యోగి ఎత్తుగడ

ABN , First Publish Date - 2021-07-13T06:55:41+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో జనాభా నియంత్రణ లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం విడుదల చేసిన బిల్లు ముసాయిదా వివాదం రేపుతోంది....

యోగి ఎత్తుగడ

ఉత్తర్‌ప్రదేశ్‌లో జనాభా నియంత్రణ లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం విడుదల చేసిన బిల్లు ముసాయిదా వివాదం రేపుతోంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారిని పలు ప్రభుత్వ ప్రయోజనాలకు అనర్హులను చేయబోతున్నది ఆ బిల్లు. స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకూ, ప్రభుత్వోద్యోగాలకు, ఉద్యోగాల్లో పదోన్నతులకు వారు అనర్హులవుతారు. ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందలేకపోవచ్చు. ఇద్దరు పిల్లలున్నవారిని మెచ్చుకొని వీరతాడు వేసే అంశాలు కూడా ఈ బిల్లులో అనేకం ఉన్నాయి. వారు ప్రభుత్వోద్యోగులైతే రెండు ఇంక్రిమెంట్లు అదనంగా పొందవచ్చు, పన్నెండునెలల పూర్తి వేతనంతో, భత్యాలతో మాతృత్వ, పితృత్వ సెలవులు అనుభవించవచ్చు. ముసాయిదాను బాగా చదివి, దానిమీద సలహాలూ సూచనలు ఇవ్వమంటూ యూపీ లాకమిషన్‌ కేవలం ఓ వారం సమయం ఇచ్చింది. 


యోగి ప్రభుత్వం ఏం చేసినా రాజకీయలక్ష్యాలతోనే చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరీముఖ్యంగా జనాభా నియంత్రణ కోసమంటూ అది ఏ చట్టాన్ని తెచ్చినా ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రగానే భావించాలని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్‌ అన్నారు. దళితులు, గిరిజనుల కారణంగానే జనాభా పెరుగుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు షఫీఖుర్‌ రహ్మాన్‌ మరింత ఘాటుగా స్పందిస్తూ, పిల్లల విషయంలో ఇలా ఆంక్షలు పెట్టేకంటే ఇరవైయేళ్ళు పెళ్ళిళ్ళే రద్దుచేయవచ్చు కదా అన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు సల్మాన్‌ ఖుర్షీద్‌– రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసేముందు తన మంత్రులు అధికార, అనధికారిక సంతానం లెక్కలు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఇద్దరు పిల్లల నియంత్రణ బాగానే ఉన్నది కానీ, ఒక్కరినికనే ప్రభుత్వోద్యోగులను మరింత ప్రోత్సాహించాలన్న ఆలోచన సరికాదనీ, ఆ అదనపు సెక్షన్లు తొలగించాలని విహెచ్‌పి అంటున్నది. ఇది కనుక అమలైతే రాబోయే రోజుల్లో సమాజంలో వివిధ వర్గాల మధ్య సమతుల్యం బాగా దెబ్బతింటుందని దాని వాదన. 


దేశంలో గత దశాబ్దకాలంలో ఫెర్టిలిటీ రేటు అంతకుముందు దశాబ్దంతో పోల్చితే బాగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూపీలో సైతం ఇది ౩.8 నుంచి 2.7కు తగ్గింది. అయినా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం జనాభానియంత్రణ చట్టానికి ఉపక్రమించింది. ఉపరితలంలో ఒక సంక్షేమచర్యగా కనిపిస్తున్నప్పటికీ, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తయారైనదని అనుకొనేట్టు చేయడంలో యోగి ప్రభుత్వం విజయవంతమైంది. ఎక్కువమంది పిల్లలను కనకుండా ముస్లింలను నియంత్రించి యోగి మంచిపనిచేశాడని మిగతావారు అనుకోవడం ఎన్నికలముందు అస్త్రంగా ఉపకరిస్తుంది. పెద్ద రాష్ట్రమైన యూపీలో పరిమితంగా ఉన్న వనరులతో అందరికీ అన్ని వసతులూ సమకూర్చాలంటే జనాభా నియంత్రణ, స్థిరీకరణ ముఖ్యమన్న వాదనతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెస్తున్నది. ఇద్దరు పిల్లలు మించి ఉన్నవారికి ప్రభుత్వ ప్రయోజనాలు నిరాకరించాలన్న ప్రతిపాదన నిజానికి మతంతో నిమిత్తం లేకుండా వేలాది పేదకుటుంబాలను నేరుగా దెబ్బతీస్తుంది. పిల్లల లెక్కను బట్టి వారికి సంక్షేమాన్ని దూరం చేస్తే బతుకులు దుర్భరమవుతాయి. రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం, సబ్సిడీలు నిరాకరించడం వంటివి కనుక జరిగితే, ఆకలిచావులు సంభవించి ప్రభుత్వం అప్రదిష్టపాలవుతుంది. ముసాయిదాకు మరిన్ని దిద్దుబాట్లు జరిగి, దాని ఆధారంగా బిల్లు తయారై, తరువాత చట్టమై, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏడాదికి కానీ అందులోని నియమనిబంధనలు అమల్లోకి రావు. కానీ, ఇంతలోగానే ఈ బిల్లు చర్చకూ రచ్చకూ కారణమవుతున్నది. అసోంలో కూడా అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ప్రయోజనాలు, రాయితీలూ అందుకోవడానికి ఇద్దరు పిల్లల నిబంధనను తేదల్చుకున్నట్టు చెప్పింది కానీ, దానిని హడావుడిగా కాక, క్రమంగా అమలు చేస్తానన్నది. కొద్దినెలల క్రితం ఎన్నికలు పూర్తయిన రాష్ట్రం ఇది. యూపీ వంటి రాష్ట్రానికి జనాభా నియంత్రణ అవసరమని యోగి ప్రభుత్వం నిజంగానే భావించినపక్షంలో, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందుకు సంకల్పించి దానిని ఒక రాజకీయాంశంగా మార్చివుండేవారు కాదు. అతివేగంగా దానిని చట్టం చేసి, 2019 సార్వత్రక ఎన్నికల ముందు ముమ్మారు తలాఖ్‌ చుట్టూ రచ్చ జరిగినట్టు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ ఇద్దరుపిల్లల చుట్టూ వాదోపవాదాలు కొనసాగేట్టు చేయడం యోగి ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నది. దీనికితోడుగా లవ్‌జిహాద్‌ చట్టం ఇప్పటికే ఉండనే ఉంది. సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ వంటివి కేవలం నినాదాలే. 

Updated Date - 2021-07-13T06:55:41+05:30 IST