యడియూరప్ప రాష్ట్ర పర్యటనపై బీజేపీలో ప్రకంపనలు

ABN , First Publish Date - 2021-08-28T18:19:40+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప రాష్ట్ర పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఎలాగైనా ఆయన పర్యటనకు బ్రేక్‌ పడేలా చూడాలని రాష్ట్ర బీజేపీ నే

యడియూరప్ప రాష్ట్ర పర్యటనపై బీజేపీలో ప్రకంపనలు

- గవర్నర్‌ పదవి చేపట్టేలా ఒప్పించాలని అధిష్ఠానంపై పెరుగుతున్న ఒత్తిడి 

- అప్ప వ్యూహంపై నేతల తర్జనభర్జన


బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప రాష్ట్ర పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో బీజేపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఎలాగైనా ఆయన పర్యటనకు బ్రేక్‌ పడేలా చూడాలని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్ఠానానికి సూచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బసవరాజ్‌ బొమ్మై నాయకత్వంలోని ప్రభుత్వం టేకాఫ్‌ అయిందని, ఇలాంటి స్థితిలో యడియూరప్ప పర్యటన వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని రాష్ట్ర బీజేపీ నేతలు భయపడుతున్నారు. ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట గాడిన పడేసేలా బొమ్మై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని భావిస్తున్న బీజేపీ నేతలు యడియూరప్ప గవర్నర్‌ పదవి చేపట్టేలా అధిష్ఠానం పెద్దలు ఒప్పించడం మంచిదని సూచిస్తున్నట్టు తెలిసింది. ఇంతవరకు బొమ్మై ప్రభుత్వానికి తలనొప్పి సృష్టించే వ్యాఖ్యలు ఏవీ యడియూరప్ప చేయనప్పటికీ రాష్ట్రపర్యటనలో భాగంగా ఆయన తన ప్రసంగాలలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని సర్వత్రా కుతూహ లం నెలకొంది. కుటుంబ సమేతంగా మాల్దీవుల పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన యడియూరప్ప దివ్యమౌనాన్ని పాటిస్తున్నారు. తనకు అత్యంత ఆప్తులైన వా రిని మినహా మరింకెవ్వరినీ భేటీ కావడం లేదు. రాష్ట్ర పర్యటన కోసమే కొనుగోలు చేసిన విలాసవంతమైన కారులోనే బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డాలర్స్‌ కాలనీలోని తన నివాసానికి చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన అనంతరం యడియూరప్ప తన రాష్ట్ర పర్యటన ఖాయమని ప్రకటించారు. ఆయన పర్యటనను రాష్ట్ర పార్టీ ఖరారు చేస్తుందా..? ఆయనే స్వయంగా తన పర్యటనను రూపొందించుకుంటారా..? అనేది ఇంకా స్పష్టం కాలేదు. యడియూరప్ప రాష్ట్ర పర్యటనకు అధిష్ఠానం అనుమతి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు బొమ్మై ప్రభుత్వ తీరుతెన్నులపై యడియూరప్ప విమర్శలు గుప్పించే అవకాశం లేదని, తానే సిఫారసు చేసి సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బొమ్మైపై విమర్శలు చేస్తే అది ప్రజలలో ప్రత్యేకించి లింగాయత శిబిరంలో అసంతృప్తి రేపుతుందని యడియూరప్ప సైతం భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర పర్యటన సమయంలో యడియూరప్ప ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో... వేచి చూసి ఆపై ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి బొమ్మై కూ డా భావిస్తున్నట్టు సమాచారం. యడియూరప్ప కబంధ హస్తాల నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని అధిష్ఠానం పెదదలు ముఖ్యమంత్రి బొమ్మైకు ఇప్పటికే సూచించిన సంగతి విదితమే. ఇటీవల ఢిల్లీ పర్యటన సమయంలోనూ హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇదే అంశాన్ని మరోమారు వల్లె వేసినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో బీ జేపీ ముద్రకు ప్రాధాన్యత లభించాలని, వ్యక్తుల ప్రాధాన్యత తగ్గించాలని షా సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బొమ్మై తాను పాల్గొంటున్న అన్ని సభల్లోనూ యడియూరప్ప పేరును ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఒకవేళ అధిష్ఠానాన్ని కాదని రాష్ట్ర పార్టీ సూచనలను పక్కనపెట్టి ఆయన రాష్ట్ర పర్యటనకు సిద్ధపడితే అది బీజేపీలో సరికొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-08-28T18:19:40+05:30 IST