YCP: వారసత్వ రాజకీయాలే లక్ష్యం

ABN , First Publish Date - 2021-08-01T16:24:59+05:30 IST

రాజకీయ వారసత్వం కోసం..

YCP: వారసత్వ రాజకీయాలే లక్ష్యం

వైసీపీ యువనేతల భేటీ 

ఆహ్వానించిన మాగుంట వారసుడు 

ప్రణీత్‌, విశాల్‌, కృష్ణచైతన్య, వెంకటేష్‌ హాజరు

సుధీర్‌, చైతన్య ఫోన్‌లో మద్దతు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): జిల్లాలో రాజకీయ వారసత్వం కోసం ఆరాటపడుతున్న అధికార వైసీపీలోని యువనేతలు శనివారం  ఒంగోలులో భేటీ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న మాగుంట రాఘవరెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలో అధికార వైసీపీలో వారసత్వ రాజకీయ ఆరంగ్రేటం కోసం పలువురు నేతల కుమారులు, కుటుంబ సభ్యులు పోటీపడుతున్నారు. అందులో ప్రణీత్‌రెడ్డి, రాఘవరెడ్డితోపాటు ఇతర పలువురు స్పీడు పెంచారు. 2014 ఎన్నికల్లోనే అద్దంకి నుంచి పోటీచేసి ఓడిపోయిన కరణం వెంకటేష్‌ తండ్రి బలరాం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నీతానై పని చేస్తున్నారు. ఇక గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య అద్దంకి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అయింది. శిద్దా సుధీర్‌ తండ్రి బాటలో నడుస్తూనే వైసీపీలో కీలకపాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుమారుడు చైతన్య రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటమేగాక నియోజకవర్గ విషయాల్లో కూడా ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నారు. మంత్రి సురేష్‌ కుమారుడు విశాల్‌ మాత్రం ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సివిల్స్‌కి తయారవుతూ ఇంతవరకు రాజకీయాల వైపు రాలేదు. కానీ తాజా భేటీకి అతను కూడా హాజరయ్యారు.


మాగుంట ప్రకటన అనంతరం జరిగిన భేటీ

ఇటీవల ఎంపీ మాగుంట వైపాలెం నియోజకవర్గంలో గోడ్రాలికొండ తిరుమలనాథస్వామి పాలకమండలి సమావేశంలో తన వారసుడు రాఘవరెడ్డే అని ప్రకటించారు. ఒంగోలు ఎంపీగా తన కుమారుడు పోటీచేస్తాడని, ఆయన్ను అన్నివిధాలా ప్రోత్సహించాలని కోరారు. అంతకుముందే రాఘవరెడ్డి నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పర్యటిస్తూ కార్యక్రమాలు నిర్వహించటం వివాదాస్పదమైంది. అధిష్టానం జోక్యం చేసుకుని పలు సూచనలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. వారికి సన్నిహితులైన కొందరు ముఖ్యులు, ప్రస్తుతం రాఘవరెడ్డి వెంట నడుస్తున్న కొందరు నాయకులు కూడా అక్కడకు చేరారు. అయితే రాఘవరెడ్డి ఓ గదిలో ప్రణీత్‌, విశాల్‌, చైతన్య, వెంకటేష్‌లతో మాత్రమే సమావేశమయ్యారు.


తొలుత రాఘవరెడ్డి ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే ముందుకెళ్లానని, ఎవరినీ దూరంగా ఉంచాలని తనకు లేదన్నారు. అందరం కలిసికట్టుగా పయని ద్దామని కోరినట్లు తెలిసింది. వెంటనే కృష్ణచైతన్య, వెంకటేష్‌లు మాగుంట కుటుంబమంటే అందరికీ గౌరవం ఉందని, మంత్రి బాలినేని సారథ్యంలో ముందుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం. చాలాసేపు మౌనంగా ఉన్న ప్రణీత్‌ పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని సూచించినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌లో ఉన్నందున రాలేకపోయానని సుధీర్‌ చెప్పటమే గాక మీ అందరితోపాటు కలిసి నడుస్తానన్నట్లు తెలిసింది. తన తండ్రి రాంబాబు పుట్టినరోజు ఉన్నందున రాలేకపోయానని అన్నా చైతన్య సమాచారమిచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే తండ్రి ద్వారా భవిష్యత్తులో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీచేయబోతున్నట్లు ప్రకటింపజేసుకున్న రాఘవరెడ్డి అందరినీ సహకరించమని కోరినట్లు తెలిసింది. 

Updated Date - 2021-08-01T16:24:59+05:30 IST