వైసీపీ నేతల వసూళ్లు

ABN , First Publish Date - 2020-11-23T06:25:27+05:30 IST

మన్యంలో గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం అధికార పార్టీ నేతలకు కాసుల పంట పండిస్తున్నది. పట్టాలను తామే మంజూరు చేయిస్తున్నామని నమ్మబలుకుతూ, అమాయకులైన గిరిజనుల నుంచి గ్రామ, మండస్థాయి నాయకులు రూ.1500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైసీపీ నేతల వసూళ్లు

‘పోడు’ పట్టాలు పొందిన గిరిజనుల నుంచి డబ్బులు దండుకుంటున్న వైనం

భూ విస్తీర్ణాన్నిబట్టి రూ.1500 నుంచి రూ.3 వేల వరకు వసూలు 

రైతుబంధు డబ్బుల్లో కూడా వాటాలు

ఒక్కో రైతు నుంచి రూ.1,500 తీసుకున్న నాయకులు

వీఆర్‌పీ, అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల పోస్టుల పేరుతో కలెక్షన్స్


కొయ్యూరు, నవంబరు 22: 

మన్యంలో గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం అధికార పార్టీ నేతలకు కాసుల పంట పండిస్తున్నది. పట్టాలను తామే మంజూరు చేయిస్తున్నామని నమ్మబలుకుతూ, అమాయకులైన గిరిజనుల నుంచి గ్రామ, మండస్థాయి నాయకులు రూ.1500 నుంచి రూ.3,000 వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా రైతు బంధు సాయంలోనూ వాటా డిమాండ్‌ చేస్తున్నారు. ఇక వీఆర్‌పీ, అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల పోస్టులు ఇప్పిస్తా మంటూ డబ్బులు దండుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. అటవీ హక్కుల చట్టం అమలులో భాగంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (అటవీ హక్కు గుర్తింపు- రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. 2005 డిసెంబరు 13వ తేదీ ముందు నుంచి ఎవరైతే అటవీ భూములను సాగు చేసుకుంటున్నారో... వారికి హక్కు గుర్తింపు పట్టాలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏజెన్సీలో సర్వే చేసి 82 వేల ఎకరాలకు పట్టాలను పంపిణీ చేయాలని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించింది. కొయ్యూరు మండలంలోని 20 పంచాయతీల్లో 1,535 మంది గిరిజనులకు 3,591.33 ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మొదటి దఫా పట్టాల పంపిణీ ఈ నెల 9న బూదరాళ్లలో చేపట్టారు. ఈ గ్రామంలో 382 మందికి వెయ్యి ఎకరాలకు సంబంధించి పట్టాలను ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పంచాయతీల వారీగా మిగిలిన లబ్ధిదారులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్థానిక నేతల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా గత వారం బకులూరు సచివాలయ పరిధిలోగల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక్కో గిరిజన రైతు నుంచి (పట్టాలో ఉన్న అటవీ భూమి విస్తీర్ణాన్ని బట్టి) రూ.1500 నుంచి రూ.3 వేల వరకు స్థానిక వైసీపీ నేతలు వసూలు చేసినట్టు లబ్ధిదారులు చెప్పారు. శుక్రవారం ఆడాకులలో కించలి కిష్టారం, బి.కొత్తూరు, ఆర్‌.కొత్తూరు, తదితర గ్రామాలకు చెందిన 92 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఇక్కడ ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల చొప్పున అధికార పార్టీ నేతలు వసూలు చేసినట్టు సమాచారం. 


రైతు భరోసా సాయంలోనూ...

సాగు భూములను అటవీ హక్కు గుర్తింపు పట్టాలు పొందిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద నగదు సాయం మంజూరు చేసింది. దీనిని ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ సాయాన్ని కూడా తామే మంజూరు చేయించా మంటూ కొంతమంది వైసీపీ నాయకులు, ఆయా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మండలంలోని బకులూరు పంచాయతీలో ఒక్కో రైతు నుంచి రూ.1,500 చొప్పున స్థానిక నేత ఒకరు డబ్బులు తీసుకున్నారని పలువురు రైతులు తెలిపారు. ఇదిలావుండగా ఉపాధి హామీ పథకం వీఆర్‌పీ పోస్టులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఇప్పిస్తామంటూ కొందరు నేతలు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని ఒక నేత వద్ద వుంచగా.... ఆయన తన అవసరాలకు కొంత సొమ్ము వాడుకున్నాడు. దీంతో ఈ వ్యవహారం పైస్థాయి నేతల వద్దకు పంచాయితీకి వెళ్లినట్టు తెలిసింది. 

Updated Date - 2020-11-23T06:25:27+05:30 IST