దొంగచాటుగా కాటు!

ABN , First Publish Date - 2020-08-08T09:09:44+05:30 IST

ఒక్కసారి టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లోకి వెళ్లండి! ఎవరో ఒక ‘తటస్థ’ మేధావి తెరపైకి వస్తారు. అందులోనూ రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లే అధికం!

దొంగచాటుగా కాటు!

  • విపక్షంలో ఉన్నప్పటి నుంచీ వైసీపీ వ్యూహం
  • జస్టిస్‌ ఈశ్వరయ్య ఉదంతంతో తాజా చర్చ
  • నాడు వ్యూహాత్మకంగా తెరపైకి ‘తటస్థులు’
  • టీడీపీపై విమర్శలు, ఆరోపణలతో దాడి
  • వాటికి వైసీపీ సోషల్‌ మీడియా ప్రాధాన్యం
  • అధికారంలోకి రాగానే వారికి పదవులు
  • జాబితాలో అజేయ కల్లం, రమణ దీక్షితులు
  • జస్టిస్‌ ఈశ్వరయ్యతో న్యాయవ్యవస్థపై గురి!?
  • అప్పుడు వాడుకుని... ఆనక వదిలించుకుని!

సవాళ్లకు ప్రతి సవాళ్లు! ఆరోపణలకు ప్రత్యారోపణలు! విమర్శలకు ప్రతి విమర్శలు! చేసిన మంచిని చెప్పుకోవడం! అవతలి వారి తప్పులను ఎత్తి చూపడం! ఇది సూటిగా సాగే రాజకీయం! కానీ... వైసీపీ తన ఆవిర్భావం నుంచే ‘సరికొత్త రాజకీయ వ్యూహానికి’ తెరలేపిందని విశ్లేషకులు చెబుతారు! అది... అవతలి పార్టీకి తెలియకుండానే, చాటు మాటుగా దొంగ దెబ్బ తీయడం! కీలకమైన వ్యవస్థలపైనా బురదజల్లడం! విపక్షంలో ఉన్నప్పుడు మొదలైన ఈ అనూహ్య వ్యూహం... అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుండటమే విశేషం! మరో విచిత్రమేమిటంటే... అలా స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న అనేకమందిని వైసీపీ అంతే తెలివిగా వదిలించుకుంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒక్కసారి టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లోకి వెళ్లండి! ఎవరో ఒక ‘తటస్థ’ మేధావి తెరపైకి వస్తారు. అందులోనూ రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లే అధికం! వారు తమకు సంబంధం లేని అంశాన్ని తెరపైకి తెస్తారు. ‘ఇది ఘోరం, అన్యాయం, అక్రమం’ అంటూ ఊరూరూ తిరుగుతారు! రకరకాల సంఘాలతో సమావేశమవుతూ ప్రసంగాలు చేస్తారు. ఆ తర్వాత... అవే ప్రసంగాలు వైసీపీ అనుకూల, అనుబంధ మీడియాలో, సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యేవి. దానిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. వైసీపీ అధికారంలోకి రాగానే వీరిలో చాలామందికి పదవులు వచ్చాయి. దీంతో... తెలుగుదేశం ప్రభుత్వంపై దాడికి వైసీపీ వ్యూహాత్మకంగానే వీరిని ఉపయోగించుకుందని, వీరి భుజాలపై తుపాకీ పెట్టి తాను కాల్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య ఉదంతంతో ఈ అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు విషయమేమిటంటే... అప్పట్లో తమ రాజకీయ లక్ష్యం కోసం ఉపయోగించుకుని, ‘విజయం’ సాధించిన వైసీపీ, ఆ తర్వాత వారిలో అనేక మందిని పక్కన పెట్టేసింది. ఇలా వైసీపీ ఉపయోగించుకున్న ఆయా ముఖ్యులు, ప్రస్తుతం వారి పరిస్థితి ఇది...


జస్టిస్‌ ఈశ్వరయ్య.. నాడు నేడు

జస్టిస్‌ ఈశ్వరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా పని చేశారు. అప్పట్లో... జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్‌ ఈశ్వయ్యను తప్పించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఇది పెను దుమారం చెలరేగింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. జస్టిస్‌ ఈశ్వరయ్య రిటైర్‌ అయ్యాక... ‘ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌’ అంటూ ఒక సంఘం పెట్టారు. దానిని... తెలుగుదేశం పార్టీపైకి గురి పెట్టారు. టీడీపీ బీసీల పార్టీ అని పేరుంది. ‘బీసీలే మాకు వెన్నెముక’ అనేదే తెలుగుదేశం నినాదం. కానీ... ‘బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారు, ఆయన బీసీ వ్యతిరేకి’ అంటూ జస్టిస్‌ ఈశ్వరయ్య ఒక ఉద్యమం మొదలుపెట్టారు. అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. జస్టిస్‌ ఈశ్వరయ్య ప్రసంగ వీడియోలను వైసీపీ బాగా ఉపయోగించుకుంది.


ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం చేసింది. జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యాఖ్యలకు జగన్‌ మీడియా కూడా ప్రముఖంగా చోటిచ్చేది. అక్కడ సీన్‌ కట్‌ చేస్తే... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్‌ ఈశ్వరయ్యకు కీలక పదవి కట్టబెట్టింది. ఆయనను గత ఏడాది సెప్టెంబరులో ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది. దీంతో, అప్పుడు ‘తటస్థ’ మేధావిగా ఆయన పలికిన పలుకులన్నీ వైసీపీ కోసమే అని స్పష్టమైందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘న్యాయ వ్యవస్థపై బురదజల్లడం’ అనే లక్ష్యం కోసం జస్టిస్‌ ఈశ్వరయ్యను  ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. సస్పెన్షన్‌లో ఉన్న దళిత జడ్జి రామకృష్ణకు ఫోన్‌ చేసి... జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డితోపాటు మరికొందరిని దుర్భాషలాడటం, ఢిల్లీ జడ్జిల సమాచారం ఇవ్వాలని కోరడం, కరోనా మార్గదర్శకాలను పాటించడంలేదంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లేఖలు రాయించింది తానేనని చెప్పుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు.


రెచ్చగొట్టి... పక్కనపెట్టి!

మీకు పింక్‌ డైమండ్‌ గుర్తుందా? వెంకన్న ఖజానా నుంచి ఈ పింక్‌ డైమండ్‌తోపాటు విలువైన నగలు మాయమయ్యాయంటూ టీటీడీ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో దీనిపై భారీ వివాదమే చెలరేగింది. అసలు అలాంటి వజ్రమేదీ లేదని చెప్పినా, నగలన్నీ భద్రమని అధికారులే పేర్కొన్నప్పటికీ ఈ ఆరోపణ పదేపదే చేస్తూ వచ్చారు. వైసీపీ నేతలు, అనుకూల సోషల్‌ మీడియా, జగన్‌ మీడియా దీనికి బాగా ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల్లో ఈ వివాదాన్ని వైసీపీ బాగా ఉపయోగించుకుంది. అధికారంలోకి వచ్చాక... రమణ దీక్షితులును ఆగమ సలహా మండలిలో సభ్యుడిగా నియమించింది. కానీ... ఇప్పుడు ఆయన ఇచ్చే సలహాలకే విలువ లేకుండా పోతోంది. 


నాడు పోరాటం... నేడు అస్త్ర సన్యాసం

ముద్రగడ పద్మనాభం పేరు చెప్పగానే... కాపు ఉద్యమం గుర్తుకొస్తుంది. ఆయన నిత్య పోరాటంతో చంద్రబాబు సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. ఉద్యమ క్రమంలో తునిలో రైలు దహనం కూడా జరిగింది. ఈ మొత్తం ఉద్యమాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. రాజకీయ వేడిని పెంచింది. నిజానికి,  కాపుల డిమాండ్లలో అనేకం చంద్రబాబు సర్కారు పరిష్కరించింది. వారికి ఆర్థిక వెనుకబడిన వర్గాల కోటాలో ఐదు శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది. కాపు కార్పొరేషన్‌ ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక... ఇవన్నీ అటకెక్కాయి. ముద్రగడ పద్మనాభం తమ డిమాండ్లపై జగన్‌కు మూడు నాలుగు లేఖలు రాశారు. ఏం జరిగిందో ఏమో కానీ... తనను సోషల్‌ మీడియాలో దూషిస్తున్నారంటూ ఉద్యమానికి స్వస్తి పలికారు. దీంతో... కీలక డిమాండ్లు పరిష్కారం కాకుండానే అస్త్రసన్యాసం చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ జరిగింది.


ఐవైఆర్‌దీ అదే దారి...

ఐవైఆర్‌ కృష్ణారావు చంద్రబాబు ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఆ పదవిలో ఉంటూనే  చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఎన్నాళ్లు గడిచినా ఆయన తీరు మారకపోవడంతో... పదవి నుంచి తొలగించేందుకు సర్కారు సిద్ధమైంది. దీంతో ఆయనే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత... అమరావతి భూసమీకరణకు వ్యతిరేకంగా జరిగిన చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఐవైఆర్‌ వ్యాఖ్యలు, విమర్శలను వైసీపీ బాగా వాడుకుంది. 



 పాపం... ఎల్వీ సుబ్రమణ్యం

ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.  సుదీర్ఘకాలం కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఆయన పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు. అప్పట్లో ‘సీఎం వర్సెస్‌ సీఎస్‌’ అన్నట్లుగా నడిచింది. ఈ పరిణామాలన్నింటినీ వైసీపీ చక్కగా ఉపయోగించుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్వీనే సీఎ్‌సగా కొనసాగించింది. ఐఏఎ్‌సలతో జరిగిన ఒక సమావేశంలో ‘సుబ్రమణ్యమన్న’  అంటూ జగన్‌ అప్యాయంగా పిలిచారు. ‘నన్ను ముందుండి నడిపిస్తారు’ అని అపార గౌరవం ప్రకటించారు. ఇది జరిగిన సరిగ్గా రెండు నెలలకే ఎల్వీ సుబ్రమణ్యాన్ని అత్యంత అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించారు. ఏమాత్రం ప్రాధాన్యం లేని... బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేశారు.  వైఎస్‌  రాజశేఖరరెడ్డికి ఎల్వీ సుబ్రమణ్యం బాగా సన్నిహితుడు. కానీ... జగన్‌ మాత్రం ఆరు నెలల్లోనే ఎల్వీని సీఎస్‌ పదవి నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారు.



అజేయ కల్లంతో ఇలా..

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు... అజేయ కల్లం! మరో నెలలో రిటైర్‌ అవుతారని తెలిసినప్పటికీ... ‘కాదు’ అనలేక చంద్రబాబు ఆయనను సీఎస్‌గా నియమించినట్లు చెబుతారు. పదవీకాలం పొడిగింపునకు కేంద్రం అంగీకరించకపోవచ్చునని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని కూడా చెప్పారని ప్రచారంలో ఉంది. మొత్తానికి... అజేయ కల్లం బ్యూరోక్రసీలో  అత్యున్నత స్థాయి పదవిని అలంకరించగలిగారు. కానీ, రిటైర్‌ అయిన తర్వాత చంద్రబాబుపై వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు.  భోగాపురం ఎయిర్‌పోర్టు, రాజధాని అమరావతి భూ సమీకరణపై పలు సభలు, సమావేశాల్లో పాల్గొని తీవ్ర విమర్శలు చేశారు. సదరు ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను వైసీపీ ఎంచక్కా ఉపయోగించుకుంది.  జగన్‌ అధికారంలోకి రాగానే... ‘అసలు బంధం’ బయటపడింది. అజేయ కల్లం సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. కీలకమైన రెవెన్యూ, శాంతి భద్రతలు వంటి అంశాలను ఆయనకు అప్పగించారు. తొలుత అన్నీ అజేయ కల్లం అనే పరిస్థితి నుంచి... ఇప్పుడు ‘ఏమీలేని అజేయ కల్లం’ అనే పరిస్థితి వచ్చింది. ఆయన వద్ద ఉన్న సబ్జెక్టులన్నింటినీ తీసేశారు.

Updated Date - 2020-08-08T09:09:44+05:30 IST