ఏడాదిలో ఒక్క ఇల్లయినా కట్టారా?: కాల్వ

ABN , First Publish Date - 2020-06-06T10:09:30+05:30 IST

‘‘ఏడాది కాలంలో పేదలకు రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా కాలక్షేపం చేసి వైసీపీ మంత్రులు ఇప్పుడు పిట్ట కథలు చెబుతున్నారు. ఇళ్ళ స్ధలాలకు భూ సేకరణ అనేక

ఏడాదిలో ఒక్క ఇల్లయినా కట్టారా?: కాల్వ

అమరావతి, రాజమహేంద్రవరం, విజయవాడ, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఏడాది కాలంలో పేదలకు రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా కాలక్షేపం చేసి వైసీపీ మంత్రులు ఇప్పుడు పిట్ట కథలు చెబుతున్నారు. ఇళ్ళ స్ధలాలకు భూ సేకరణ అనేక నియోజకవర్గాల్లో పెద్ద కుంభకోణంగా మారిపోయింది. ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4000 కోట్లలో కనీసం రెండు వేల కోట్ల రూపాయిలు వైసీపీ నాయకులు తినేశారు’’ అని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పిన అంశాలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. ‘‘టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ళ పాలనలో 8.50 లక్షల ఇళ్ళు నిర్మించిందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డాష్‌ బోర్డులోనే ఉంది. టీడీపీ ప్రభుత్వం మొత్తం 13 లక్షల ఇళ్ళ నిర్మాణం మొదలు పెట్టిందని మంత్రి స్వయంగా చెప్పారు. ఇళ్ళ స్థలాల కోసం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి రూ.4300 కోట్లు ఖర్చు చేసింది. ఆ డబ్బు ఇళ్ళ నిర్మాణంపై ఖర్చుపెట్టి మేం మొదలుపెట్టిన మొత్తం 13 లక్షల ఇళ్ళు పూర్తి చేయడంతోపాటు మరో 15 లక్షల ఇళ్ళు కట్టి ఉంటే రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చి ఉండేది. అందరికీ నేరుగా ఇల్లు నిర్మించి ఇవ్వకుండా ఎక్కడెక్కడో దూరంగా అక్కరకు రాని విధంగా ఇళ్ళ స్థలాలపై ఎందుకింత ఖర్చు చేశారో వారికే తెలియాలి’’ అని కాల్వ వ్యాఖ్యానించారు.  2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వాలకు సంబంధించి రూ.32 వేల కోట్లు పెండింగ్‌ బిల్లులు వచ్చాయని పేర్కొన్నారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వానికి వచ్చిన పెండింగ్‌ బిల్లులతో పోలిస్తే ఇప్పుడు జగన్‌ ప్రభుత్వానికి వచ్చిన పెండింగ్‌ బిల్లులు తక్కువని వివరించారు. అప్పులపై మంత్రి బుగ్గన చెప్పిన లెక్కలతో కూడా కాల్వ విభేదించారు. మే ఆఖరునాటికి అప్పులు రూ.87 వేల కోట్లకు ఎగబాకాయన్నారు. దీనిపై శ్వేత పత్రం ఇవ్వగలరా?అని కాల్వ సవాల్‌ విసిరారు.

Updated Date - 2020-06-06T10:09:30+05:30 IST