4 కోట్ల మందికీ నోటీసులు ఇస్తారా?

ABN , First Publish Date - 2020-06-01T08:30:51+05:30 IST

ప్రభుత్వ పాలనా విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు.

4 కోట్ల మందికీ  నోటీసులు ఇస్తారా?

కోర్టు తీర్పులు ప్రజాహితంగా ఉండాలి

ప్రత్యర్థులు ఎడిటెడ్‌ ఆధారాలు ఇస్తే హైకోర్టు వెంటనే స్పందిస్తోంది

మేము పక్కా ఆధారాలిచ్చినా పక్కన పెట్టేస్తోంది

మేనిఫెస్టో అమలులో మీ అడ్డంకులు ఏంటి? 

తీర్పులపై వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు వ్యాఖ్యలు 


పలాస, మే 31: ప్రభుత్వ పాలనా విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన కాశీబుగ్గలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసే విషయంలో ప్రత్యర్థి పార్టీలు ఏవో కొన్ని లిటిగేషన్లు పెట్టి కోర్టుకెళ్తున్నాయి. ప్రజాహిత కార్యక్రమాలను అమలు పర్చకుండా కోర్టులు ఆటంకపర్చడం మాకు ఆమోదంయోగ్యం కాదు. కోర్టు తీర్పులతో మేము ఏకీభవించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు ప్రజలు కూడా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదించే పరిస్థితి వస్తుంది.


అప్పుడు 44 మందికికాదు... 4 కోట్ల మందికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది’ అన్నారు.  ఎన్నికల మేనిఫెస్టోను ప్రత్యర్థులు, కోర్టులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. శాసనవ్యవస్థలోకి నేడు కోర్టులు ప్రవేశిస్తున్నాయని, ఇంగ్లిష్‌ మీడియం, పేదలకు ఇళ్లు, కొన్ని కార్యాలయాల తరలింపును సైతం కోర్టులు అడ్డుకుంటున్నాయన్నారు. కొన్ని కేసులను కోర్టులు సుమోటోగా తీసుకోవడం, ప్రత్యర్థులు ఎడిట్‌ చేసిన వీడియోలను సమర్పిస్తే వాటిని ఆధారంగా తీసుకుని తీర్పు ఇవ్వడం ఏంటి? మేము పూర్తి ఆధారాలతో పిటిషన్‌ వేస్తే పక్కనపెట్టేయడమేంటి?  గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఈ కోర్టులు ఎక్కడికెళ్లాయి? అని ప్రశ్నించారు.


ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఈ కోర్టు తీర్పులు ఉండాలని తాము అనడం లేదని, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే తీర్పు ఇవ్వాలని కూడా తాము అడగడం లేదని, కోర్టు తీర్పులు ప్రజాహితంగా ఉండాలని తాము అడుగుతున్నామన్నారు. నిమ్మగడ్డ మీద టీడీపీ నేతలకు ఉన్న ఆసక్తి, ప్రయోజనం ఏంటి? ఆయన్నే కొనసాగించాలని వారు అడగడంలో అర్థం ఏమిటి? నిమ్మగడ్డకు, టీడీపీకి ఉన్న సంబంధమేంటి? అని అప్పలరాజు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నియమితులైన నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉండడం తమకు ఇష్టం లేదని చెప్పారు. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు నిర్దేశిత గడువు చెప్పనందున ఈ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉందని వెల్లడించారు. 

Updated Date - 2020-06-01T08:30:51+05:30 IST