యోగం... పరమార్థం

ABN , First Publish Date - 2021-07-02T05:30:00+05:30 IST

పరమాత్మ ప్రకాశ శక్తి సకల జీవరాశికీ ఆధారం. ఆత్మకు అది ప్రాణాధారం. ఆత్మకు ఈ ప్రకాశ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అది అంత బాగా పని చేస్తుంది. ఆ శక్తి సంపదను పరమాత్మ నుంచి...

యోగం... పరమార్థం

పరమాత్మ ప్రకాశ శక్తి సకల జీవరాశికీ ఆధారం. ఆత్మకు అది ప్రాణాధారం. ఆత్మకు ఈ ప్రకాశ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అది అంత బాగా పని చేస్తుంది. ఆ శక్తి సంపదను పరమాత్మ నుంచి మాత్రమే ఆత్మ పొందగలదు. అది ఆత్మకు శాంతినీ, సుఖాన్నీ, ఆనందాన్నీ ఇస్తుంది. మనోకామనలను తీరుస్తుంది.


యోగానికి జ్ఞానం ఆధారం. ‘జ్ఞానం కన్నా యోగం శ్రేష్టం’ అంటారు పరమాత్మ. యోగంలో జ్ఞానం అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. జ్ఞాని తను నేర్చుకున్న జ్ఞాన దృక్పథం ద్వారా ప్రతి దృశ్యాన్నీ, సంఘటననూ విశ్వ కళ్యాణ భావనతో వీక్షించినట్టే... యోగి కూడా దాన్ని యోగదృష్టి కోణంతో చూసి విశ్లేషిస్తాడు. ఉదాహరణ చెప్పాలంటే... ఆవు పాలు తాగుతున్న  లేగదూడ బొమ్మను జ్ఞానికీ, యోగికీ చూపిస్తే... ఆత్మ-పరమాత్మల సంబంధాన్ని నిర్వచించే తల్లి బిడ్డల ప్రేమ సందేశాన్ని ఆ చిత్రం చెబుతోందంటాడు జ్ఞాని. పూజనీయమైన గోమాతలో సకల శక్తులనూ అందించే దేవతలు, ఐశ్వర్యం దాగి ఉన్నాయని, వాటిని ఒక యోగిలా స్వీకరించాలనే దానికి సూచికగా లేగదూడ పాలు తాగుతోందనీ యోగి చెబుతాడు. ఈ విధంగా జ్ఞానికన్నా యోగి సర్వోన్నత దృష్టి కలిగి ఉంటాడు. ఒక దీపంలా దారి చూపేది జ్ఞానమైతే, ఆ దారిలోని ఆటంకాలను తొలగించేది యోగం. ‘తన యోగ శక్తితో ప్రకృతిని శుభ్రపరచి, విశ్వంలో శాంతి ప్రకంపనలు వ్యాప్తి చేసే యోగే సర్వ శ్రేష్ఠుడు’ అంటారు పరమాత్మ. 


‘యుజ్‌’ (కలయిక) అనే సంస్కృత ధాతువు నుంచి ‘యోగ’ అనే పదం ఉత్పన్నమయింది. ఆ మాటకు ‘అదృష్టం, భాగ్యం, పొందడం, కూడడం’ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పొందాల్సింది ఏమిటి? ఎవరి నుంచి పొందాలి? ఎందుకోసం పొందాలి? దాని ప్రయోజనం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. కంటికి కనిపించని రూపంలో... అంతర్వాహినిగా ప్రవహించే సూక్ష్మమైన, కాంతిమయమైన శక్తి సముదాయం పరమాత్మలో ఉంది. దీన్ని అష్టైశ్వర్య సంపదగా భగవద్గీత వర్ణించింది. ఈ శక్తి సంపద కలిగి ఉన్నవారే యోగీశ్వరులు. దాన్ని స్వీకరించే వాళ్ళే యోగులు.  కానీ, సరైన యోగ వస్తువు ఏదో యోగి తెలుసుకున్నప్పుడే దాని ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి... ఈ మూడింటిలో మాయగా పరిగణించే ప్రకృతితో యోగం కూడదంటారు పెద్దలు. ఆత్మ- పరమాత్మలది తండ్రీ బిడ్డల సంబంధం. కాబట్టి అదే సర్వ శ్రేష్ఠమైన యోగ వస్తువు. 


పరమాత్మ ప్రకాశ శక్తి సకల జీవరాశికీ ఆధారం. ఆత్మకు అది ప్రాణాధారం. ఆత్మకు ఈ ప్రకాశ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అది అంత బాగా పని చేస్తుంది. ఆ శక్తి సంపదను పరమాత్మ నుంచి మాత్రమే ఆత్మ పొందగలదు. అది ఆత్మకు శాంతినీ, సుఖాన్నీ, ఆనందాన్నీ ఇస్తుంది. మనోకామనలను తీరుస్తుంది. యోగానందంలో మునిగి ఉన్న ఆత్మ నుంచి స్వాభావికంగా వెలువడే శుభ సంకల్పాల ప్రకంపనలు గొప్ప వాతావరణానికి దోహదం చేస్తాయి. ‘యోగం’ అనేది ఆత్మ-పరమాత్మల సంయోగానంద క్రియ. మూడవదైన ప్రకృతికి ఇక్కడ చోటు లేదు. సాంకేతిక వస్తు సాధనాలకు ఆధారమైన ప్రకృతి యోగ సాధకుడికి అవరోధంగా మారుతుంది. జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావడమే యోగం అవుతుందనీ, జీవుడికి అది పూర్ణత్వాన్ని ఇస్తుందనీ ఉపనిషత్తులు పేర్కొన్నాయి. దీనిలోనూ ప్రకృతికి స్థానం లేదు.  


భగవంతుడు స్వయంగా అందించిన గొప్ప వరం రాజయోగం. దీన్ని సాధన చేసిన యోగికి ‘రాజయోగం’ అంటే అదృష్టం, భాగ్యం కలుగుతాయి. శివ పరమాత్మ నుంచి వెలువడే సూక్ష్మ ప్రకాశ కిరణ శక్తి... సాధకుడి ఆత్మలో సంలీనమవుతుంది. అదే ఆ ఆత్మకు సౌభాగ్యంగా, శక్తిగా, వరంగా మారుతుంది. ఆ సాధకుడి జీవితం ఆనందమయం అవుతుంది. 


బ్రహ్మ కుమారీస్‌, 9391304556

Updated Date - 2021-07-02T05:30:00+05:30 IST