వైసీపీ ఎమ్మెల్యేలకు.. షాక్!

ABN , First Publish Date - 2021-04-12T16:11:25+05:30 IST

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారానికి..

వైసీపీ ఎమ్మెల్యేలకు.. షాక్!
ఎమ్మెల్యే కిలివేటి ప్రచార రథాన్ని అడ్డుకుంటున్న మావిళ్లపాడు గ్రామస్థులను కట్టడి చేస్తున్న పోలీసులు.. ఆందోళన చేస్తున్న మత్స్యకారులు

వైసీపీ ఎమ్మెల్యేల అడ్డగింత

మావిళ్లపాడులో ప్రచారం చేయొద్దన్న గ్రామస్థులు 

బాబు వస్తున్నందున రావద్దు.. 

వెనుదిరిగిన కిలివేటి


దొరవారిసత్రం(నెల్లూరు): తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ అభ్యర్థి గురుమూర్తిలకు మండలంలోని మావిళ్ల పాడు గ్రామస్థులు ఆదివారం షాక్‌ ఇచ్చారు. తమ గ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నందున సంస్కారవంతంగా ఆలోచించి ప్రచారం చేపట్టకుండా వెళ్లాలని గ్రామస్థులు మూకుమ్మడిగా ప్రచార రథానికి అడ్డుతగిలారు. ఎమ్మెల్యే సంజీవయ్య ఏ గ్రామంలో అయినా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందంటూ గ్రామస్థులను పరుషపదజాలంతో హెచ్చరించారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు ప్రచార రథం మీదకు దూసుకెళ్లారు. పోలీసులు ఓ వైపు కట్టడి చేస్తున్నా లెక్కచేయకుండా తమ గ్రామంలో వైసీపీ ప్రచారం చేపట్టకూడదని గట్టిగా నినదించారు. ఆ సమయంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో స్థానిక టీడీపీ నాయకుడు వేనాటి సురేష్‌రెడ్డి గ్రామస్థులను అదుపుచేశారు. ఎమ్మెల్యే సంజీవయ్య వెనక్కి తగ్గి సమయస్ఫూర్తితో గ్రామస్థులను సముదాయించేలా మాట్లాడారు. అయినా వారు ప్రచారం చేసేందుకు ఒప్పకోలేదు. దాంతో చేసేదేమీలేక ప్రచారాన్ని ఉపసంహరించుకొని మరో గ్రామం తనియాలికి వెళ్లారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, వైసీపీ నేత బాలచంద్రారెడ్డి ఉన్నారు.


వాకాడు: తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపును ఆకాంక్షిస్తూ రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆదివారం మండలంలోని తూపిలిపాళెంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతుండగా, 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు కాలేదు. ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చారని కొందరు మత్స్యకారులు ప్రశ్నించి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు బీద మస్తాన్‌రావు, ఏఎఫ్‌సీవోఎఫ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు, తూర్పు గోదావరిజిల్లా కొత్తపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, మండల వైసీపీ నాయకుడు కొడవలూరు భక్తవత్సల్‌రెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T16:11:25+05:30 IST