Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీ పరిధిలో నువ్వు ఉంటే మంచిది.. లేదంటే నా సత్తా ఏంటో చూపిస్తా..!

వై‘బీపీ’

తారస్థాయికి చేరిన వైసీపీ కుమ్ములాటలు

ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే రాజా

ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు

సోషల్‌ మీడియాలోనూ పోస్టింగ్‌లు

ఆగని ఆధిపత్య పోరు

సిటీకి శ్రీఘాకోళ్లపు రావాలని కొందరు నేతల పట్టుదల

నేడు ఎంపీ వర్గం సమావేశం


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు రోడ్డెక్కారు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమంటూ సవాల్‌ విసురుకున్నారు. ఇప్పటివరకూ ప్రచ్ఛన్నయుద్ధంగా జరిగిన ఆధిపత్య పోరు చివరకు రోడ్డున పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోమవారం మీడియా సమావేశంలో ఎంపీ భరత్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు పిచ్చి ఎంపీగా, సినిమాట్రిక్స్‌ బొమ్మ చూపిస్తున్నారంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నీ వెనుక రౌడీలు, భూమాఫియా ఉందని, హత్యలు చేసి ఆత్మహత్యలుగా మార్చే ఘనులు ఉన్నారని ఎంపీపై ఎమ్మెల్యే ఆరోపణ చేశారు. అంతుకుముందు రాజానగరంలోని మూడు మండలాల వైసీపీ నేతలు వేర్వేరుగా సమావేశమై ఎంపీకి వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఈనేపథ్యంలో ఎంపీ భరత్‌ రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘నీలా నేను చీకటి రాజకీయాలు చేయను. నువ్వు చేసే ప్రతీ పని గురించి స్కూల్‌కు వెళ్లే పిల్లాడిని అడిగినా చెబుతాడు. నీవు పిలిస్తే వచ్చేది బ్లేడ్‌ బ్యాచ్‌, చైన్‌ స్నాచర్లు మాత్రమే. నేను పార్టీ గీచిన గీతను దాటను. నీవు నీ పరిధిలో ఉంటే మంచిది. లేదంటే రెండు రాష్ర్టాల్లో నా సత్తా ఏంటో చూపిస్తా. నీలాగే కిడ్‌లా ప్రవర్తిస్తే నీకు నాకూ తేడా ఉండదు. నా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో లెక్కలు చూసుకో. ఆవ భూములపై ఆరోపణలు చేయడం కాదు. రైతుల బ్యాంక్‌ ఖాతాల వ్యవహారాన్ని బయటపెడితే సంతోషిస్తా. ఎదుటివారిపై బురద చల్లితే అది నీ మీద కూడా పడుతుందని మర్చిపోవద్దు’’ అని హితవు పలికారు. 


ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు రెండు మూడు వర్గాలుగా చీలిపోయారు. రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ మౌనంగా ఉంటుండడంతో ఎంపీ రచ్చబండ, నగరబాట పేరిట డివిజన్ల వారీ పాదయాత్ర చేస్తూ సిటీలో పట్టు సాధించుకోవడం కోసం ప్రయత్నం మొదలెట్టారు. ఈ ప్రయత్నానికి చెక్‌ చెప్పడం కోసం జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌, సిటీ మాజీ కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం వర్గాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సిటీలో సుబ్రహ్మణ్యంకే ఒక వర్గం ఉంది. కానీ సిటీ కోఆర్డినేటర్‌ పదవి వదిలేసిన తర్వాత ఆయన మౌనంగా ఉండిపోయారు.


ఇటీవల కొందరు మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జిలు ప్రత్యేకంగా సమావేశమై మళ్లీ సిటీ రాజకీయాల్లో శ్రీఘాకోళ్లపు, జక్కంపూడి రాజా జోక్యం చేసుకుంటేనే పార్టీ బతికి బట్టకడుతుందని చెబుతూ మళ్లీ శ్రీఘాకోళ్లపును తెరమీదకు తీసుకుని రావడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సుబ్రహ్మణ్యం రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని, అధిష్ఠానం దృష్టికి ఇక్కడి విషయాలు తీసుకుని వెళతానని చెప్పడం గమనార్హం. కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఎంపీ వర్గం కార్యకర్తలు నేతలు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కార్యకర్తలు చీలిపోయారు. సిటీపై పార్టీపై ఎవరు పట్టు సాధిస్తారో చూడాల్సి ఉంది. కొద్ది నెలల్లో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ కుమ్ములాటల వల్ల కార్పొరేషన్‌ను ఎలా దక్కించుకుంటామని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీలో మొదలైన ఈ ప్రత్యక్ష పోరు ముగిసేటట్టు కనబడడంలేదు. ఈ పరిణామాలను టీడీపీ సంతోషంగా పరిశీలిస్తోంది.

Advertisement
Advertisement