అధికార వైసీపీలో మరో రచ్చ.. మంత్రి బాలినేని నివాసానికి వెళ్లి మరీ..

ABN , First Publish Date - 2020-09-05T18:43:57+05:30 IST

అధికార వైసీపీ నేతల్లో ఎస్‌ఐల బదిలీల వ్యవహారం అలజడి సృష్టించింది. కొందరికి సంతృప్తినిచ్చినా, కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు అయితే మంత్రిని కలిసి ఎస్పీ పోకడపై ఫిర్యాదు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే కూడా అయిష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది.

అధికార వైసీపీలో మరో రచ్చ.. మంత్రి బాలినేని నివాసానికి వెళ్లి మరీ..

అధికార పార్టీలో బదిలీల రచ్చ

రగిలిపోతున్న గిద్దలూరు ఎమ్మెల్యే

అసంతృప్తితో కనిగిరి ఎమ్మెల్యే 

ముడిపడని చీరాల బదిలీలు 

మాట నెగ్గించుకున్న దర్శి ఎమ్మెల్యే 

ట్రాక్‌రికార్డు సరిలేకుంటే వీఆర్‌కే 

7న వస్తా.. అన్నీ పరిష్కరిస్తా : మంత్రి


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): అధికార వైసీపీ నేతల్లో ఎస్‌ఐల బదిలీల వ్యవహారం అలజడి సృష్టించింది. కొందరికి సంతృప్తినిచ్చినా, కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు అయితే మంత్రిని కలిసి ఎస్పీ పోకడపై ఫిర్యాదు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే కూడా అయిష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. చీరాల విషయంలో మరోసారి సాచివేత వైఖరిని అవలంబించటం వైరివర్గాలకు ఆగ్రహం తెప్పించింది. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మాట నెగ్గించుకోగా, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి వర్గీయులు రగిలిపోతున్నారు. అద్దంకి, కొండపి ఇన్‌చార్జ్‌లు సంతృప్తిగానే కనిపించినా ఒకరిద్దరిని వీఆర్‌కి పంపటంపై రాజకీయంగా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మొత్తంపై వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దస్థాయిలో జరిగిన బదిలీల వ్యవహారం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. పైగా విజయవాడలోని మంత్రి బాలినేని నివాసంలో పలువురు నేతలు ఈ విషయంపైనే ఆయనను నేరుగా కలవటం కొందరు ఏకంగా ఎస్పీపై ఫిర్యాదులు చేయటం విశేషం.


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్లర్ల బదిలీలు పెద్దసంఖ్యలో జరగటం ఇదే ప్రథమం. వివిధ రకాల వత్తిడిల మధ్య ఈ బదిలీల ఉత్తర్వులను కూడా ఎస్పీ గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నిర్ణీత సమయంలో మీడియాకు అందకుండా ఉత్తర్వులు ఇవ్వటం విశేషం. అంతేగాక సదరు ఎస్‌ఐలను ఆగమేఘాలపై వెళ్లి బదిలీ అయిన స్థానాల్లో బాధ్యతలు తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం 29మంది ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. రమారమి 2నెలలుగా కసరత్తు, అధికారపార్టీ వత్తిళ్ల మధ్య ఈ బదిలీలు జరిగాయి. మొత్తం బదిలీల జాబితాను పరిశీలిస్తే అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జుల సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. కారణాలు, కారకులెవరైనా కొన్ని నియోజకవర్గాల్లో అధికారపార్టీకి అనుకూలంగా భావిస్తున్న ఒక సామాజికవర్గానికి చెందిన ఎస్‌ఐలకు ప్రాధాన్యమిస్తూ అధిష్టానం నుంచి కొన్ని సూచనలు అందినట్లు కనిపిస్తోంది. కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల విషయంలో ఈ సామాజికవర్గ ఎస్‌ఐలకు ప్రాధాన్యతనిచ్చి పోస్టింగ్‌లు ఇవ్వాలన్న ఆదేశాలు కూడా అధికారులకు అందాయని తదనుగుణంగానే ఎమ్మెల్యేల సిఫార్సులను పక్కనబెట్టాల్సిన పరిస్థితి ఎదురైందని కూడా భావిస్తున్నారు.


గిద్దలూరు ఎమ్మెల్యే గరంగరం 

గిద్దలూరు నియోజకవర్గంలో ఎస్‌ఐల బదిలీల విషయమై ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఆ మేరకు శుక్రవారం విజయవాడ వెళ్లి మంత్రి బాలినేనిని కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఎమ్మెల్యేల మాట ఎస్పీ వినటం లేదని, ఆయనే పాలన చేసుకుంటే సరిపోతుందని కూడా వ్యాఖ్యానించినట్లు సమాచా రం. సరైన పద్ధతిలో రిసీవ్‌ చేసుకోవటం లేదని చెప్పినట్లు తెలిసింది. మేదరమెట్ల ఎస్‌ఐని గిద్దలూరుకి మార్చాలని కోరగా బదిలీల్లో బేస్తవారిపేటకు వేశారు. బీపేటలో ఉన్న రవీంద్రరెడ్డిని గిద్దలూరుకి మార్చారు. ఎస్‌ఐని తాను అడిగిన స్టేషన్‌కి ఇవ్వని పరిస్థితిలో మేమెలా రాజకీయం చేయాలంటూ ఆయన ఆవేదన చెందారు. ఆ నియోజకవర్గంలో కొమరోలు ఎస్‌ఐ నియామకంలోనూ తనకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పినట్లు తెలిసింది. ఆయనను శాంతింపజేసేందుకు మంత్రి పలు ప్రయత్నాలు చేసి చివరకు సీఐని కావాలంటే వెంటనే నీవు కోరిన వారిని వేయిస్తానని చెప్పినట్లు సమాచారం.  


కనిగిరి ఎమ్మెల్యే కూడా..

కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ కూడా ఎస్‌ఐల బదిలీల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కనిగిరి ఎస్‌ఐని బదిలీ చేయాలని వైసీపీలోని కీలక సామాజికవర్గేతర నాయకులు పట్టుబట్టారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే సామాజికవర్గాల సమతూకంతో వేరే ఎస్‌ఐ పేరుని సూచించారు. ఆయన సూచించిన వారిని కాకుండా అధికారపార్టీకి అనుకూలమైన సామాజికవర్గం నేతలు సూచించిన విధంగా వారి వర్గానికే చెందిన కురిచేడు ఎస్‌ఐని కనిగిరి వేశారు. తన మాట నెగ్గలేదన్న బాధ ఎమ్మెల్యేలో ఉండగా ఆయనకు అండగా ఉన్న తన సామాజికవర్గం నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎ్‌సపురం ఎస్‌ఐ బదిలీ విషయంలోనూ తనకు న్యాయం జరగలేదని ఆయన అన్నట్లు తెలిసింది.


చీరాలలో ముడిపడని వ్యవహారం 

చీరాల నియోజకవర్గంలో బదిలీల వ్యవహారం కూ డా కొలిక్కిరాలేదు. ఒక ఎస్‌ఐని బదిలీ చేయటం మినహా మిగిలిన వాటిని పక్కనబెట్టారు. కనీసం ఖాళీ గా ఉన్న వేటపాలెంకు కూడా ఎస్‌ఐని నియమించలేదు. అక్కడ ఇటు ఎమ్మెల్యే, అటు మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఐల బదిలీల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించారు. ఇంకొల్లు సీఐగా అల్తాఫ్‌ హుస్సేన్‌ని తాజాగా నియమించటం ద్వారా ఎంతోకొంత ఎమ్మెల్యే బలరాంకు ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడైంది. ప్రస్తుతం అక్కడ వన్‌టౌన్‌లో ఉన్న ఒక ఎస్‌ఐని ముండ్లమూరుకు బదిలీచేశారు. గతంలో మాజీఎమ్మెల్యే ఆమంచి సిఫార్సుతో ఆయన చీరాలకు వచ్చారు. వేటపాలెం ఎస్‌ఐ ఇటీవల సస్పెండ్‌ అయినా ప్రస్తుత బదిలీల్లో అక్కడ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. మరో ముగ్గురు ఎస్‌ఐల బదిలీలనూ పక్కనబెట్టారు. ఇటు బలరాం వర్గం, అటు ఆమంచి వర్గీయులు ఇచ్చిన సిఫార్సులలో ఎవరిని ఎలా సంతృప్తి పరచాలన్న విషయంపై అధిష్టానం ఒక కొలిక్కి రానందునే అక్కడ బదిలీలను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.


ఎస్పీకి మహీధర్‌ ఫోన్‌ 

కాగా బదిలీల జాబితా వెలువడిన అనంతరం కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలిసింది. గుడ్లూరు ఎస్‌ఐని వీఆర్‌కి పంపటం మినహా ఇంకా ఎవరినీ బదిలీ చేయలేదు. దీంతో ఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడిన మహీధర్‌రెడ్డి కందుకూరు, లిం గసముద్రం ఎస్‌ఐలను బదిలీ చేయాలని సూచించిన ట్లు తెలిసింది. ఈ విషయంపై కలిసి మాట్లాడతానని కూడా చెప్పటం విశేషం. కాగా ఈ బదిలీల విషయంలో సమస్యలుంటే 7న మాట్లాడి పరిష్కరిస్తానని, తనను కలిసినా లేక నేరుగా ఫోన్‌ చేసిన నేతలకు మంత్రి బాలినేని చెప్పినట్లు తెలిసింది. చీరాల ఎస్‌ఐల బదిలీల సమస్యను కూడా ఆ రోజు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇటు కొందరు ఎమ్మెల్యేలు, అటు కొందరు ఇన్‌చార్జులతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన కొందరు ముఖ్యనాయకులు ఈ అంశంపైనే విజయవాడలో ఉన్న బాలినేని వద్దకు క్యూకట్టారు. 


మాట నెగ్గించుకున్న వేణుగోపాల్‌ 

దర్శిలో బదిలీల వ్యవహారంలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిలు పట్టుదలకు పోయారు. ముఖ్యంగా ముండ్లమూరు ఎస్‌ఐని ఉంచాలని శివప్రసాద్‌రెడ్డి, బదిలీ చేయాలని వేణుగోపాల్‌ పట్టుబట్టారు. చివరికి ఎమ్మెల్యే సిఫార్సుకి ప్రాధాన్యమిస్తూ అతనిని కొత్తపట్నం బదిలీ చేశారు. ఆయన స్థానంలో గతంలో వేణుగోపాల్‌ సూచించిన వారిని కాకుండా ఆయన తాళ్లూరుకి సూచించిన ఎస్‌ఐని నియమించారు. దీనిపై వేణుగోపాల్‌ మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి బాలినేని ఎస్పీతో మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ సూచించిన హరిబాబుని మంత్రి సురేష్‌ దోర్నాలకు కావాలని కోరటంతో అక్కడికి ఇచ్చామని, వేణుగోపాల్‌ తాళ్లూరుకి కోరిన ఎస్‌ఐని ముండ్లమూరుకి వేశామని ఎస్పీ చెప్పినట్లు తెలిసింది. దీనికితోడు దర్శి, కురిచేడు ఎస్‌ఐల బదిలీల విషయంలోనూ ఎమ్మెల్యే సిఫార్సులకే ప్రాధాన్యమివ్వటంతో ఆయన సంతృప్తిచెందినట్లు సమాచారం. అద్దంకిలో ఇన్‌చార్జ్‌ కృష్ణచైతన్య సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చారు. కొరిశపాడు ఎస్‌ఐని ఆయన సంతమాగులూరు వేయాలని కోరగా అతన్ని వీఆర్‌కి పంపించారు. కొండపి ఇన్‌చార్జ్‌ మాటకు ప్రాధాన్యమిచ్చి కొండపిఎస్‌ఐని బదిలీ చేశారు.  

Updated Date - 2020-09-05T18:43:57+05:30 IST