ఎప్పుడిస్తారు ?

ABN , First Publish Date - 2021-08-02T05:04:55+05:30 IST

కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిధి(వీఎస్‌యూ)లో డిగ్రీ పరీక్షలు నిర్వహించలేదు.

ఎప్పుడిస్తారు ?
నెల్లూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఎదుట హాల్‌టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు

హాల్‌టికెట్ల కోసం డిగ్రీ విద్యార్థుల నిరీక్షణ

4వ తేదీ నుంచి పరీక్షలు

జగనన్న విద్యాదీవెన చెల్లించలేదంటున్న కళాశాలలు

బ్యాంకుల్లోనే కట్‌ చేశారు : తల్లిదండ్రులు

మధ్యలో నలుగుతున్న స్టూడెంట్స్‌


నెల్లూరు (స్టోనహౌస్‌పేట), ఆగస్టు 1 : కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం విక్రమ సింహపురి యూనివర్శిటీ  పరిధి(వీఎస్‌యూ)లో  డిగ్రీ పరీక్షలు  నిర్వహించలేదు. కరో నా కేసులు తగ్గడంలో  ఆగష్లు 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు డిగ్రీ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు.  మొదటి సెమిస్టర్‌ పరీక్షలను జిల్లాలో 17వేల మంది రాయనున్నారు. వీరికోసం 45 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లను ఆయా ప్రైవేటు కళాశాలలు యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే జారీ చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యార్ధులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు.


‘జేడీవీ’ నగదు చెల్లించలేదు..


గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్ధులకు నగదును రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కళాశాలల ఖాతాలకు జమచేసేది. వైసీపీ ప్రభుత్వం  వచ్చాక జగనన్న విద్యాదీవెన (జేడీవీ) పథకం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు వేస్తున్నది. తల్లిదండ్రులు ఈ నగదును కళాశాలలకు చెల్లించాలి. అయితే కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించడం లేదని, పలుమార్లు ఫోనల ద్వారా తెలిపినా స్పందించడం లేదని,  పరీక్షలకు ముందు గట్టిగా అడిగితే చెల్లిస్తారని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అంటు న్నాయి. మాకు బ్యాంకులో నగదు పడినా, పాత అప్పులకు జమ చేసుకుంటున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాక కరోనా కాలంలో బయట అప్పులు చేయగా, వాటిని తీర్చాల్సి వస్తున్నదని వారంటున్నారు . ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షలకు హాల్‌టికెట్లు  నిరాకరించడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఫీజులు చెల్లించని తల్లిదండ్రులది తప్పా.. ? లేక .కళాశాల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడం తప్పా.. ? ప్రభుత్వం తల్లుల ఖాతాలకు నగదు జమ చేయడం తప్పా...? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు కళాశాలవారు హాల్‌టిక్కెట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.


Updated Date - 2021-08-02T05:04:55+05:30 IST