జిల్లాలో వైసీపీకి 1,12,140 ఓట్ల మెజారిటీ

ABN , First Publish Date - 2021-05-03T04:36:17+05:30 IST

అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావించిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి విజయం సాధించారు

జిల్లాలో వైసీపీకి 1,12,140 ఓట్ల మెజారిటీ

ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యత


తిరుపతి, మే 2 (ఆంధ్రజ్యోతి): అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావించిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మీద ఆయన 2,71, 592 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లకు సంబంధించి గురుమూర్తికి 1,12,140 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. మూడు సెగ్మెంట్లలోనూ కలిపి 463722 ఓట్లు పోల్‌ కాగా వాటిలో వైసీపీకి 260891 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 148751 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 26992 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ 4924 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు మొదలు కాగా పోస్టల్‌ బ్యాలెట్లతో సహా మూడు సెగ్మెంట్లలో అన్ని రౌండ్లలోనూ వైసీపీ అభ్యర్థికే ఆధిక్యత లభించింది. తిరుపతి, సత్యవేడు సెగ్మెంట్లతో పోలిస్తే శ్రీకాళహస్తి సెగ్మెంట్‌ పరిధిలో మాత్రం చాలా రౌండ్లలో టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థితో పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయి.

16వ ఎంపీగా గురుమూర్తి


  తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి 16 సార్లు ఎన్నిక జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. టీడీపీ, బీజేపీ ఒక్కోసారి గెలుపొందాయి. వైసీపీ వరుసగా మూమూడో సారి తిరుపతి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 16వ ఎంపీగా ఎన్నికయ్యారు.



పార్టీ    అభ్యర్థి          ఓట్లు     శాతం

వైసీపీ   గురుమూర్తి    6,26,108    (56.7 శాతం)

టీడీపీ   పనబాక లక్ష్మి   3,54,516    (32.1)

బీజేపీ   రత్నప్రభ       57,080      (5.2)

కాంగ్రెస్‌  చింతా మోహన్‌ 9,585      (0.9)

సీపీఎం  యాదగిరి       5,977      (0.5)


ఇతరులు ....             35,992     (3.3)

నోటా                    15568     (1.4)


కౌంటింగ్‌ సరళి ఇలా.... 

 

ఉదయం 6 గంటలకే వివిధ పార్టీలకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఉదయం 7 గంటల సమయంలో కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చారు. 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా... తొలిరౌండ్‌లో తిరుమల ఓట్ల లెక్కింపు జరిగింది.8.30 గంటల సమయంలో తొలి రౌండ్‌ ఫలితం వెలువడింది. వైసీపీకి 2,326 ఓట్ల ఆధిక్యం లభించింది.9.30 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అల్పాహారం తీసుకునేందుకు బయటకు వెళ్లారు.అయితే ఫలితాల సరళిని చూసి అసహనంతోనే ఆమె వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. అల్పాహారం తీసుకున్న తరువాత తిరిగి కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చిన పనబాక అసత్య వార్తలపై మండిపడ్డారు.కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు లెక్కింపు కేంద్రంలోనే ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఉదయం 9 గంటల సమయంలో వచ్చారు. 9.45 గంటల సమయంలో బయటకు వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగొచ్చారు. కొంతసేపు కౌంటింగ్‌ సరళిని పరిశీలించాక నెల్లూరుకు బయల్దేరి వెళ్లారు. ఓట్ల లెక్కింపులో తొలుత తిరుపతి సెగ్మెంట్‌ కౌంటింగ్‌ పూర్తయింది. తరువాత సత్యవేడు,  శ్రీకాళహస్తి ఫలితాలు వెలువడ్డాయి. చివరి ఫలితం సాయంత్రం 4 గంటలకు వెలువడింది.

Updated Date - 2021-05-03T04:36:17+05:30 IST