ఏపీలో రాష్ట్రపతి పాలనకు చాన్స్‌!

ABN , First Publish Date - 2020-10-13T08:36:46+05:30 IST

ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాం గ, చట్టవ్యతిరేక చర్యలను చూస్తుంటే రాష్ట్రంలో ..

ఏపీలో రాష్ట్రపతి పాలనకు చాన్స్‌!

వైసీపీ ఎంపీ రఘురామ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాం గ, చట్టవ్యతిరేక చర్యలను చూస్తుంటే రాష్ట్రంలో త్వరలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను భ్రష్ఠుపట్టిస్తోందని.. ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం తన కేసుల నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, దీంతో రాష్ట్రంలో పాలన విధ్వంసమై, రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతోందన్నారు. ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఆర్టికల్‌ 356 మేరకు రాష్ట్రపతి పాలన దిశగా దారి తీస్తాయని హెచ్చరించారు. ‘అమరావతి’ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు.


నా ‘ఫొటో’తో ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు

‘‘మూడేళ్ల కిందట ఒక తెలుగు ఎంపీకి చెందిన వేడుకలో ఒక రష్యన్‌ యువతి నా నోట్లో షాంపైన్‌ పోస్తున్నట్టున్న ఫోటో నిజమే. అందులో ఉన్నది నేనే. వైసీపీ నేతలు నా ఫొటోను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ.. ఉన్నాదుల్లా వ్యవహరించడమేంటి?’’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం ఢిల్లీలో మండిపడ్డారు. కాగా.. సీఎం జగన్‌కు 25 ఏళ్లు జైలు జీవితం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ‘జగనన్న విద్యా కానుక’ పథకం అమలు తీరుపై విమర్శలు చేశారు. 

Updated Date - 2020-10-13T08:36:46+05:30 IST