసులు అలర్ట్‌ అయ్యారు. భద్రతా బలగాలను మోహరించారు. ప్రజాప్రతినిధులు బయట తిరగకపోవడమే క్షేమమని సూచించారట. దీంతో బయట తిరిగేందుకు భయపడుతున్న వారు.. పరిషత్‌ పోరులో ఆశించిన మేర ఫలితాలు రాబట్టకపోతే పరిస్థితేమిటని ఆందోళన చెందుతున్నారు. 



మావోయిస్టులు.. అంత త్వరగా తిరిగి వెళ్లరు!

అయితే పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌ వేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం.. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులకు కొంత ఊరట కలిగించింది. ప్రస్తుతానికి వారికి బయట తిరిగే బాధ తప్పింది. లేకుంటే ఎన్నికల్లో నిర్దేశించిన ఫలితాలను రాబట్టేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో బయట తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఛత్తీస్‌గఢ్‌ నుంచి తప్పించుకుని ఏపీలోకి ప్రవేశించిన మావోయిస్టులు.. అంత త్వరగా తిరిగి పోరనీ, ఆ లోగా మళ్లీ ఎన్నికలు జరిపితే పరిస్థితి ఏమిటని లోలోపల మదనపడుతున్నారట. 



ఏజెన్సీ గ్రామాల్లో..  టెన్షన్‌

గతంలో పంచాయతీ ఎన్నికలను మావోయిస్టులు బహిష్కరించారు. అప్పుడు పోటీలో నిలిచిన ఒక అభ్యర్థి దంపతులను తీవ్రంగా కొట్టారు. ఇక టీడీపీ హయాంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు. గతంలో ఈ తరహా ఘటనలు జరగడం, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారం పోలీసులకు అందడం వంటి పరిణామాలు.. ఏజెన్సీ గ్రామాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులకు టెన్షన్‌ పెడుతున్నాయట. 


మొత్తంమీద పరిషత్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేయడంతో ఏవోబీ సరిహద్దులోని ఏజెన్సీ గ్రామాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. ఒకవేళ హైకోర్టు తీర్పుపై వైసీపీ ప్రభుత్వం.. సుప్రీంకోర్టు వెళ్లి, మళ్లీ వెంటనే ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే మాత్రం తమకు దినదిన గండమేనన్న భయాందోళన వారిని వెంటాడుతోంది. 


Updated Date - 2021-04-07T17:42:27+05:30 IST