HYD : యేటా రూ.200 కోట్లకు పైగా కరెంట్‌ దోచేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-11-30T12:56:58+05:30 IST

HYD : యేటా రూ.200 కోట్లకు పైగా కరెంట్‌ దోచేస్తున్నారు..!

HYD : యేటా రూ.200 కోట్లకు పైగా కరెంట్‌ దోచేస్తున్నారు..!

  • కట్టడి చేయలేకపోతున్న అధికారులు
  • కేసులు, జరిమానాలతో సరి
  • సౌత్‌సర్కిల్‌లో 11 నెలల్లో 3,985 కేసులు
  • రూ. 20 కోట్లకు పైగా జరిమానా

విద్యుత్‌ చౌర్యంతో డిస్కం కుదేలవుతోంది. గ్రేటర్‌ జోన్‌ పరిధిలో యేటా రూ. 200 కోట్లకు పైగా విద్యుత్‌చౌర్యం జరుగుతున్నా నామ మాత్రపు చర్యలతో  సరిపెడుతున్నారు. రూ. 200 కరెంటు బిల్లు బకాయింటే కనెక్షన్‌ కట్‌చేస్తామంటున్న  అధికారులు విద్యుత్‌ చౌర్యం కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  గ్రేటర్‌ లో ప్రతిరోజు 50 నుంచి 55  మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతుండగా, అందులో 5-6 శాతం విద్యుత్‌ చౌర్యం  జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో  చౌర్యానికి చెక్‌పెట్టే అవకాశాలున్నా ఆ దిశగా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు కనీసం దృష్టిసారించడం లేదు.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ జోన్‌ పరిధిలోని  తొమ్మిది సర్కిళ్లలో గడిచిన 11 నెలల్లో 18,907 విద్యుత్‌ చౌర్యం కేసులు నమోదు చేయగా రూ. 20 కోట్ల జరిమానాలు విధించారు. అత్యధికంగా  హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో 3,985  కేసులు, రూ. 6.20 కోట్ల జరిమానాలు ఉన్నాయి. సౌత్‌సర్కిల్‌ పరిధిలో మూడు డివిజన్లు ఉండగా అస్మన్‌ఘడ్‌ -1769, చార్మినార్‌- 1460, బేగంబజార్‌లో 756  కేసులు నమోదయ్యాయి. చంచల్‌గూడ, సంతో్‌షనగర్‌, భవానీనగర్‌, మాదన్నపేట, యాకుత్‌పురా, బేగంబజార్‌, సీతారాంబాగ్‌, ట్రూప్‌బజార్‌, మీరాలం, ఫలక్‌నుమా వంటి ప్రాంతాల్లో భారీగా విద్యుత్‌ చౌర్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు.   మేడ్చల్‌ సర్కిల్‌ జీడిమెట్ల డివిజన్‌లో 179, కూకట్‌పల్లి-2120, రాజేంద్రనగర్‌ సర్కిల్‌  కందుకూర్‌ డివిజన్‌లో అత్యధికంగా 1084, షాద్‌నగర్‌-771, రాజేంద్రనగర్‌-599 కేసులు నమోదయ్యాయి.  ఐటీకారిడార్‌ అయిన గచ్చిబౌలి సర్కిల్‌ పరిధిలో గడిచిన పదకొండు నెలల్లో 1478 చౌర్యం కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలి డివిజన్‌లోనూ 257, ఇబ్రహీంబాగ్‌ 976, కొండాపూర్‌ 245 కేసులు నమోదయ్యాయి.


పెరుగుతున్న నష్టాలు

విద్యుత్‌ చౌర్యం, అక్రమ కనెక్షన్లు పెరుగుతున్నా క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. సైబర్‌సిటీ, మేడ్చల్‌, కొండపూర్‌, జీడిమెట్ల, ఇబ్రహీంపట్నం, చంపాపేట, సరూర్‌నగర్‌, షాద్‌నగర్‌, కందుకూరు వంటి ప్రాంతాల్లో కొంతమంది నకిలీ ధృవపత్రాలు జతచేస్తూ పెద్ద సంఖ్యలో విద్యుత్‌కనెక్షన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


గోదాంలకు అక్రమ విద్యుత్‌

శివారు ప్రాంతాల్లో పలు గోదాంలకు అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పఠాన్‌చెరువు, జీడిమెట్ల,  కొండాపూర్‌,ఎల్‌బీనగర్‌, మేడ్చల్‌, రాజేంద్రనగర్‌, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది మద్యవర్తులుగా వ్యవహరిస్తూ విద్యుత్‌ కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలకు విద్యుత్‌కనెక్షన్‌తో పాటు ప్యానల్‌ బోర్డుల జారీకి లక్షల్లో వసూలుచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Updated Date - 2021-11-30T12:56:58+05:30 IST