వైసీపీలో కుమ్ములాటలు!

ABN , First Publish Date - 2020-11-30T06:40:58+05:30 IST

నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ..

వైసీపీలో కుమ్ములాటలు!
సీఐకు ఫిర్యాదు చెస్తున్న పోటు సత్యనారాయణ

రోజుకొక నియోజకవర్గంలో వెలుగుచూస్తున్న విభేదాలు

ఇటీవల నడిరోడ్డుపై ‘పశ్చిమ’ నేతల ఘర్షణ

‘తూర్పు’, ‘పెందుర్తి’ల్లో ఆధిపత్య పోరు 

తాజాగా ‘ఉత్తరం’లో.... 

పోలీస్‌స్టేషన్‌లోనే ఘర్షణపడిన నాయకులు

పరస్పరం ఫిర్యాదులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నగరంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొద్దిరోజుల కిందట తూర్పు నియోజకవర్గంలో, ఇటీవల పశ్చిమ నియోజకవర్గంలో బహిర్గతమవ్వగా, తాజాగా ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఇద్దరు నేతలు పోలీస్‌స్టేషన్‌లోనే కొట్టుకున్నారు. రోజుకొక నియోజకవర్గం పరిధిలో ఇటువంటి సంఘటనలు జరుగుతుండడం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.  


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గస్థాయిలో నేతల మధ్య విభేదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆది నుంచీ పార్టీలో ఉన్న నేతలకు, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి పొసగడం లేదు. ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఎవరికివారు ప్రయత్నిస్తున్నారు. ఆయా నేతలు, వారి అనుచరులు తరచూ గొడవ పడుతూ, ఘర్షణలకు దిగుతున్నారు. తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడి వైసీపీ కేడర్‌లో ఎక్కువ మంది నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మద్దతు దారులు. దీంతో నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తనకు చెప్పకుండా అతన్ని (వంశీకృష్ణ) ఆహ్వానించవద్దని అక్కరమాని  విజయనిర్మల.... పార్టీ వార్డు అధ్యక్షులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో వైసీపీ క్యాడర్‌ రెండుగా విడిపోయి ఎత్తుకుపైఎత్తులు వేసుకుంటున్నారని తటస్థంగా వుండే కొంతమంది కార్యకర్తలు బహిరంగంగా పేర్కొంటున్నారు. 


పెందుర్తి నియోజకవర్గం పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కి, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడుకి మధ్య పొసగడం లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అదీప్‌రాజు అతన్ని పూర్తిగా పక్కనపెట్టి కార్యక్రమాలు చేస్తున్నారనే భావనతో శరగడం వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, 60వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి పీవీ సురేశ్‌ నడిరోడ్డుపైనే పలుమార్లు ఘర్షణకు దిగడమే కాకుండా ఫ్లెక్సీలను చింపేసుకున్నారు. తాజాగా ఉత్తర నియోజకవర్గంలో వార్డుస్థాయి నేతల మధ్య గొవడలు మొదలయ్యాయి. 


పాత 12వ వార్డు మాజీ కార్పొరేటర్‌ భర్త పోతు సత్యనారాయణ, తాజా కార్పొరేటర్‌ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలు ఇటీవల తారస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఘర్షణ పడ్డారు. తనపై వెంకటలక్ష్మి చేయిచేసుకుందని సత్యనారాయణ ఆరోపిస్తుండగా, తనను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించాడంటూ వెంకటలక్ష్మి చెబతున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం నియోజకవర్గంలో కలకలం రేపింది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ నేతలు యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చేతులెత్తేశారు.


Updated Date - 2020-11-30T06:40:58+05:30 IST