భాగ్యలక్ష్మి ఆలయానికి యోగి

ABN , First Publish Date - 2022-07-04T09:56:05+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

భాగ్యలక్ష్మి ఆలయానికి యోగి

  • అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం
  • ఆయనవెంట సంజయ్‌, లక్ష్మణ్‌, రాజాసింగ్‌
  • పరిసరాల్లో కాషాయ జెండాల రెపరెపలు


చార్మినార్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఉదయం 7.55కు ఆలయానికి వచ్చిన ఆయన 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. యూపీ సీఎంకు.. భాగ్యలక్ష్మి ఆలయ ట్రస్టీ శశికళ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి యోగి ప్రత్యేక పూజలు చేశారు. మహా హారతిలోనూ పాల్గొన్నారు. యోగికి బండి సంజయ్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. యోగి రాకతో చార్మినార్‌ పరిసరాలు కాషాయ జెండాలతో రెపరెపలాడాయి. కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, యోగి భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండడంతో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో చార్మినార్‌ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నారు. నలువైపులా ఆంక్షలు విధించారు. బీజేపీ నేతలు ఉమామహేంద్ర, ఆలె భాస్కర్‌, పొన్న వెంకటరమణ యూపీ సీఎంను పూలమాలతో సన్మానించారు.

Updated Date - 2022-07-04T09:56:05+05:30 IST