సొంత పార్టీలో.. రోజాకు సెగ

ABN , First Publish Date - 2020-05-27T09:40:42+05:30 IST

వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్‌ రోజాకు సొంత పార్టీలోనే సెగ పెరుగుతోంది. ఆమెకు మాటమాత్రం చెప్పకుండా ఆమె నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం ఓ

సొంత పార్టీలో.. రోజాకు సెగ

  • ఆమెకు చెప్పకుండానే పుత్తూరులో డిప్యూటీ సీఎం పర్యటన
  • భగ్గుమన్న నగరి ఎమ్మెల్యే


తిరుపతి, మే 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నగరి ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్‌ రోజాకు సొంత పార్టీలోనే సెగ పెరుగుతోంది. ఆమెకు మాటమాత్రం చెప్పకుండా ఆమె నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణమండపం, కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం స్థల పరిశీలనకు మంగళవారం నారాయణస్వామి, ఆదిమూలం, కలెక్టర్‌ నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు పట్టణంలో పర్యటించారు. అక్కడ ఆర్టీసీ బస్టాండ్‌ పక్కనే ఉన్న తట్రవానికుంటలో 1977లో ఐదుగురు ఎస్సీలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలిచ్చింది. మురికిగుంట కావడం, పూడ్చడం కష్టం కావడంతో ఇంతకాలం దానిని వదిలేశారు.


ఇపుడు ఆ స్థలాన్ని అంబేడ్కర్‌ ట్రస్టుకు అప్పగిస్తే అందులో ఎస్సీ, ఎస్టీల కోసం అంబేడ్కర్‌ పేరిట కల్యాణ మండపం కట్టుకుంటామని ఆదిమూలం ప్రతిపాదించారు. దీంతో నారాయణస్వామి.. ఆదిమూలాన్ని వెంటబెట్టుకుని సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రోజా నగరిలోని తన ఇంట్లోనే ఉన్నా ఆమెను పిలవలేదు. దీనిపై రోజా, ఆమె అనుచరులు మండిపడ్డారు.


పోనీ ఆ మాట జగన్‌ గారిని చెప్పమనండి..

‘ఏం తప్పు చేశామని పిలవలేదు? వాళ్లను వెళ్లవద్దని నేను చెప్పడం లేదు. ఎస్సీల కోసం కల్యాణమండం కట్టడం నాకు కూడా హ్యాపీయే కదా..! నన్నూ పిలిస్తే  గౌరవంగా ఫీలవుతా కదా! బాధగా ఉంది. పోనీ ఆ మాట జగన్‌ గారిని చెప్పమనండి. ఎమ్మెల్యేను పిలవనవసరం లేదు.. ప్రొటోకాల్‌ లేదు. నా ఇష్టం అంటే సరిపోతుందా?.’ అని రోజా ప్రశ్నించారు.


కౌంటర్..

రోజా వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం తిరుపతిలో కౌంటర్‌ ఇచ్చారు.  ‘అక్కడకు వెళ్లడానికి రోజా అనుమతి అవసరం లేదు. కలెక్టర్‌ పుత్తూరు మీదుగా తిరుపతి వెళ్తుంటే తీసుకెళ్లి స్థలాలు చూపించాం. దానితో ఆమెకు ఏం సంబంధం’ అని నారాయణస్వామి ప్రశ్నించారు.

Updated Date - 2020-05-27T09:40:42+05:30 IST