‘త్వరలో నాకు మంత్రి పదవి వస్తుంది.. అప్పుడు మీ పనులు చేసి పెడతా..’

ABN , First Publish Date - 2021-07-21T05:37:25+05:30 IST

నామినేటెడ్‌ పదవుల భర్తీ..

‘త్వరలో నాకు మంత్రి పదవి వస్తుంది.. అప్పుడు మీ పనులు చేసి పెడతా..’

నామినేటెడ్‌ పదవులన్నీ మా వాళ్లకే..

కాంట్రాక్టుల్లోనూ అంతా కుటుంబ సభ్యులే

ఆ వైసీపీ ఎమ్మెల్యే తీరుపై విస్తుబోతున్న పార్టీ శ్రేణులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల భర్తీ, కాంట్రాక్టుల్లో జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుతో ఆపార్టీ కార్యకర్తలు తీవ్ర మనస్థాపం చెందుతున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసంపార్టీ అధిష్ఠానం పేర్లు పంపమని కోరిన వెంటనే తన కుటుంబ సభ్యుల పేర్లను పంపించేస్తున్నారు. ఆర్థికవనరులు, స్థిరాస్తులు దండిగా ఉన్న ఒక సంస్థకి కూడా తన సోదరుడిని అధ్యక్షుడిగా నామినేట్‌ చేయించారు. ఆ సంస్థలోనే మరో దూరపుబంధువుకి డైరెక్టర్‌ పదవిని ఇప్పించారు. అలానే మరోసంస్థలో తన అల్లుడిని డైరెక్టర్‌గా నియమింపచేశారు. ఇప్పుడు తన కుమార్తె పేరుని రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లో డైరెక్టర్‌ పదవికి సిఫార్సు చేసినట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈవిధంగా ఆ నియోజకవర్గానికి ఎలాంటి కొత్త పదవిని ఇచ్చినా వెంటనే ఎమ్మెల్యే తన కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరికి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ప్రభుత్వరంగ సంస్థల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అయితే పార్టీ అధిష్ఠానం నేరుగా ఎంపిక చేయకుండా ఎమ్మెల్యేలు/నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను పేర్లు సిఫార్సు చేయాలని కోరింది. దీంతో పలువరు ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ కోసం కష్టపడినవారు, అనుచరుల పేర్లు సిఫార్సులు చేస్తున్నారు. ఆ విధంగా కొంత మందికి పదవులు కూడా ఇప్పించుకొన్నారు. అయితే ఒక ఎమ్మెల్యే రూటు మాత్రం సెపరేటుగా ఉన్నది. కార్యకర్తలను కాదని తన కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు త్వరలో మంత్రి పదవి రానున్నదని, అప్పుడు మీకు పదువులు, పనులు చేసి పెడతానని చెబుతుండటంతో వారు విస్తుబోతున్నారు. కాగా అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లోనూ అంతా తన కుటుంబ సభ్యులకే కేటాయింపు చేయించుకొంటున్నారు. సిల్టుతొలగింపు, డివైడర్లలో మట్టి పోయడం, మొక్కలునాటడం, రోడ్లు, డ్రెయిన్లనిర్మాణం, దుకాణాలు వంటివన్ని తన బంధుగణం గుప్పిట్లోనే ఉండేలా చేసుకొంటున్నారు.


ఎమ్మెల్యే సొంత కుటుంబసభ్యులు కావడంతో అధికారులు కూడా ఇతోధికంగా సహాయ, సహకారాలు అందిస్తున్నారు. సంపూర్ణంగా పనులు చేయకుండానే బిల్లులు పెట్టమంటూ అధికారులపై ఒత్తిళ్లు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఈ విధంగా అటు నామినేటెడ్‌ పదవులు, ఇటు కాంట్రాక్టులు దక్కక పోతుండటంతో ఆనియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. 

Updated Date - 2021-07-21T05:37:25+05:30 IST