Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలసత్వాన్ని సహించం: ఎమ్మెల్యే బాలరాజు

జంగారెడ్డి గూడెం (పశ్చిమ గోదావరి): ప్రజలకు అత్యవసరమైన వైద్య, ఆరోగ్య అమలు విషయంలో అధికారులు, సిబ్బంది అలసత్వాన్ని ఉపేక్షించబోనని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హెచ్చరించారు. విద్యార్థుల వరుస మరణాలతో భీతుల్లుతున్న బోడిగూడెం, మంగపతి దేవిపేట గ్రామాలను ఆయన సోమవారం సందర్శించారు. విద్యార్థుల మరణాలకు కారణం వారికి గతంలోనే ఉన్న ఆనారోగ్య పరిస్థితులే కారణమని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారన్నారు. అయితే మరింత లోతుగా విచారణ నిర్వహించి వాస్తవాలు ప్రజలకు వివరిస్తామన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం అమలు, అదే విధంగా సీజనల్ వ్యాధులపై నిర్వహిస్తున్న వైద్యశిబిరాలు, చికిత్సల గురించి కొయ్యలగూడెం యూజీ పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్తేరు రాణిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులలో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలన్నారు. విద్యార్థులను తిరిగి విద్యాకేంద్రాలకు పంపే విధంగా ప్రజాప్రతినిధులు, వలంటీర్లు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలలోని అన్నివర్గాల వారికి వయోభేదం చూడకుండా వైద్య పరీక్షలు నిర్వహించవలసిందిగా డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణను కోరారు.

ప్రభుత్వం మీద బురదజల్లే పనిని లక్ష్యంగా పెట్టుకున్న వారు విద్యార్థుల మరణాలను కూడా రాజకీయం చేస్తూ ఉండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు రెండు గ్రామాల్లో అమలవుతున్న వైద్య సేవలు, వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకి  అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన మరోమారు సందర్శిస్తారని, హైస్కూల్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బోడిగూడెంలో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు ఇళ్ల భాస్కర రావు, గంజిమాలా దేవి, ఎంపీపీ గంజిమాల రామారావు, జడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, సర్పంచ్ కె గడ్డియ్య, ఎంపీటీసీలు తేలే శ్రీను, జాన్ డేవిడ్ కింగ్, మండల కన్వీనర్ జి నాగేశ్వరరావు, నాయకులు జక్కు గోపాలం, పోలీశ్వరరావు, సుక్ల బోయిన రాజు, తాడిగడప రామకృష్ణ, చిడిపి రవి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement