మార్చుకోండి.. పేర్చుకోండి..

ABN , First Publish Date - 2021-02-28T06:03:42+05:30 IST

కార్పొరేషన్‌ పరిధిలో ఓటర్ల మార్పిడి అలజడి సృష్టిస్తోంది.

మార్చుకోండి.. పేర్చుకోండి..

పునర్విభజన మాటున ఓట్లాట

ఒక ఇంట్లో ఓట్లు వేర్వేరు డివిజన్లలో! 

విజయవాడలో అధికారపక్ష కుట్ర 

అడ్డగోలుగా ఓటర్ల తారుమారు 

ప్రతిపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యం

టీడీపీ బలమైన డివిజన్లలోనే మార్పిడి 

అభ్యంతరాల్లేకుండా తుది జాబితా 

ప్రతిపక్ష అభ్యర్థుల్లో ఆందోళన

ఎస్‌ఈసీకి ఫిర్యాదు చెయ్యాలని ఆలోచన


అధికార దండం చేతిలో ఉంది. ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలన్న కుతంత్రం మనసులో ఉంది. అందుకు విభజన మంత్రం ఎలానూ ఉంది.. అధికారపక్షానికి ఇక అడ్డేముంటుంది! డివిజన్ల పునర్విభజన ముసుగులో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను కూడా అడ్డగోలుగా విభజించేశారు.    ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకుని, తమ ఓటు భద్రంగానే ఉందని నిన్నటి వరకూ ఊపిరి పీల్చుకున్న వారందరూ ఇప్పుడు జాబితాలను చూసి షాక్‌ తింటున్నారు. తమది కాని ప్రాంతంలో తమ ఓట్లు ఉండడంతో ఏమి చేయాలో తెలియక బిక్కముఖం వేస్తున్నారు. తమ డివిజన్‌ ఓటర్ల జాబితాల్లో వేరే డివిజన్‌ ఓటర్ల పేర్లు ఉండటంతో.. ప్రతిపక్ష  పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలయింది. ఇది అధికారపక్షం పన్నిన కుతంత్రమేనని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 


‘తొమ్మిదో డివిజన్లోని నారా చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన దేవేంద్ర ఓటు 19 డివిజన్లోకిమారింది. అతని కుటుంబంలోని ఓట్లు మొత్తం ఇతర డివిజన్లలోకి వెళ్లాయి. ఎనిమిదో డివిజన్లోని విజయనగర్‌ కాలనీవాసి గోగినేని సుధీర్‌బాబు ఓటును నాల్గవ డివిజన్లోకి మార్చారు. కృష్ణలంక కోత మెషిన్‌ రోడ్డుకు చెందిన రమణబాయి ఓటును ఈ డివిజన్లో చేర్చారు. పటమటలంక తొమ్మిదో డివిజన్‌కు చెందిన వెనిగళ్ల రఘురామ్‌ ఓటును ఎనిమిదో డివిజన్లోకి, ఈ డివిజన్‌కు చెందిన యడ్లపల్లి జ్యోతి ఓటును 19వ డివిజన్లోకి మార్చారు. తన డివిజన్లో ఇలా వెయ్యికిపైగా ఓట్లు తారుమారయ్యాయని ఎనిమిదో డివిజన్‌ టీడీపీ అభ్యర్థి చెన్నుపాటి ఉషారాణి ఆరోపిస్తున్నారు. నగరమంతటా ఇదే సమస్య ఉండడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.’



(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

కార్పొరేషన్‌ పరిధిలో ఓటర్ల మార్పిడి అలజడి సృష్టిస్తోంది. ఒక డివిజన్లోని ఓట్లను గంపగుత్తగా మరో డివిజన్‌కు బదిలీ చేయటం... మరో డివిజన్లోని ఓట్లను ఇంకో డివిజన్లోకి మార్చటం.. కుటుంబంలోని కొందరు ఓట్లు స్థానికంగా ఉంటే.. మరికొందరి ఓట్లు మరో డివిజన్‌కు బదిలీ చేయటం... ఏకంగా ఒక ఏరియాలోని ఓటర్లనే మార్చేయటం... కార్పొరేషన్‌ ఎన్నికల వేళ వెలుగు చూస్తున్న చిత్రాలివి. ఈ గందరగోళం గుర్తించేసరికి ఎన్నికలు సమీపించేశాయి. రిటర్నింగ్‌ అధికారులకు అభ్యర్థులు మొరపెట్టుకుంటే ‘తుది జాబితాలు వచ్చేశాయి.. చేసేదేమీ లేదు’ అని చెబుతున్నారు. దీంతో విపక్ష పార్టీల అభ్యర్థుల్లో విపరీతమైన టెన్షన్‌ మొదలయింది. ప్రత్యేకించి టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే ఓట్ల మార్పిడి ఎక్కువగా జరగటంతో.. ఇది అధికారపక్షం కుట్రేనన్న విమర్శలు వస్తున్నాయి. 


ఓటర్లొకచోట.. ఓట్లు వేరేచోట

ప్రస్తుత తొమ్మిదో డివిజన్లోని నారా చంద్రబాబునాయుడి కాలనీ నుంచి హైవే అవతల ఉన్న పెట్రోల్‌ బంక్‌ ఏరియా వరకు విభజించారు. దీంతో ఆ డివిజన్లో సామాజిక సమీకరణాలు మారిపోయాయి. ఇలా పునర్విభజనకే పరిమితం కాలేదు. ఓటర్లను కూడా తారుమారు చేశారు. చంద్రబాబునాయుడు కాలనీలోని తార, సితార టవర్స్‌లోని ఓటర్లను 9, 8 డివిజన్లకు చెరి సగం సర్దారు. ప్రాంతం మారినపుడు ఆ ప్రాంత పరిధిలోని డివిజన్‌కే సర్దాలి. అందుకు భిన్నంగా చెరి సగం సర్దటంలోని ఆంతర్య మేమిటో అర్థం చేసుకోవాల్సిందే. కొన్ని ఓట్లను గంపగుత్తగా వేరే డివిజన్‌లోకి బదిలీ చేశారు. 


ఎక్కడో పోలీసు క్వార్టర్స్‌, రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఇద్దరి ఓట్లను ఎనిమిదో డివిజన్లో చేర్చారు. పదో డివిజన్లోని చల్లగుళ్ల శ్రీనివాసరావు ఓటును ఎనిమిదో డివిజన్లోకి, ఎనిమిదో డివిజన్లోని బోయపాటి వారి వీధిలోని కొందరి ఓట్లను ఏడో డివిజన్లోకి మార్చారు. శ్రీనివాస్‌ అపార్ట్స్‌మెంట్స్‌లోని 19 ఓట్లలో సగం మాత్రమే ఎనిమిదో డివిజన్లో ఉన్నాయి. ఇలా తమ డివిజన్లో వెయ్యి ఓట్ల వరకు  తారుమారయ్యాయని ఎనిమిదో డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిని చెన్నుపాటి ఉషారాణి ఆరోపిస్తున్నారు. 11వ డివిజన్‌లోని ఫిల్మ్‌ కాలనీ, ప్రగతి నగర్‌లలోని ఓట్లను ఇతర డివిజన్లలోకి మార్చారని ఆ డివిజన్‌ టీడీపీ అభ్యర్థి జాస్తి సాంబశివరావు ఆరోపిస్తున్నారు. తొమ్మిదో డివిజన్లోని ఓసీ ఓట్లను తారు మారు చేశారని మాజీ టీడీపీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ విమర్శిస్తున్నారు. 


సెంట్రల్లోనూ ఇదే తీరు 

నగరంలోని సెంట్రల్‌ నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో ఓటర్లను విభజించడం అనుమానాలకు తావిస్తోంది. సెంట్రల్‌ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం శారదా కాలేజి వెనుక ప్రాంతంలోని ఓట్లను ఒక పద్ధతి లేకుండా అనేక డివిజన్లకు మార్చారు. ఒక కుటుంబంలో భర్త ఓటు ఒకచోట, భార్య ఓటు మరోచోట, పిల్లల ఓట్లు ఇంకో చోట ఉన్నాయి. దీంతో స్థానిక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పాయకాపురంలో 63 డివిజన్‌కు చెందిన 1050 మంది ఓటర్లను 62వ డివిజన్‌కు బదిలీ చేశారు. పునర్విభజనకు ముందు 62వ డివిజన్‌ 57వ డివిజన్‌గా ఉండేది. పాత 58వ డివిజన్‌ 63వ డివిజన్‌గా మారింది. 62వ డివిజన్లోనే జీప్లస్‌ త్రీ నివాసాల్లోని ఓటర్లను, పటేల్‌ నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌లకు చెందిన ఓటర్లను 63, 64 డివిజన్లకు మార్చారు. 62వ డివిజన్‌ ఓటర్ల జాబితాలోని సీరియల్‌ నెంబర్‌ 308 నుంచి 852 వరకు.. మొత్తం 544 మంది ఓటర్లను 63వ డివిజన్‌కు బదిలీ చేశారు.  తమ డివిజన్లలోకి కొత్త ఓటర్ల పేర్లు వచ్చాయని, ఇక్కడి ఓటర్ల పేర్లు వేరే డివిజన్లలోకి మారిపోయాయని స్థానికులు అంటున్నారు. 


చేతులెత్తేసిన ఎన్నికల అధికారులు  

రెండు రోజులుగా ప్రతిపక్ష కార్పొరేటర్‌ అభ్యర్థులు ఈ సమస్యను స్థానిక రిటర్నింగ్‌ అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నారు. అయితే రిటర్నింగ్‌ అధికారులు మాత్రం తామేమీ చేయలేమని చెబుతున్నారు. తుది ఓటర్ల జాబితాలు రాకముందే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుందని, ఒకసారి వచ్చిన తర్వాత చేయగలిగిందేమీ లేదని చెబుతున్నారు. దీంతో విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్‌ అభ్యర్థులు ఈ సమస్యపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. 


పోలింగ్‌పై ప్రభావం చూపే ప్రమాదం

నగరంలో అడ్డగోలుగా ఓటర్లను మార్చటం పోలింగ్‌ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక కుటుంబంలోని ఓట్లనే వేర్వేరు డివిజన్లకు బదిలీ చేయటం వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. ఈ ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటే.. ప్రయోజనం మాత్రం అధికారపక్షానికే దక్కుతుంది. 

Updated Date - 2021-02-28T06:03:42+05:30 IST