అ‘ధనం’ కట్టాల్సిందే...!

ABN , First Publish Date - 2022-03-04T05:36:17+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తి తగ్గడంతో సొంతింటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు మళ్లీ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్‌ మార్కెట్‌ వ్యాల్యు ప్రకారం భవన నిర్మాణానికి ఆన్‌లైన్‌లో అదనంగా చెల్లించాలి.

అ‘ధనం’ కట్టాల్సిందే...!

- 2020 ఎల్‌ఆర్‌ఎస్‌ రిసిప్ట్‌ లేక కష్టాలు

- రసీదు ఉంటే అప్పటి మార్కెట్‌ విలువ

- లేకుంటే కొత్త మార్కెట్‌ విలువతో కట్టాల్సిందే..

- రూ.లక్ష వరకు అదనపు ఖర్చు

- వెబ్‌సైట్‌ సాంకేతిక సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు


కామారెడ్డి టౌన్‌, మార్చి 3: కొవిడ్‌ వ్యాప్తి తగ్గడంతో సొంతింటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు మళ్లీ ఇంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్‌ మార్కెట్‌ వ్యాల్యు ప్రకారం భవన నిర్మాణానికి ఆన్‌లైన్‌లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేసుకుని ఆ రసీదు పొంది ఉంటే ఇంటి పర్మీషన్‌కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్‌లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనికి తోడు ఎల్‌ఆర్‌ఎస్‌ సైట్‌ ప్రస్తుతం క్లోజ్‌ కావడంతో ఆన్‌లైన్‌ లోను రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు.

తెరుచుకోని సైట్‌

అక్రమ లే అవుట్లలో ఓపెన్‌ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్‌ ఫీజును ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్‌ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్‌ విలువను పెంచిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుము మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదును కలిగి ఉండి టీఎస్‌బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్‌ విలువ ప్రకారం ఫీజు చెల్లించవచ్చు. కానీ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రశీదులను నిర్లక్ష్యం చేశారని వాటిని ఏ విధంగా పొందాలో తెలియక మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తులు ఓపెన్‌ కావడం లేదు. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబరుకు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలా మంది ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కట్టాల్సి వస్తోంది.

ఇంటి నిర్మాణానికి సన్నద్ధం

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ఉధృతి సైతం తగ్గుముఖం పట్టడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లుగా ఎదురుచూసిన వారు భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించి అప్పటి రశీదు ఉంటే గతంలోని మార్కెట్‌ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10 వేల నుంచి రూ.1 లక్షల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలా మంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్‌ఆర్‌ఎస్‌ రసీదులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ  ఆన్‌లైన్‌లో వివరాలు లభించక 14 శాతం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముతో ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ సైట్‌ను పునరుద్ధరించాలని, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు కోరుతున్నారు.

Updated Date - 2022-03-04T05:36:17+05:30 IST