వైభవంగా ఏటి పండుగ

ABN , First Publish Date - 2021-01-17T04:57:53+05:30 IST

సంక్రాంతి సంబరాల్లో చివరిది అయిన ఏటి పండుగను శనివారం నెల్లూరు పెన్నాతీరంలో వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజులపాటు నిర్వహించిన గౌరీవ్రతం లో ఉంచి గొబ్బెమ్మలను పెన్నాలో నిమజ్జనం చేశారు.

వైభవంగా ఏటి పండుగ
కొలువుదీరిన దేవతామూర్తులు

పెన్నాలో గొబ్బెమ్మల నిమజ్జనం

కొలువుదీరిన దేవతామూర్తులు

మహిళల ఆటపాటలతో కోలాహలం

ఉత్సాహంగా పతంగుల ఎగురవేత

ఉర్రూతలూగించిన సాంస్కృతిక ప్రదర్శనలు

నాయుడుపేటలో రెండోరోజు నిరాడంబరంగా..


నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 16 : సంక్రాంతి సంబరాల్లో చివరిది అయిన ఏటి పండుగను శనివారం  నెల్లూరు పెన్నాతీరంలో వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజులపాటు నిర్వహించిన గౌరీవ్రతం లో ఉంచి గొబ్బెమ్మలను పెన్నాలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ‘పువ్వులో పుట్టావు.. నీవు గౌరమ్మ... పువ్వులో పెరిగావు నీవు గౌరమ్మ.. అందనం కుందనం బంగారు పావనం.. ఔరప్ప జలధిలో నీళ్లోప్ప జలధి.. నీ నోమునే నోతునో గౌరమ్మ...నా నోము ఫలం అందుకో.. అంటూ ముత్తైదువలు గీతాలు ఆలపిస్తూ హారతులు ఇచ్చారు. కులతాలకు అతీతంగా హాజరైన ప్రజలతో పెన్నాతీరం కళకళలాడింది. చిన్నాపెద్దా తేడా లేకుండా  ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. కబడ్డీ, చెమ్మచెక్క, తదితర సంప్రదాయ ఆటలు ఆడారు. కళాంజలి ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో పాట కచేరీ, సంప్రదాయ కూచిపూడి, భరతనాట్యాలు, డప్పు విన్యాసం తదితర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా,  ప్రేక్షకుల్ని అవి ఉర్రూతలూగించాయి. ఈ పండుగను వైసీపీ నాయకులు రూప్‌కుమార్‌ యాదవ్‌ ప్రారంభించి గాలిపటాలను పంపిణీ చేశారు. 


కొలువు దీరిన దేవేరులు


ఏటి పండుగకు వచ్చే భక్తుల కోసం దేవదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్‌ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో దేవతామూర్తులు ప్రత్యేక సెట్టింగుల్లో కొలువుదీ రారు. గణపతి, రాజరాజేశ్వరి అమ్మవారు, మూలస్ధానేశ్వర స్వామి, తల్పగిరి రంగనాథస్వామి, జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారు, నర్రవాడ వెంగమాంబ అమ్మవార్లు విశేష అలంకారంతో కొలువుదీరి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవోలు వేణుగోపాల్‌, డీ వెంకటేశ్వర్లు,  ఏవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్‌  వెంకటేశ్వర్లు, పీవీకే ప్రసాద్‌, చిట్టిబాబు, కామేశ్వరరావు, భాస్కర్‌రావులు, ఇన్‌స్పెక్టర్‌ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు. గొబ్బెమ్మల్ని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. 



 నాయుడుపేటలో  నిరాడంబరంగా..


నాయుడుపేట టౌన్‌, జనవరి 16 : ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏటిపండుగ ఈ ఏడాది నిరాడంబరంగా నిర్వహించారు. కొన్ని కారణాల వల్ల ముందుగా అధికారులు ఏటిపండగపై అధికారికంగా ప్రకటించనప్పటికి ఈఏడాది ఏటిపండగను శుక్రవారం నుంచి  నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఏటిపండగలో భాగంగా స్వర్ణముఖినదికి చేరుకున్న చిన్నారులు, పెద్దలు  పలు రకాల తినుబండారాలను  ఆనందంగా భుజించారు. పండగ నెల మొదలైన రోజు నుంచి గొబ్బెమ్మలను పూజలు చేసి శనివారం ఏటి పండగలో   నిమజ్జనం చేసి మొక్కులు తీర్చుకున్నారు.





Updated Date - 2021-01-17T04:57:53+05:30 IST