Abn logo
Sep 24 2021 @ 18:49PM

యోగి పేరు చెరితే వాళ్లకు వెన్నులో చలి:రాజ్‌నాథ్

గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ దిశగా ముఖ్యమంత్రి మెచ్చుకోదగిన కృషి చేశారని, ఆయన పేరు వినగానే నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. గోరఖ్‌నాథ్ ఆలయ చీఫ్ ప్రీస్ట్, యోగి ఆదిత్యనాథ్ గురువు అయిన మహంత్ అవైద్యనాథ్ 70వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతలు గురించి జనం మాట్లాడుతుంటారని, శాంతిభద్రతలు ఉంటేకానీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదని, సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్‌గా ముఖ్యమంత్రి మతపరమైన కార్యక్రమాలను కూడా చక్కగా నడిపించారని చెప్పారు.

''నేను రామ్ ఔర్ శ్యామ్ చూశాను. అందులో సదరు నటుడు ద్విపాత్రాభినయం చేశాడు. యోగి ఆదిత్యనాథ కేవలం ద్విపాత్రాభినయానికే పరిమితం కాలేదు. అనేక పాత్రలు చేశారు, అద్భుతంగా పాత్ర పోషణ చేశారు'' అని రాజ్‌నాథ్ శ్లాఘించారు. బీజేయేతర ప్రభుత్వాల పాలనలో గూండాలే పోలీసులను శాసించేవారని అన్నారు. ఈరోజు గూండాలపై పోలీసులదే పైచేయి అయిందని, సంఘ వ్యతిరేక శక్తుల ఆస్తులు సీజ్ అయ్యాయని, బీజేపీ పాలనలో రాష్ట్రంలో సమూల మార్పులు వచ్చాయని చెప్పారు. అవినీతి రహిత పాలనను యోగి సర్కార్ అందించిందని అన్నారు. కనీసం నిద్రలో కూడా ఎవరూ యోగికి అవినీతి మచ్చ ఆపాదించలేరని పేర్కొన్నారు.

యోగి సారథ్యంలోనే ఎన్నికలకు...

వచ్చే ఏడాది ప్రథమార్థంలో అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం వెళ్తోందని, యోగి ఆదిత్యనాథ్ ప్రచార సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాపులారీటికి కూడా పార్టీకి తోడవుతుందని రాజ్‌నాథ్ అన్నారు. భారతదేశం ఇంకెంతమాత్రం బలహీన దేశం కాదని, చాలా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎదుటవారిపై మొదటిగా దాడి చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే లేదని, భూ ఆక్రమణలు కానీ, దాడులు కానీ ఎప్పుడు చేయలేదని, అయితే ఎవరైనా దాడులు జరిపితే ఎవ్వరి అనుమతి అవసరం లేకుండానే గట్టిగా ప్రతిఘటించాలని సైనికులకు తాను ఆదేశాలిచ్చానని చెప్పారు. 

ఇవి కూడా చదవండిImage Caption