పొమ్మంటే... పోతా!

ABN , First Publish Date - 2021-07-26T06:44:19+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను మార్చాలని బీజేపీ అధిష్ఠానం దాదాపు నిర్ణయించింది. నాలుగు రోజులక్రితమే ఆదివారం సూచిస్తామని, సోమవారం రెండేళ్ల పాలన విజయోత్సవం ముగియగానే...

పొమ్మంటే... పోతా!

  • సందేశం రాగానే రాజీనామా : యడియూరప్ప  
  • బీజేపీ పెద్దల నిర్ణయంపై ఉత్కంఠ

బెంగళూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పను మార్చాలని బీజేపీ అధిష్ఠానం దాదాపు నిర్ణయించింది. నాలుగు రోజులక్రితమే ఆదివారం సూచిస్తామని, సోమవారం రెండేళ్ల పాలన విజయోత్సవం ముగియగానే రాజీనామా చేయాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆదివారం ఏ క్షణంలోనైనా ఢిల్లీ నుంచి సమాచారం వస్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటాయని అనుకున్నారు. అయితే, ఆదివారం సాయంత్రం వరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. బెళగావి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం యడ్డి బెంగళూరుకు చేరుకున్నాక మీడియాతో మాట్లాడారు. ‘‘అధిష్ఠానం నుంచి ఎలాంటి సందేశం రాలేదు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. రాత్రిలోగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోరితే వెంటనే చేస్తా, లేదంటే పదవిలో కొనసాగుతా’’ అని చెప్పారు. మరో 10-15 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తానన్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. యడ్డిని కొనియాడారు. యడియూరప్ప ఉత్తమ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు.  


యడ్డిని కొనసాగించాలి: మఠాధిపతులు

ముఖ్యమంత్రి యడియూరప్పను మారుస్తారనే సమాచారంపై వందలాది మంది మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్పును వ్యతిరేకిస్తూ.. ఆదివారం బెంగళూరులో సమావేశమయ్యారు. ప్యాలెస్‌ గ్రౌండ్‌లో ‘మఠాధీశర మహాసమావేశ’ పేరిట ‘ప్రస్తుత సమస్యలు-పరిష్కారం’ అనే అంశంపై భేటీ అయ్యారు. రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని, వెంటనే పరిష్కరించాలని చిత్రదుర్గ మురుఘరాజేంద్ర మఠాధిపతి అభిప్రాయపడ్డారు. సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటన కార్యదర్శి బీఎల్‌ సంతోశ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదని డిమాండ్‌ చేశారు. అయితే, ఇలాంటి నినాదాలు చేయరాదని స్వామిజీలు కోరినా వారు పట్టించుకోలేదు. అరగంటపాటు సభ రసాబాసగా మారింది. అనంతరం, చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి శివాచార్య స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విషయం హైకమాండ్‌కు సంబంధించిందని, తాము నిర్ధారించేవారం కాదన్నారు. తమ డిమాండ్లు సూచించామన్నారు. 75 ఏళ్లు పైబడినందుకు యడియూరప్పను పదవి నుంచి తొలగిస్తామనే నిర్ణయం వారి ఇష్టమని, అయితే బాధ్యతలు అప్పగించే సమయంలో వయసును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. యడియూరప్పకు పోరాటం చేసే శక్తి ఉందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ పెద్దలు తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.


Updated Date - 2021-07-26T06:44:19+05:30 IST