బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ బేషరతు మద్దతు

ABN , First Publish Date - 2022-06-24T08:25:51+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డి బీజేపీకే జైకొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమలు కావలసిన విభజన హామీలేవీ ప్రస్తావించకుండా..

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ బేషరతు మద్దతు

నామినేషన్‌కు జగన్‌ వెళ్లాలనుకున్నా

కేబినెట్‌ భేటీ కారణంగా విరమణ

ఆయన స్థానంలో ఢిల్లీ వెళ్లనున్న విజయసాయి, మిథున్‌రెడ్డి

బీజేపీ సీఎంలతో పాటు హాజరు

హోదా, హామీల ఊసు లేకుండానే బీజేపీకి జగన్‌ సంపూర్ణ సహకారం

రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు


అమరావతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం జగన్మోహన్‌రెడ్డి బీజేపీకే జైకొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమలు కావలసిన విభజన హామీలేవీ ప్రస్తావించకుండా.. కనీసం ప్రధాని మోదీకి వీటిపై చిన్న లేఖయినా రాయకుండానే.. బేషరతుగా ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలికారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న పార్టీగా వైసీపీ ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఆమె నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ఢిల్లీ రావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలందరినీ బీజేపీ నాయకత్వం ఆదేశించింది. ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరయ్యే అవకాశముంది. వీరితోపాటు తాను కూడా వెళ్లాలని జగన్‌ భావించారు.


అయితే శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఉండడంతో ఆ ఆలోచన విరమించుకున్నారని సీఎం కార్యాలయం వెల్లడించచింది. ఆయన స్థానంలో వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి.. ద్రౌపది నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది. కాగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి విజయానికి వైసీపీ మద్దతు అవసరమైన దృష్ట్యా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి గళమెత్తుతారని రాష్ట్ర ప్రజలు ఆశించారు. వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంపై పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తానని 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజలు వైసీపీకి 22 లోక్‌సభ స్థానాలను కట్టబెట్టారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలశాక.. ఒక్కసారిగా నాలుక మడతేశారు. బీజేపీకి భారీ మెజారిటీ ఉన్నందున.. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తులు చేస్తూ పోవడమేనని.. గత్యంతరం లేదని తేల్చిచెప్పేశారు.


రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు సమయంలో ఆయా అంశాలపై డిమాండ్‌ చేయడం మాటెలా ఉన్నా.. కనీసం వినతి పత్రమైనా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్‌డీఏ, ఎన్‌డీయేతర పక్షాల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనూ జగన్‌ పెదవి విప్పలేదు. చివరకు ఎన్‌డీఏ అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనూ వైసీపీ తరఫున అధికారిక ప్రకటన చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి రావలసిన హక్కులను కేంద్రం వద్ద ప్రస్తావించి.. కొన్నింటినైనా సాధించుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోయేలా జగన్‌ వ్యవహరించారని రాజకీయ పక్షాలు అంటున్నాయి. ఎన్‌డీఏ అభ్యర్థికి బేషరతుగా మద్దతు తెలుపడం వెనుక సీబీఐ, ఈడీ కేసుల భయం దాగుందని ఆరోపిస్తున్నాయి.


జూలై మొదటివారంలో రాష్ట్రానికి ద్రౌపది ముర్ము

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూలై మొదటి వారంలో రాష్ట్రానికి వస్తున్నారు. సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబులను కలిసి.. దేశ ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యేందుకు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు వేయించాలని కోరనున్నారు. మొదట జూలై 4న ఆమె వస్తారని వార్తలొచ్చినా అదే రోజు ప్రధాని మోదీ భీమవరం వస్తున్నందున.. ఆమె తర్వాతి రోజు రావచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా తేదీ ఖరారు కాలేదని, జూలై మొదటి వారంలో మాత్రం వస్తారని పేర్కొన్నాయి.


అవును.. మా మద్దతు ముర్ముకే: విజయసాయి

మహారాణిపేట (విశాఖపట్నం), జూన్‌ 23: అణగారిన వర్గాలకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిందని, ఆమెకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని వైసీపీపీ నేతత విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖ కచ్చితంగా పరిపాలనా రాజధాని అవుతుందని, టీడీపీ అధినేత చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా, దానిని ఆపలేరని చెప్పారు. కొన్ని అడ్డంకుల వల్ల రాజధాని తరలింపులో కొంత జాప్యం జరుగుతోందన్నారు. గురువారమిక్కడ కోస్టల్‌ బ్యాటరీ సమీపంలో ఎంపీ ల్యాడ్స్‌తో నిర్మించనున్న పోలమాంబ, కొత్తమాంబ, భూలోకమాంబ అమ్మవార్ల ఆలయ నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నదిని, కాలువను ఆక్రమించి ఇల్లు నిర్మించారని స్పష్టమైందని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికమేనని ఈ సందర్భంగా విలేకరులతో అన్నారు. రుషికొండలో తవ్వకాలపై ఎన్‌జీటీ స్టే ఇచ్చిందని ప్రస్తావించగా కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. 

Updated Date - 2022-06-24T08:25:51+05:30 IST