తిరుపతి వైసీపీదే

ABN , First Publish Date - 2021-05-03T09:53:43+05:30 IST

తిరుపతి లోక్‌సభ స్థానాన్ని పాలక వైసీపీ నిలబెట్టుకుంది. ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మద్దెల గురుమూర్తి ఘన విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,71,592 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ

తిరుపతి వైసీపీదే

లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయం

2,71,592 ఓట్ల మెజారిటీతో గురుమూర్తి గెలుపు

32.23 శాతం ఓట్లకే టీడీపీ పరిమితం

బీజేపీ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతు


నెల్లూరు. మే 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ స్థానాన్ని పాలక వైసీపీ నిలబెట్టుకుంది. ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ మద్దెల గురుమూర్తి ఘన విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,71,592 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ డిపాజిట్‌ కోల్పోవడం గమనార్హం. మొత్తం 10,99,784 ఓట్లు పోలవగా.. వైసీపీ అభ్యర్థికి 6,26,108 ఓట్లు పడ్డాయి. పనబాకకు 3,54,516 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కె.రత్నప్రభకు 57,080 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌కు 15,271 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 56.93 శాతం ఓట్లు వైసీపీకే వచ్చాయి. 2019 ఎన్నికల ఓట్లతో పోల్చితే ఆ పార్టీకి సుమారు రెండు శాతం ఓట్లు పెరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీకి 55.04 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేశ్‌ సహా పార్టీ సీనియర్లంతా పక్షం రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించినా.. ఆ పార్టీకి గత ఎన్నికల కంటే 5ు ఓట్లు తగ్గడం గమనార్హం. 


ఈ ఎన్నికల్లో టీడీపీకి 32.23 శాతం ఓట్లు పడగా.. 2019 ఎన్నికల్లో 37.61 శాతం ఓట్లు పడ్డాయి. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, దొంగ ఓట్లకు పాల్పడడం, బీజేపీకి జనసేన ప్రభావం తోడు కావడం తదితర కారణాలతో టీడీపీ ఓటింగ్‌ శాతం తగ్గినట్లు ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదనే నిజం ఈ ఉప ఎన్నికలతో రుజువైందని వారు అంటున్నారు.


జనసైనికులతో జతకట్టినా..: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే ఆశతో ఉప ఎన్నిక బరిలోకి దిగిన బీజేపీకి మళ్లీ ఘోర పరాజయమే ఎదురైంది. జనసేనతో జతకట్టి పోటీ చేసినా డిపాజిట్‌ దక్కలేదు. 57,080 ఓట్లు (5.19 శాతం) మాత్రమే దక్కించుకోగలిగింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కేంద్ర నాయకులు, పార్టీ రాష్ట్ర నేతలు పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొన్నా ప్రజలను పెద్దగా ఆకట్టులేకపోయారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 1.22 శాతం ఓట్లు రాగా.. ఈసారి జనసేనతో జతకట్టడంతో ఓటింగ్‌ శాతం 5.19కి పెరిగింది. కాంగ్రెస్‌ కేవలం 1.38 శాతం ఓట్లకే పరిమితమైంది.

Updated Date - 2021-05-03T09:53:43+05:30 IST