వీళ్లేం ప్రజాప్రతినిధులు.. అమరావతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేల రెండు నాల్కల ధోరణి..!

ABN , First Publish Date - 2020-08-05T15:42:16+05:30 IST

ప్రాంతీయ దురభిమానం తప్పు కానీ.. ప్రాంతీయాభిమానం మెచ్చదగిందే.. అందులోనూ తమ సొంతగడ్డకు అన్యాయం జరుగుతున్నపుడు స్పందించాల్సిన పదవిలో ఉంటూ స్పందించక పోవడం దుర్మార్గం కూడా. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం

వీళ్లేం ప్రజాప్రతినిధులు.. అమరావతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేల రెండు నాల్కల ధోరణి..!

సొంత ప్రాంతంపై అభిమానం లేదా..?

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 31 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వైపే

కానీ ఒక్కరూ అమరావతికి మద్దతుగా నోరు విప్పరు

అధినేత ఆదేశాలే శిరోధార్యం.. ప్రజల ఆకాంక్షలు గాలికి

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై నిరసనల వెల్లువ


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): ప్రాంతీయ దురభిమానం తప్పు కానీ.. ప్రాంతీయాభిమానం మెచ్చదగిందే.. అందులోనూ తమ సొంతగడ్డకు అన్యాయం  జరుగుతున్నపుడు స్పందించాల్సిన పదవిలో ఉంటూ స్పందించక పోవడం దుర్మార్గం కూడా. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అలాంటి పనే చేస్తున్నారు. వీరిలో పలువురు ఎన్నికలకు ముందు, ఎన్నికలు జరిగిన తొలినాళ్లలో అమరావతి ఎక్కడికీ పోదంటూ ప్రగల్భాలు పలికిన వారే... ఇప్పుడేమో అధినేత నిర్ణయాలకు సాగిలపడటంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.


విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించగానే ఉత్తరాంధ్ర నేతల్లో సహజంగానే హర్షాతిరేకాలు వ్యక్త మయ్యాయి. కానీ కోస్తా జిల్లాలు ముఖ్యంగా రాజధాని ప్రాంతజిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతలు ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేయడమే కాక సీఎం జగన్‌ చిత్రపటానికి పూలాభి షేకాలు.. పాలాభిషేకాలు చేయడం పట్ల ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, నేతలకు ఇక్కడ రాజధాని ఉండటం.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన వెంటనే రాజధాని విశాఖలో అని ప్రకటించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదని, కానీ అమరావతిలో రాజధాని నిర్మిస్తామని, 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించిన తర్వాత ఇప్పుడు మాటమార్చడం ఏమిటని కృష్ణా, గుంటూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలతరబడి ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికార పార్టీ నేతలకు చీమకుట్టినట్టయినా లేదని వారు ఆవేదన చెందుతున్నారు. 


అభివృద్ధిపై నీలినీడలు..

అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధిపై దాని ప్రభావం చాలానే పడింది. విజయవాడ, అమరావతి, గుంటూరు నగరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందడం మొదలైంది. తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల మాదిరి ఏపీలో విజయవాడ, అమరావతి, గుంటూరు మూడు నగరాలు అభివృదిఽ్ధలో దూసుకెళుతాయని అంతా ఆశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు వ్యాపారాలు మొదలుపెట్టారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఆ మేరకు రియల్‌ ఎస్టేట్‌ విపరీతంగా పుంజుకొంది. కానీ వైసీపీ అధికారంలోకి రావ డంతోనే సీను మారిపోయింది. ఒక్కసారిగా రియల్‌ భూం పడి పోయింది. వ్యాపార కార్యకలాపాలూ మందగించాయి. 


జిల్లా నేతలకు పట్టదా..!

కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలకుగాను 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకుగాను 15 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రెండు జిల్లాల్లో కలిపి టీడీపీ తరఫున విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు వైసీపీ పంచన చేరిపోయారు. మొత్తం మీద రెండు జిల్లాల్లో కలిపి 33 అసెంబ్లీ స్థానాలకుగాను 31 మంది వైసీపీ తరఫున ఉన్నారు. కానీ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాజధానికి మద్దతుగా నోరు మెదపకపోవడం గమనార్హం. పైగా ఒకప్పుడు రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతే రాజీ నామాలు చేస్తామన్న నేతలు సైతం ఇప్పుడు ఆ మాటే గుర్తులేనట్టు ప్రవర్తిస్తున్నారు. సొంత ప్రాంతంపై తమ నాయకులు చూపిస్తున్న కపట ప్రేమపై స్థానికులు దుమ్మె త్తిపోస్తున్నారు. ఏ నాయకుడైనా ప్రజల ఆకాంక్షలకు అను గుణంగానే నడుస్తాడు తప్ప అధినేత నిర్ణయాలకు సాగిల పడరని కానీ అధికార పార్టీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. 


సీఆర్డీయేని చంపేసి..!

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలను అభివృద్ధి చేయడంలో భాగంగా కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సీఆర్డీ యే)ను ఏర్పాటు చేశారు. రాజధాని అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే సీఆర్డీయే కార్యాలయంలో నిత్యం జనంతో కళకళలాడుతుండేది. వైసీపీ సర్కార్‌ సీఆర్డీయేను రద్దు చేసి దాన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్థాయికి దిగజార్చినా స్థానిక ఎమ్మెల్యేల్లో చలనం లేకపోవడాన్ని ఏమనుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


నేతలు.. ఆనాటి మాటలు..!

తరలిస్తామని ఎవరు చెప్పారు..?

‘రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తరపున ఎవరైనా చెప్పారా..? మూడు రాజధానులనేవి ఆలోచన మాత్రమే.. అమరావతిని ఎవరూ తరలించడం లేదు’.. ఈ ఏడాది జనవరిలో వెలగపూడి సచివాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలివి..


అమరావతి వెలగబోతోంది..

‘ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజధాని అమరావతిలో శరవేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇవన్నీ శుభసంకేతాలు. అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతోందనుకోవడానికి శుభసంకేతం ఈ రోజు నాంది పలుకుతోంది..’.. పేర్ని నాని..


శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..

‘మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా గుర్తించి ఇల్లు, క్యాంపు ఆఫీసు, పార్టీ ఆఫీసు అన్నీ నిర్మించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కట్టుకున్నారు. రాజధాని అమరావతి నుంచి తరలివెళ్లదు. అలా వెళితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి శాశ్వతంగా  రాజకీయాల నుంచి తప్పుకుంటాను..’.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల అనంతరం చెప్పిన మాట..


రాజధాని మార్పు ఆలోచనే లేదు..

‘రాజధానికి మేం వ్యతిరేకం కాదు.. తుళ్లూరులో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలి. దాని మూలంగా రాష్ట్రం అంతటికీ మేలు జరగాలి. రాజధాని మార్పు ఆలోచన మా పార్టీకి లేదు....’ ఎన్నికలకు ముందు ప్రస్తుత పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కె.పార్థసారథి వ్యాఖ్యలు..


అమరావతిలోనే ఇల్లు కట్టుకున్న నేత జగన్..

‘అమరావతిలో మొట్టమొదటి సారిగా గృహాన్ని నిర్మించుకున్న ఏకైక రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..‘.. ఎన్నికలకు ముందు మల్లాది విష్ణు వ్యాఖ్యలు..


రాజధానిపై విష ప్రచారం.. 

‘జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిని ఎక్కడికో తీసుకెళ్తాడు.. ఇక్కడ రాజధాని నిర్మాణం జరగదని విష ప్రచారం చేస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ చెప్పిన మాట ప్రకారం రాజధానిలో ఇంటి నిర్మాణం చేశారు. గృహప్రవేశం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారు. మేమే ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వల్లే రాజధాని నిర్మాణం మొత్తం కూడా జరుగుతుంది. ప్రజలూ విశ్వసిస్తున్నారు..’.., ఎన్నికలకు ముందు జోగి రమేష్ వ్యాఖ్యలు..

Updated Date - 2020-08-05T15:42:16+05:30 IST