వ్యూహం మార్చిన వైసీపీ.. పల్నాడు రాజకీయంలో కొత్త సంస్కృతి..!

ABN , First Publish Date - 2020-10-21T15:18:26+05:30 IST

పల్నాడు రాజకీయం రంగు మారుతోందా..? ఒకప్పుడు హత్యలు, దాడులు, దౌర్జన్యాలు కొనసాగించిన ప్రాంతంలో ఇప్పుడు కొత్త సంస్కృతి పురుడు పోసుకుంటుందా? ముఖ్యంగా శత్రు వర్గం ఆయువు పట్టుపై దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందా..? గతానికి భిన్నంగా నేతలు కొత్త పద్ధతి ఫాలో

వ్యూహం మార్చిన వైసీపీ.. పల్నాడు రాజకీయంలో కొత్త సంస్కృతి..!

పల్నాడు రాజకీయం రంగు మారుతోందా..? ఒకప్పుడు హత్యలు, దాడులు, దౌర్జన్యాలు కొనసాగించిన ప్రాంతంలో ఇప్పుడు కొత్త సంస్కృతి పురుడు పోసుకుంటుందా? ముఖ్యంగా శత్రు వర్గం ఆయువు పట్టుపై దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందా..? గతానికి భిన్నంగా నేతలు కొత్త పద్ధతి ఫాలో అవుతున్నారా..? ఇటీవల జరుగతున్న సంఘటనలు చూస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తుంది. గుంటూరు జిల్లా పల్నాడులో మారిన రాజకీయాలపై ప్రత్యేక కధనం...


ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక...

పల్నాటి యుద్ధం పేరు చెబితే పిట్టలు కూడా నీళ్లు త్రాగవు అనేది నానుడి. పల్నాడుకు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంత రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పల్నాడు వేదికగా నడిచిన రాజకీయం రక్తపాతాలతో సాగింది. బాంబులు, వేట కొడవళ్లతో ప్రత్యర్థులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించిన ప్రాంతం పల్నాడు. ఈ ప్రాంతానికి రాజకీయానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి నాయకులు హింసే మార్గంగా వ్యవహరించేవారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గాన్ని ఎదిరించాలన్నా, వారిని తమ దారిలోకి తీసుకురావాలన్నా మెుదట్లో బాంబులకు పని చెప్పేవారు. అంతేకాదు వైరి వర్గానికి స్పాట్‌ ఫిక్స్‌ చేసి సఫా చేసేందుకు వెనకాడేవారు కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురిచేసేవారు.


తెరమీదకు కొత్త సంస్కృతి...

అయితే ఇటీవల కాలంలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పల్నాడు రాజకీయం కూడా మారుతోంది. రాయలసీమ రాజకీయానికి దగ్గరగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న ఘటనలే ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. మెున్నటికి మెున్న వైసీపీ బాధితుల పేరుతో టీడీపీ నేతలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ తరువాత గుంటూరు నగరంలోనే వైసీపీ బాధిత శిబిరాన్ని నిర్వహించారు. దాంతో పల్నాడు రాజకీయం రంగులు మార్చుకుంది. ఇప్పడు మరో కొత్త సంసృతి కూడా తెర మీదకు వస్తుంది.. ప్రత్యర్థిని దారికి తెచ్చుకునేందుకు హత్య చేయటం కన్నా, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం చేస్తున్నారట. అయితే ఆత్మహత్య అయినా చేసుకోవాలి..లేదంటే ఇష్టం లేకపోయినా ప్రత్యర్థితో చేతులు కలపాలి అనేలా ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. ప్రధానంగా వైరి వర్గం ఆర్థిక మూలలపై  దెబ్బతీసే విధంగా చర్యలు ఉంటున్నాయి. 


రాత్రికి రాత్రే పూర్తిగా...

ఇటీవల గురజాల నియోజవర్గంలో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. టీడీపీకి చెందిన ఓ నేతని అధికార వైసీపీలోకి ఆహ్వనించారు. అయితే ఆయన ఆచితూచి వ్యవహరించటంతో అధికార పక్షంలోని నేతలు కాస్త దూకుడుగా వెళ్లారు. మాచవరం గ్రామంలో సదరు నేతకు చెందిన బొప్పాయి తోటను రాత్రికి రాత్రి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది బహిరంగా రహస్యం. అయినప్పటికీ బాధితుడు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు తన బొప్పాయి తోటను నరికేశారని చెప్పడం గమనార్హం. తనంతట తానే నిజాన్ని దాచి అబద్ధం చెప్పేలా ప్రేరేపించారంటే..పల్నాడు రాజకీయంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అర్థమవుతోంది. ఇక పోలీసులు కూడా గుర్తుతెలియని వ్యక్తుల దాడిగా భావించి కేసు నమోదు చేసుకున్నారు..ఇలా పల్నాడు రాజకీయంలో అనేక అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో రాయలసీమలోనే ఈ సంస్కృతి ఉండేది. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసేవారు. తాజాగా పల్నాడు ప్రాంతంలోనూ ఈ తరహా సంస్కృతి కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందే ఇలాంటి విష రాజకీయాలని కట్టడి చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - 2020-10-21T15:18:26+05:30 IST