నేను టుక్‌డే టుక్‌డే గ్యాంగే, కానీ..: కన్హయ్య కుమార్

ABN , First Publish Date - 2021-10-02T00:31:20+05:30 IST

మోదీ-అమిత్ షా ద్వయం నాదూరం బనాయే జోడి లాంటిది. వాళ్లకు జాతి పిత గాడ్సేనే కానీ మహాత్మ గాంధీ కాదు. హిందుత్వ భావజాలమున్న చాలా పార్టీలు, గ్రూపులు కూడా అలాగే ఆలోచిస్తాయి. వాళ్లు గాంధీని విశ్వసించరు. ఒక్క సందర్భంలో అయితే గాంధీ గురించి చెప్తారు. అది అమెరికా అధ్యక్షుడి ముందు..

నేను టుక్‌డే టుక్‌డే గ్యాంగే, కానీ..: కన్హయ్య కుమార్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతలు తనను ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్’ (విచ్ఛిన్నకారి) వ్యక్తినని అన్నారని, వాళ్లు అన్నట్టుగానే తాను అదేనని, కాకపోతే బీజేపీని విచ్ఛిన్నం చేసే ‘టుక్‌డే టుక్‌డే’ అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ అన్నారు. శుక్రవారం ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని, మరే పార్టీ ఆ పని చేయలేవని అన్నారు. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తే అది బీజేపీకి లాభం అవుతుంది. ఈ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్‌ను బలపరిస్తే బీజేపీని ఓడించొచ్చు. కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే అవన్నీ ప్రాంతీయ పార్టీలు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోగల పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీని ఓడించడానికే నేను పోరాడుతున్నాను. కాంగ్రెస్‌తో అది సాధ్యం అవుతుంది. ఒకవేళ అలా జరక్కపోతే నా పోరాటం నుంచి తప్పుకుంటాను’’ అని కన్హయ్య కుమార్ అన్నారు.


ఇక రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ‘‘రాహుల్ గాంధఈ జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన వ్యక్తి. చాలా దయగల వ్యక్తి కూడా. ఆయనెప్పుడూ మా అమ్మనాన్నల ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆయన చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి. అంతే కాదు, చాలా ధైర్యవంతుడు, నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు’’ అని అన్నారు.


ఇక మోదీ, అమిత్‌షా గురించి మాట్లాడుతూ ‘‘మోదీ-అమిత్ షా ద్వయం నాదూరం బనాయే జోడి లాంటిది. వాళ్లకు జాతి పిత గాడ్సేనే కానీ మహాత్మ గాంధీ కాదు. హిందుత్వ భావజాలమున్న చాలా పార్టీలు, గ్రూపులు కూడా అలాగే ఆలోచిస్తాయి. వాళ్లు గాంధీని విశ్వసించరు. ఒక్క సందర్భంలో అయితే గాంధీ గురించి చెప్తారు. అది అమెరికా అధ్యక్షుడి ముందు. బీజేపీ నన్ను ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్’ అంటుంది. నిజమే.. నేను బీజేపీని ‘టుక్‌డే టుక్‌డే’ చేసే వాడినే’’ అని కన్హయ్య కుమార్ అన్నారు.

Updated Date - 2021-10-02T00:31:20+05:30 IST