అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతా: మంత్రి విశ్వరూప్

ABN , First Publish Date - 2020-07-09T17:53:12+05:30 IST

తాను ప్రాతినిథ్యం వహించే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో..

అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతా: మంత్రి విశ్వరూప్

అమలాపురం(తూర్పు గోదావరి): తాను ప్రాతినిథ్యం వహించే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాల భూసేకరణలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవితోపాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలో ఇళ్ల స్థలాల భూసేకరణలో అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు చేసిన ఆరోపణ నేపథ్యంలో మంత్రి బుధవారం తీవ్రంగా స్పందించారు. ఆనందరావు విజ్ఞాపనను తాను స్వాగతిస్తున్నానన్నారు.


తన నియోజక వర్గంలో ప్రస్తుతం, రాబోయే నాలుగేళ్లలో ఏ అవినీతిని నిరూపించినా ఎమ్మెల్యే, మంత్రి పదవుల తోపాటు శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. అమలాపురం డివిజన్‌ పరిధిలో ఇళ్ల స్థలాల సేకరణలో ఎమ్మెల్యేకు సంబంధం లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులే భూసేకరణ చేశారని, ఈ విషయంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధికి సంబంధం లేదని వెల్లడించారు. ఇళ్ల స్థలాల భూసేకరణలో అధికారులు పూర్తి పారదర్శకంగా వ్యవహరించారని, జిల్లా కలెక్టర్‌ నాయకత్వంలో ఆర్డీవో స్వీయ పర్యవేక్షణలో జరిగిన భూసేకరణలో ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనం, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసే ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్వరూప్‌ అన్నారు.

Updated Date - 2020-07-09T17:53:12+05:30 IST