ప్రతి గింజా కొనాల్సిందే!

ABN , First Publish Date - 2021-01-10T07:24:42+05:30 IST

రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందేనని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

ప్రతి గింజా కొనాల్సిందే!

  • సాగు చట్టాలు రద్దయ్యే దాకా పోరు
  • సీఎల్పీ దీక్షలో నేతలు
  • ధాన్యం కొంటే నష్టం ఎందుకు వస్తుంది?
  • ఇది ప్రభుత్వ చేతగానితనమే: ఉత్తమ్‌
  • దేశం.. వ్యాపారులకు ధారాదత్తం: భట్టి
  •  మోదీకి మానవత్వం లేదు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌/కవాడీగూడ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందేనని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉప సంహరించే వరకూ పోరా టం కొనసాగుతుందని ప్రకటించింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావంగా సీఎల్పీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మాట్లాడుతూ తొలుత రైతుల దీక్షకు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీతో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా యూటర్న్‌ తీసుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం దుర్మార్గమని అన్నారు. పంటలను కొనుగోలు చేస్తే రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్పడం.. ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. సాగు చట్టాలను రద్దు  చేసే వరకూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశాన్ని వ్యాపార శక్తులకు ధారాదత్తం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పంటలు కొనుగోలు చేయబోమని సీఎం కేసీఆర్‌ చెప్పడం మూర్ఖత్వమేనన్నారు. సాగు చట్టాలపై యూటర్న్‌ తీసుకున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


45 రోజులుగా చలిలో దీక్ష చేస్తూ 13 మంది అన్నదాతలు చనిపోయినా ప్రధాని మోదీకి మానవత్వం లేదని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతులకు ఉరితాళ్ల వంటివన్నారు. రాష్ట్రంలో 90ు మంది చిన్నకమతాల రైతులే ఉన్నారని, వారు తమ ఉత్పత్తులను బయటికి తీసుకుపో యి అమ్ముకోగలరా? అని ప్రశ్నించారు. సీనియర్‌ నేత జానారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్య పరిష్కారమయ్యేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రైతుల పట్ల ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గతంలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబును ఇంటికి పంపామని.. మోదీ, కేసీఆర్‌కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.


మొగుడవుతానని.. శిఖండిగా మారాడు: జీవన్‌ రెడ్డి

ప్రధాని మోదీకి మొగుడవుతానని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకుని శిఖండిగా మారారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మద్దతు ధరకు రైతుల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ప్రజల డబ్బును ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి నష్టం అంటే ఎలా? అని ప్రశ్నించారు. దీక్షలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, వి.హన్మంతరావు, కోదండరెడ్డి తదితరులు ప్రసంగించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్‌, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, మధుయాష్కీగౌడ్‌, వంశీచంద్‌రెడ్డి, గీతారెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. సీఎల్పీ దీక్షలో పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, సీతక్క పాల్గొనలేదు. సీతక్క వ్యక్తిగత కారణాలతో రాలేక పోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతుల కోసం విరాళాల సేకరణ చేపట్టగా.. మొత్తం రూ. 4 లక్షలు సమకూరాయి.

Updated Date - 2021-01-10T07:24:42+05:30 IST