YSRCP లో.. ప్రొటోకాక.. ఎమ్మెల్యే రజనీపై CM Jaganకు ఎంపీ ఫిర్యాదు..

ABN , First Publish Date - 2021-12-08T05:32:16+05:30 IST

అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి చిచ్చు రేగింది. చిలకలూరిపేటలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంతో నేతల మధ్య విభేదాలు బహిర్గమయ్యాయి.

YSRCP లో.. ప్రొటోకాక.. ఎమ్మెల్యే రజనీపై CM Jaganకు ఎంపీ ఫిర్యాదు..

  • చిలకలూరిపేటలో విభేదాలు బహిర్గతం
  • ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మరోసారి రగిలిన చిచ్చు 
  • ఎమ్మెల్యే రజనిపై సీఎంకు కృష్ణదేవరాయుల ఫిర్యాదు
  • ఎంపీకి ఆహ్వానం లేదని తెలిశాక వెళ్లిపోయిన అతిథులు

గుంటూరు, డిశంబరు 7 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి చిచ్చు రేగింది. చిలకలూరిపేటలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంతో నేతల మధ్య విభేదాలు బహిర్గమయ్యాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే విడదల రజని మధ్య ఉన్న విభేధాలు మరోసారి రోడ్డున పడ్డాయి. చిలకలూరిపేట మార్కెట్‌ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం, కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత అటవీశాఖ ఆధ్వర్యంలో కొండవీడులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలు  రూపొందించారు. ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, కాసు మహేష్‌రెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు తదితరులు చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు.


మార్కెట్‌ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటీకి ఎక్కడా ఎంపీ ఫొటో కనిపించలేదు. దీంతో కార్యక్రమానికి హాజరైన మంత్రులు కృష్ణదేవరాయలును ఫోన్‌లో సంప్రదించారు. తను ఢిల్లీలో ఉన్నట్లు కార్యక్రమాల గురించి ఎటువంటి సమాచారం, ఆహ్వానం లేదని చెప్పారు. మీరెలా వచ్చారంటూ వారిని ఎంపీ ఫోన్‌లో నిలదీసినట్లు తెలిసింది. ఎంపీని కూడా ఆహ్వానించామని తమకు చెప్పడం వల్లే కార్యక్రమానికి హాజరయ్యామని, ఇక్కడికి వచ్చాక పరిస్థితి అర్థమై ఫోన్‌ చేసినట్లు వారు చెప్పినట్లు తెలిసింది.


ఎంపీకి ఆహ్వానం లేదని తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీంతో కొండవీడు కార్యక్రమం రద్దు అయ్యింది. అయితే అప్పటికే ఎంపీ ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని, ఇకపై ఉపేక్షించేది లేదని, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమని వైసీపీ పెద్దలకు కృష్ణదేవరాయులు తెలిపినట్టు సమాచారం. లోక్‌సభ సమావేశాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో కార్యక్రమం పెట్టడమే కాకుండా కనీసం ఫోన్‌లో అయినా ఆహ్వానించలేదని ఎంపీ మండిపడుతున్నారు.

Updated Date - 2021-12-08T05:32:16+05:30 IST